
కేంద్ర మంత్రి అమిత్ షా రాజ్యసభలో తన ప్రసంగంలో రాజ్యాంగ నిర్మాత బీఆర్ అంబేద్కర్‌ను అవమానించినట్లు ఆరోపిస్తూ ఆయన క్షమాపణ చెప్పాలని కాంగ్రెస్ పార్టీ, ఇతర ప్రతిపక్షాలు డిమాండ్ చేస్తుండడంతో పెను దుమారం చెలరేగింది. అమిత్ షాపై సభాహక్కుల తీర్మానం కూడా ఇచ్చాయి. అయితే, ఈ విషయమై కాంగ్రెస్ చేస్తున్న ఆరోపణల పట్ల ప్రధాని నరేంద్ర మోదీ తీవ్రంగా స్పందించారు.
అంబేద్కర్ ను అవమానపరుస్తూ కాంగ్రెస్ వరుసగా చేస్తున్న `పాపాల జాబితా’ను ఆయన ఎక్స్ వేదికగా వివరించారు. అంబేద్కర్‌ను అవమానించిన కాంగ్రెస్ చీకటి చరిత్రను అమిత్ షా బహిర్గతం చేశారని, దీంతో హస్తం పార్టీ ఉలిక్కిపడిందని బుధవారం ఎద్దేవా చేశారు. కాంగ్రెస్ కొన్నేళ్లపాటు దేశంలో అధికారంలో ఉన్నప్పటికీ ఎస్సీ, ఎస్టీల సాధికారత కోసం ఏమీ చేయలేదని ప్రధాని ఆరోపించారు.
“అంబేద్కర్‌ను అవమానించిన, ఎస్సీ, ఎస్టీ వర్గాలను విస్మరించిన కాంగ్రెస్ చీకటి చరిత్రను పార్లమెంట్ వేదికగా అమిత్ షా బట్టబయలు చేశారు. ఆయన చెప్పిన వాస్తవాలను చూసి కాంగ్రెస్ ఉలిక్కిపడింది. అందుకే పాపం వారు ఇప్పుడు నాటకాలాడుతున్నారు. ప్రజలకు నిజమేంటో తెలుసు. అంబేద్కర్‌ను లోక్ సభ ఎన్నికల్లో కాంగ్రెస్ రెండు సార్లు ఓడిపోయేలా చేసింది. నెహ్రూ ఆయనకు వ్యతిరేకంగా ఎన్నికల్లో ప్రచారం చేశారు” అంటూ ప్రధాని విమర్శించారు.
అలాగే బాబా సాహెబ్‌కు భారతరత్న ఇచ్చేందుకు కాంగ్రెస్ నిరాకరించిందని, అంబేడ్కర్ చిత్రపటాన్ని పార్లమెంటు సెంట్రల్ హాల్‌లో పెట్టడాన్ని కాంగ్రెస్ వ్యతిరేకించిందని మోదీ గుర్తు చేశారు. అంబేద్కర్ వారసత్వాన్ని తుడిచిపెట్టడానికి, ఎస్సీ, ఎస్టీలను కించపరచడానికి రాజవంశం నేతృత్వంలోని ఒక పార్టీ ప్రతి డర్టీ ట్రిక్స్ ఎలా చేస్తుందో దేశ ప్రజలు పదేపదే చూస్తున్నారని మోదీ విమర్శించారు.
కాంగ్రెస్ నేతలు వ్యాప్తి చేసే అబద్దాలు వారి పరిపాలనలోని ఆకృత్యాలను దాచగలవని భావిస్తున్నారని, అందుకే ప్రజలు వారిని తీవ్రంగా తప్పుపడుతున్నారని ఎద్దేవా చేశారు. “గత దశాబ్ద కాలంగా డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ఆశయాలను నెరవేర్చేందుకు మా ప్రభుత్వం అవిశ్రాంతంగా కృషి చేసింది. 25 కోట్ల మందిని పేదరికం నుంచి విముక్తి చేశాం. అలాగే ఎస్సీ, ఎస్టీ చట్టాన్ని బలోపేతం చేశాం. స్వచ్ఛ భారత్, పీఎం ఆవాస్ యోజన, జల్ జీవన్ మిషన్, ఉజ్వల యోజన వంటి కార్యక్రమాలను గత పదేళ్లలో చేపట్టాం. పేద, అట్టడుగు వర్గాలకు సంక్షేమ పథకాలను అందించాం” అని ప్రధాని గుర్తు చేశారు.
“అంబేడ్కర్‌తో అనుబంధం ఉన్న ఐదు ప్రసిద్ధ ప్రదేశాలైన పంచతీర్థాన్ని అభివృద్ధి చేసేందుకు మా ప్రభుత్వం కృషి చేసింది. దశాబ్దాలుగా చైత్ర భూమికి సంబంధించిన సమస్య పెండింగ్‌లో ఉంది. మా ప్రభుత్వం సమస్యను పరిష్కరించింది. అంతేకాదు నేను స్వయంగా అక్కడ ప్రార్థనకు వెళ్లాను. ” అని ప్రధాని మోదీ ఎక్స్‌లో పోస్టు చేశారు.
