
‘బలగం’ చిత్రంలో ‘తోడుగా మాతోడుండి’ పాటతో రెండు తెలుగు రాష్ట్రాలోను పేరొందిన జానపద కళాకారుడు మొగిలయ్య కొన్నాళ్లుగా అనారోగ్య సమస్యలతో బాధపడుతూ గురువారం తెల్లవారుజామున కన్నుమూశారు. కిడ్నీలు ఫెయిల్ అయ్యి తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన వరంగల్లోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్స తీసుకుంటున్నారు. పరిస్థితి విషమించడంతో గురువారం తుది శ్వాస విడిచారు.
వరంగల్ జిల్లా దుగ్గొండి మండలానికి చెందిన మొగిలయ్య (67) బలగం సినిమాతో ఎంతో గుర్తింపు తెచ్చుకున్నారు. మొగిలయ్య కిడ్నీ సంబంధిత వ్యాధితోపాటు గుండెకు సంబంధించిన సమస్యతో కూడా బాధపడుతున్నారు. జానపద గాయకుడిగా గుర్తింపు పొందిన మొగిలయ్య ఆ కళతోనే జీవితం సాగించేవారు.
తన కళను గుర్తించిన దర్శకుడు వేణు యెల్దండి బలగం సినిమాలో ‘తోడుగా మాతోడుండి’ పాట పాడే అవకాశం ఇచ్చారు. క్లైమాక్స్ లోని భావోద్వేగభరిత పాటతో మొగిలయ్య అందరి మన్ననలు పొందారు. దానితో పాపులర్ అవ్వడంతో ఆయనెవరో జనాలకు తెలిశారు.
ఆ తర్వాత కొన్నాళ్లకు మొగిలయ్య అనారోగ్యంతో పరిస్థితి విషమంగా మారిందనే వార్తలు రావడంతో తెలంగాణ ప్రభుత్వం స్పందించి చికిత్స అందించింది. హైదరాబాద్ తరలించి మెరుగైన వైద్య సదుపాయాలు కల్పించారు. ఇటీవల పొన్నం సత్తయ్య అవార్డు ఫంక్షన్ లో మంత్రి పొన్నం ప్రభాకర్ మొగిలయ్య దంపతులకు ఇంటి స్థలంతో పాటు ఇంటి నిర్మాణం చేసి ఇస్తామని, వైద్య ఖర్చులు మొత్తం ప్రభుత్వమే భరిస్తుందని ప్రకటించారు.
స్పీకర్ గడ్డం ప్రసాద్ కొద్ది రోజుల క్రితం లక్ష ఆర్థిక సాయం అందించారు. దర్శకుడు వేణుతోపాటు మెగాస్టార్ చిరంజీవి కూడా ఆర్థిక సాయం అందజేశారు. మొగిలయ్య మరణం పట్ల బలగం సినిమా డైరెక్టర్ వేణు యెల్డండి, నటీనటులు సంతాపం ప్రకటించారు.
More Stories
ఓ ఉగ్రవాది అరెస్టుతో ఉలిక్కిపడ్డ బోధన్
జూబ్లీ హిల్స్ లో బిఆర్ఎస్ అభ్యర్థి మాగంటి సునీత
కాళేశ్వరం రూ. లక్ష కోట్ల అవినీతిపై సిబిఐ విచారించాలి