
రష్యా, ఉక్రెయిన్ మధ్య కొనసాగుతున్న యుద్ధం నేపథ్యంలో ఉక్రెయిన్ ప్రయోగించిన డ్రోన్లు రష్యాలోని ఎత్తైన భవనాలను ఢీకొట్టి పేలాయి. 2001లో న్యూయార్క్‌లోని వరల్డ్ ట్రేడ్ సెంటర్ టవర్లను విమానాలు ఢీకొన్న సంఘటనను ఈ దాడి తలపించింది. ఈ వీడియో క్లిప్స్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి.
శనివారం ఉదయం రష్యాలోని కజాన్ నగరంపై డ్రోన్లతో ఉక్రెయిన్ దాడి చేసింది. రెండు ఎత్తైన భవనాలను రెండు డ్రోన్లు ఢీకొని పేలిపోయాయి. మంటలు చెలరేగడంతో నల్లటి పొగలు దట్టంగా వ్యాపించాయి. ఉక్రెయిన్ కజాన్‌పై 8 డ్రోన్ దాడులను నిర్వహించింది. వీటిలో ఆరు దాడులు నివాస భవనాలపై జరిగాయి.
కజాన్ నగరం రష్యా రాజధాని మాస్కోకు 720 కిలోమీటర్ల దూరంలో ఉంది. ఈ దాడిలో ఇప్పటివరకు ఎలాంటి ప్రాణనష్టం జరగలేదు. దాడికి సంబంధించిన అనేక వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఇందులో చాలా డ్రోన్లు భవనాలను ఢీకొట్టడం కనిపిస్తుంది. ఈ దాడుల తరువాత, కజాన్‌తో సహా రష్యాలోని రెండు విమానాశ్రయాలను మూసివేశారు.
రష్యాలోని కజాన్‌లో కనీసం మూడు ఎత్తైన భవనాలను ఇవి ఢీకొన్నాయి. కాగా, ఎత్తైన ఆయా భవనాల్లోని నివాసితులను సురక్షితంగా ఖాళీ చేయించినట్లు రష్యా మీడియా తెలిపింది. ఉక్రెయిన్ డ్రోన్ల దాడిలో ఎలాంటి ప్రాణనష్టం జరుగలేదని పేర్కొంది. ఈ సంఘటన నేపథ్యంలో కజాన్ విమానాశ్రయంలో విమాన రాకపోకలను తాత్కాలికంగా నిలిపివేసినట్లు వెల్లడించింది.
అంతకు ముందు రోజు రష్యాలోని కుర్స్క్ సరిహద్దులో ఉక్రెయిన్ అమెరికా క్షిపణులను ప్రయోగించింది. ఇందులో ఆరుగురు చనిపోయారు. వెంటనే, రష్యా ఉక్రెయిన్ రాజధాని కైవ్‌పై దాడి చేసి ఒకరిని చంపింది. యూరోపియన్ కమిషన్ చీఫ్ ఉర్సులా వాన్ డెర్ లేయెన్ ప్రకారం, కైవ్‌లో రష్యా లక్ష్యంగా చేసుకున్న భవనం అనేక దేశాల దౌత్య కార్యకలాపాలను నిర్వహించేది. యుద్ధాన్ని ముగించడంపై పుతిన్‌తో మాట్లాడతానని జర్మనీ ఛాన్సలర్ ఓలాఫ్ స్కోల్జ్ చెప్పారు.
More Stories
వారణాసిలో చదివిన నేపాల్ కాబోయే ప్రధాని కార్కి
నేపాల్ తాత్కాలిక ప్రధానిగా సుశీల కర్కిని ఒప్పించిన ఆర్మీ చీఫ్
పాక్, స్విట్జర్లాండ్‌లకు భారత్ హెచ్చరిక