
ఉత్తరప్రదేశ్‌లో భారీ ఎన్కౌంటర్ చోటు చేసుకుంది. ఈ ఘటనలో ముగ్గురు ఖలిస్థానీ ఉగ్రవాదులను మృతి చెందగా, ఇద్దరు పోలీసులకు గాయాలయ్యాయి. సోమవారం తెల్లవారుజామున ఎన్కౌంటర్ జరగ్గా, ఘటనాస్థలిలో రెండు ఏకే-47 రైఫిళ్లు, రెండు గ్లాక్ పిస్టల్స్, భారీగా మందుగుండు సామగ్రిని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ‘ఖలిస్థాన్ జిందాబాద్’ ఫోర్స్ టెర్రర్ మాడ్యూల్‌కు చెందిన వ్యక్తులుగా గుర్తించినట్లు పోలీసులు తెలిపారు
ఈ ముగ్గురు ఉగ్రవాదులు ఇటీవల పంజాబ్‌లోని ఓ పోలీస్ పోస్ట్‌పై దాడికి పాల్పడినట్టు అధికారులు తెలిపారు. అనుమానాస్పద వస్తువులతో వారు పురానాపుర్ ప్రాంతంలో సంచరిస్తున్నట్లు పంజాబ్ పోలీసుల నుంచి సమాచారం అందడం వల్ల ఉత్తర్‌ప్రదేశ్ పోలీసులు అప్రమత్తమయ్యారు. పంజాబ్ పోలీసులతో కలిసి పురాన్పుర్లో జల్లెడ పట్టారు. ఈ క్రమంలో ఓ ద్విచక్రవాహనంపై ముగ్గురు ఖలిస్థానీ ఉగ్రవాదులు పారిపోతున్నట్టు గుర్తించారు.
వారిని వెంబడించగా పురాన్‌పుర్ సమీపంలో ఓ నిర్మాణంలో ఉన్న వంతెన కిందకు వెళ్లారు. అన్ని వైపుల నుంచి పోలీసులు వారిని చుట్టుముట్టారు. పోలీసులను చూసి వారిపై ఉగ్రవాదులు కాల్పులకు పాల్పడ్డారు. అప్రమత్తమైన పోలీసులు వారిపై ఎదురుకాల్పులు జరిపారు. ఈ ఎన్కౌంటర్లో ముగ్గురు ఖలిస్థానీ ఉగ్రవాదులు తీవ్రంగా గాయపడ్డారు. సమీపంలోని ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ మరణించారు.
ఎన్కౌంటర్లో హతమైన ఖలిస్థానీ ఉగ్రవాదులను పంజాబ్ గురుదాస్‌పుర్‌కు చెందిన గుర్విందర్ సింగ్ (25), వీరేందర్ సింగ్ అలియాస్ రవి (23), జస్ప్రీత్ సింగ్ అలియాస్ పర్తాప్ సింగ్ (18) గా పోలీసులు గుర్తించారు. ఎన్‌కౌంటర్‌పై పంజాబ్ డీజీపీ గౌరవ్ యాదవ్ ఓ వీడియో సందేశం విడుదల చేశారు. పంజాబ్‌లో ఐఎస్ఐఎస్ ప్రాయోజిత ఉగ్రవాదానికి వ్యతిరేకంగా చేపట్టిన ఆపరేషన్‌లో పురోగతి సాధించినట్టు చెప్పారు. పాక్ ప్రాయోజిత “ఖలిస్థాన్ జిందాబాద్” ఫోర్స్ టెర్రర్ మాడ్యూల్ ఏరివేత కోసం యూపీ, పంజాబ్ పోలీసులు సంయుక్త ఆపరేషన్ నిర్వహించారని చెప్పారు.
More Stories
రైతులకు మరో రెండు పథకాలు ప్రారంభించిన ప్రధాని మోదీ
చొరబాట్లేతోనే ముస్లిం జనాభా అసాధారణంగా పెరుగుదల
మహిళా జర్నలిస్టులు లేకుండా ఆఫ్ఘన్ మీడియా సమావేశం