
దేశంలో ప్రస్తుతం కొత్తగా పుట్టుకొస్తున్న మందిరం-మసీదుల వివాదాలపై రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ (ఆర్ఎస్ఎస్) సర్ సంఘచాలక్ డా. మోహన్ భగవత్ ఆందోళన వ్యక్తంచేశారు. అయోధ్యలో రామమందిర నిర్మాణం తర్వాత పలువురు ఇటువంటి సమస్యలను లేవనెత్తడం ద్వారా తాము‘హిందువులకు నాయకులు’ అవుతామని నమ్ముతున్నట్లు ఉన్నారని ఆయన మండిపడ్డారు.
పుణేలోని జరిగిన ఓ కార్యక్రమంలో ‘విశ్వగురు- భారత్’ అనే అంశంపై మోహన్ భగవత్ మాట్లాడుతూ భారత్ సామరస్యంతో కలిసి జీవించగలదని ప్రపంచానికి చూపించాల్సిన అవసరం ఉందని చెప్పారు. భారతీయ సమాజం భిన్నత్వంలో ఏకత్వంతో జీవిస్తోందని తెలిపారు. రామకృష్ణ మఠంలో క్రిస్మస్ జరుపుతామని గుర్తు చేస్తూ మనం హిందువులం కాబట్టే అలా చేయగలమని చెప్పారు.
‘దేశంలో సామరస్యంగా జీవిస్తున్నాం ఈ సామరస్యం ప్రపంచానికి చూపించాల్సిన అవసరం ఉంది. మనం ఓ రోల్ మోడల్‌గా ఉండాలి. రామమందిర నిర్మాణం తర్వాత కొంత మంది కొత్త కొత్త ప్రదేశాల్లో మందిర- మసీదు వివాదాలను తెరపైకి తెచ్చి హిందువులకు నాయకులమవుతామని భావిస్తున్నట్టు ఉన్నారు. ఇది ఏమాత్రం ఆమోదయోగ్యం కాదు’’ అని మోహన్ భగవత్ స్పష్టం చేశారు.
రామమందిర నిర్మాణం అనేది హిందువుల నమ్మకానికి సంబంధించింది అని ఆయన వ్యాఖ్యానించారు. ‘రోజుకో వివాదం పుట్టుకొస్తోంది. దీన్ని మనం ఎలా అనుమతిస్తాం? ఇది కొనసాగడానికి వీల్లేదు. అందరూ కలిసిమెలిసి జీవించగలమని చూపించాల్సిన అవసరం ఉంది’ అని అని డా. భగవత్ పిలుపిచ్చారు.
“మనం `సూపర్ పవర్’ అని కాకుండా `విశ్వగురు’ కావాలని కోరుకొంటున్నాము, ఎందుకంటే సూపర్ పవర్ అయిన తర్వాత ప్రజలు ఎలా ప్రవర్తిస్తారో మనం చూశాము. ఆధిపత్యం కోసం స్వార్థ లాభాలను సాధించడం మన మార్గం కాదు…” అని ఆయన చెప్పారు.
“గతంలోని తీవ్ర వత్తిడుల ప్రభావంతో తీవ్రమైన ద్వేషం, ద్వేషం, శత్రుత్వం, అనుమానం వంటి కొత్త సమస్యలను రోజూ లేవనెత్తడం వల్ల ప్రయోజనం ఉండదు. చివరగా, మన పరిష్కారం ఏమిటి? మనం కలిసి దీన్ని చేయగలమని ప్రపంచానికి చూపించాలి… అందరికీ వసతి కల్పించే అనేక వర్గాలు, భావజాలాలు…,” అని భగవత్ తెలిపారు.
