
పార్లమెంట్లో పోటాపోటీ నిరసన ప్రదర్శనలతో నెలకొన్న గందరగోళంలో పార్లమెంట్‌లోని మకర ద్వారం వద్ద ఇండియా కూటమి, బీజేపీ ఎంపీలు ఎదురుపడ్డారు. దీంతో అక్కడ తోపులాట జరిగింది. ఆ ఘర్షణలో బీజేపీ ఎంపీలు ప్రతాప్ సారంగి, ముకేశ్ రాజ్‌పుత్ గాయపడ్డారు.
బీజేపీ ఎంపీలు తనను నెట్టివేశారని, పార్లమెంట్ లోపలికి వెళ్లకుండా అడ్డుకున్నారని రాహుల్ గాంధీ ఆరోపించారు. తాను పార్లమెంటు లోపలికి వెళ్తుంటే బీజేపీ ఎంపీలే తమను అడ్డుకుని నెట్టేశారని, బెదిరించారని రాహుల్ చెప్పారు. మల్లికార్జున ఖర్గేను కూడా తోసివేశారని ఆ సమయంలోనే ఈ ఘటన జరిగిందని పేర్కొంటూ ఇదంతా కెమెరాల్లో నిక్షిప్తమై ఉంటుందని తెలిపారు.
కానీ రాహుల్ గాంధీ తోయడం వల్లే ఎంపీలకు గాయమైనట్లు పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి కిరణ్ రిజిజు తెలిపారు. తీవ్రంగా గాయపడ్డ ఎంపీ ముకేశ్ రాజ్‌పుత్‌ను ఆస్పత్రిలో చేర్పించారు. ఆయన పరిస్థితి తలకు గాయం కావడంతో సీరియస్‌గా ఉన్నట్లు తెలుస్తోంది.
రాహుల్‌గాంధీ ఓ ఎంపీని నెట్టేశారని, ఆ ఎంపీ తనపై పడిపోయారని, దాంతో తాను కింద పడిపోయినట్లు బీజేపీ ఎంపీ ప్రతాప్ చంద్ర సారంగీ తెలిపారు. రాహుల్ గాంధీ ఎంపీని తోసివేసిన సమయంలో తాను మెట్ల వద్ద నిలుచుకున్నట్లు చెప్పారు. ఆయన పరిస్థితి విషమంగా ఉందని ఆర్ఎమ్ఎల్ ఆసుపత్రి ఐసియులో చికిత్స అందిస్తున్నారని బిజెపి వర్గాలు తెలిపాయి.
సారంగి, ముకేష్‌లను కేంద్ర మంత్రులు ప్రహ్లాద్ జోషి, శివరాజ్ సింగ్ చౌహన్‌లతో పాటు టీడీపీ ఎంపీ అప్పల నాయుడు ఆసుపత్రికి వెళ్లి పరామర్శించారు. మరోవైపు గాయపడిన ఎంపీలకు రాహుల్ గాంధీ క్షమాపణ చెప్పాలని కేంద్ర మంత్రి కిరణ్ రిజిజు డిమాండ్ చేశారు.
More Stories
బంధుప్రీతి లేని ఏకైక ప్రదేశం ‘సైన్యం’
గగన్‌యాన్ ‘వ్యోమమిత్ర’లో ఏఐ ఆధారిత రోబో
ఆన్లైన్ ద్వారా ఓట్లను తొలగించటం అసాధ్యం