కార్గిల్‌లో స‌మాచారం అందించిన ఆ గొర్రెల కాప‌రి లేరు

కార్గిల్‌లో స‌మాచారం అందించిన ఆ గొర్రెల కాప‌రి లేరు

స‌రిగ్గా 25 ఏండ్ల క్రితం భార‌త్, పాకిస్థాన్ మ‌ధ్య భీక‌ర యుద్ధం జ‌రిగిన సంగ‌తి తెలిసిందే. 1999లో జ‌మ్మూక‌శ్మీర్‌లోని కార్గిల్ ఆక్ర‌మ‌ణ కోసం పాక్ ప‌న్నిన కుట్ర‌ను భార‌త సైన్యం భ‌గ్నం చేసింది. భార‌త భూభాగంలోకి చొచ్చుకొచ్చిన పాక్ బ‌ల‌గాల‌ను మ‌న సైన్యం చిత్తుగా ఓడించి త‌రిమికొట్టింది. అయితే ఈ యుద్ధంలో శత్రువుల చొర‌బాటును ముందుగా ప‌సిగ‌ట్టి మ‌న సైన్యాన్ని అప్ర‌మ‌త్తం చేసింది మాత్రం ఓ సామాన్య గొర్రెల కాప‌రి.

ఆయ‌నే తాషి నామ్‌గ్యాల్. ఆయ‌న ఆర్య‌న్ వ్యాలీలో ఆక‌స్మికంగా మృతి చెందార‌ని, ఓ దేశ‌భ‌క్తుడిని కోల్పోయామ‌ని పోస్టు పెట్టింది సైన్యం.  కార్గిల్ విజ‌య దివ‌స్‌కు 25 ఏండ్లు పూర్త‌యిన సంద‌ర్భంగా ఈ ఏడాది ద్రాస్‌లో నిర్వ‌హించిన వేడుక‌ల‌కు తాషి హాజ‌ర‌య్యారు. 58 ఏండ్ల తాషి నామ్‌గ్యాల్ లఢాక్‌లోని ఆర్య‌న్ వ్యాలీలో మృతి చెందారు. కానీ ఆయ‌న మృతికి గ‌ల కార‌ణాలు తెలియ‌రాలేదు. తాషి మృతిపై భార‌త సైన్యం తీవ్ర దిగ్భ్రాంతి వ్య‌క్తం చేసింది. 

ఓ దేశ భ‌క్తుడిని కోల్పోయాం.. ఆయ‌న ఆత్మ‌కు శాంతి చేకూరాలి. 1999 ఆప‌రేష‌న్ విజ‌య్ స‌మ‌యంలో తాషి అందించిన స‌హ‌కారం చ‌రిత్ర పుట‌ల్లో సువ‌ర్ణాక్ష‌రాల‌తో లిఖించి ఉంటుంది. ఆయ‌న కుటుంబ స‌భ్యుల‌కు ప్ర‌గాఢ సానుభూతి తెలియ‌జేస్తున్నామ‌ని ఫైర్ అండ్ ప్యూరీ కార్ప్స్ సోష‌ల్ మీడియాలో పోస్టు చేసింది.

1999 మే నెల‌లో తాషికి చెందిన బ‌ర్రెలు త‌ప్పిపోవ‌డంతో వాటి ఆచూకీ కోసం బ‌టాలిక్ ప‌ర్వ‌త శ్రేణిలో గాలింపు చేస్తున్నాడు. ఈ స‌మ‌యంలో అక్క‌డ బంక‌ర్‌ల‌ను త‌వ్వుతున్న పాకిస్తాన్ సైనికుల‌ను తాషి గ‌మ‌నించి అప్ర‌మ‌త్త‌మ‌య్యారు. పరిస్థితి తీవ్రతను గ్రహించిన అతను వెంటనే భారత సైన్యానికి సమాచారం అందించాడు. భార‌త సైన్యం కూడా అప్ర‌మ‌త్త‌మై పాక్ చ‌ర్య‌ల‌ను విఫ‌లం చేసింది.