గత కొన్ని రోజుల నుంచి ఆలయాలపై మసీదులు, దర్గాలను నిర్మించారని ఆరోపిస్తూ సర్వేలు చేపట్టాలని కోరుతూ కోర్టుల్లో పలు వ్యాజ్యాలు దాఖలవుతున్నాయి. మోహన్ భగవత్ తన ప్రసంగంలో మాత్రం ప్రత్యేకంగా వాటి పేరు ప్రస్తావించలేదు. బయటి నుంచి వచ్చిన కొన్ని గ్రూపులు పాత పాలన మళ్లీ రావాలని కోరుకుంటున్నారని ఆయన ఈ సందర్భంగా హెచ్చరించారు.
‘కానీ ఇప్పుడు దేశం రాజ్యాంగం ప్రకారం నడుస్తుంది. ఈ వ్యవస్థలో ప్రజలు తమ ప్రతినిధులను, ప్రభుత్వాన్ని నడిపించే వారిని ఎన్నుకుంటారు. ఆధిపత్యం చెలాయించే రోజులు పోయాయి ’ అని స్పష్టం చేశారు. మొఘల్ చక్రవర్తి ఔరంగజేబు పాలన అటువంటిదని, అయితే అతని వారసుడు బహదూర్ షా జాఫర్ 1857లో గోహత్యను నిషేధించాడని డా. భగవత్ గుర్తుచేశారు.
‘‘అయోధ్యలో రామమందిరాన్ని హిందువులకే ఇవ్వాలని ముస్లింలు నిర్ణయించారు. కానీ బ్రిటీషర్లు దానిని పసిగట్టి రెండు వర్గాల మధ్య విబేధాలను సృష్టించారు. అప్పటి నుంచి ఈ వేర్పాటువాద భావం ఏర్పడింది. ఫలితంగా పాకిస్థాన్ ఉనికిలోకి వచ్చింది” అని తెలిపారు. ” మైనార్టీలు ఎవరు? మెజార్టీలు ఎవరు? అందరూ సమానమే. ఈ దేశం సంప్రదాయం ఏంటంటే ఎవరికి నచ్చిన విధంగా వాళ్లు ప్రార్ధిస్తుంటారు. సామరస్యంతో జీవించడం, నియమాలు, చట్టాలకు కట్టుబడి ఉండటం మాత్రమే అవసరం’’ అని ఆర్ఎస్ఎస్ అధినేత పిలుపిచ్చారు.
ప్రపంచం అంతా ఐక్యంగా ఉండాలంటే ఒకేలా ఉండాలని విశ్వసిస్తుండగా, “వైవిధ్యం ఐక్యతకు ఆభరణం” అని మనం నమ్ముతున్నామని, దానిని మనం గౌరవించి అంగీకరించాలని ఆర్‌ఎస్‌ఎస్ అధినేత స్పష్టం చేశారు. అధునాతన సౌకర్యాలు, సంపద ఉన్నప్పటికీ, ప్రపంచానికి శాంతి లేకపోవడం ఇదేనని భగవత్ పేర్కొన్నారు.
“అందుకే ప్రపంచానికి గురువు అవసరం. భారతదేశం ఆ అవసరాన్ని తీర్చగలదు. కుల, మత భేదాలను మరచిపోయి సాధువులు చూపిన సమానత్వ మార్గంలో నడిచేవాడు విశ్వగురువు” అని ఆయన తెలిపారు. భారతదేశం అభివృద్ధి చెందుతోంది కానీ నైతిక మార్గంలో పురోగతి సాధించాల్సిన అవసరం ఉందని భగవత్ చెప్పారు. “అలా జరిగితే, రాబోయే 20 సంవత్సరాలలో మనం విశ్వసగురువు హోదాను సాధించగలం” అని ఆయన స్పష్టం చేశారు.
More Stories
అభివృద్ధి మొదట అట్టడుగు వర్గాలకే అన్న దీనదయాళ్!
లేహ్‌లో ఆందోళనల వెనుక కుట్ర.. నలుగురు మృతి
అస్తిత్వ సంక్షోభంలో హిమాచల్ ప్రదేశ్