రాజ్యాంగంపై జరిగిన చర్చ సందర్భంగా బీఆర్ అంబేడ్కర్‌ను అవమానించేలా వ్యాఖ్యలు చేసిన కేంద్ర హోంమంత్రి అమిత్ షా రాజీనామా చేయాలని కాంగ్రెస్ పార్టీ బుధవారం ఉదయం డిమాండ్ చేసింది. రాజ్యసభలో రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్‌పై చేసిన వ్యాఖ్యలకుగానూ అమిత్ షా బహిరంగంగా, పార్లమెంటులో క్షమాపణ చెప్పాలని కోరింది. రాజ్యసభలో అమిత్ షా చేసిన వ్యాఖ్యలు బీజేపీకి, ఆర్ఎస్ఎస్ కు రాజ్యాంగంపై ఉన్న ద్వేషానికి అద్దం పడుతున్నాయని ఆరోపించింది.
బాబా సాహెబ్‌ను విమర్శిస్తే ఊరుకోం
అంతకు ముందు, అమిత్ షా అంబేద్కర్, భారత రాజ్యాంగాన్ని అవమానించారని కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే విమర్శించారు. ఆయనకు మనుస్మృతి, ఆర్ఎస్ఎస్ భావజాలం- బాబా సాహెబ్ అంబేడ్కర్, ఆయన రచించిన రాజ్యాంగాన్ని గౌరవించకూడదని నేర్పుతోందని ఆరోపించారు. అంబేడ్కర్‌పై అమిత్ షా చేసిన వ్యాఖ్యలను ఖండిస్తున్నామని, వెంటనే ఆయన రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. అలాగే దేశ ప్రజలకు క్షమాపణ చెప్పాలని కోరారు.
“అంబేడ్కర్ గురించి హోం మంత్రి మాట్లాడుతున్నప్పుడు మేమంతా ఆపేందుకు ప్రయత్నించాం. అంబేద్కర్ పేరును 100 సార్లు జపించే బదులు భగవంతుని నామాన్ని ఇన్నిసార్లు స్మరించి ఉంటే ఏడుసార్లు స్వర్గానికి వెళ్లి ఉండేవారమని అమిత్ షా అన్నారు. ఆ సమయంలో నేను మాట్లాడేందుకు చేయి ఎత్తాను. కానీ మాట్లాడే అవకాశం ఇవ్వలేదు” అని విమర్శించారు.
“రాజ్యాంగంపై చర్చ జరుగుతున్నందున అందరం సహకరించాలని నిర్ణయించుకుని మౌనంగా కూర్చున్నాం. రాజ్యాంగ నిర్మాత అంబేడ్కర్ ను దూషిస్తే దేశవ్యాప్తంగా నిరసనలు చెలరేగుతాయి. అంబేడ్కర్‌ను అవమానిస్తే విపక్షాలు ఊరుకోవు.” అని ఖర్గే పార్లమెంట్ ఆవరణలో మీడియాతో వ్యాఖ్యానించారు. మనుస్మృతిని విశ్వసించే వారే అంబేడ్కర్‌ను వ్యతిరేకిస్తారని లోక్‌సభలో పక్ష నేత రాహుల్ గాంధీ విమర్శించారు. మరోవైపు, అంబేద్కర్‌పై అమిత్ షా వ్యాఖ్యలు, అదానీ వివాదంపై చర్చించాలని పుట్టపడుతూ బుధవారం దేశవ్యాప్తంగా ఉన్న అన్ని రాష్ట్రాల్లోని రాజ్భవన్ల ముట్టడి కార్యక్రమం చేపట్టింది కాంగ్రెస్.
కాగా, బాబా సాహెబ్ అంబేడ్కర్ పై అమిత్ షా చేసిన వ్యాఖ్యలను కాంగ్రెస్ వక్రీకరిస్తోందని కేంద్రమంత్రి కిరణ్ రిజిజు తెలిపారు. రాజ్యసభలో అమిత్ షా ప్రసంగంలోని చిన్న క్లిప్ ను పట్టుకుని కాంగ్రెస్ దాన్ని వక్రీకరిస్తోందని, అది చాలా తప్పని విమర్శించారు. బాబాసాహెబ్ అంబేద్కర్ బతికున్నప్పుడు కాంగ్రెస్ ఆయనను అవమానించిందని షా స్పష్టంగా చెప్పారని గుర్తు చేసుకున్నారు.
More Stories
ఆఫ్ఘన్ భూభాగాన్ని మరో దేశంకు వ్యతిరేకంగా అనుమతించం!
మరియా కొరీనా మచాడోకు నోబెల్ శాంతి బహుమతి
ఆంగ్లేయుల గురించి ఏనాడూ భ్రమలు లేవు, రాజీ పడింది లేదు