
యువ వైద్యులు గ్రామీణ, గిరిజన ప్రాంతాల్లో వైద్యసేవలు అందించాలని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము సూచించారు. జాతి సమ్మిళిత ఆరోగ్య సంరక్షణలో భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. మంగళగిరి ఎయిమ్స్ తొలి స్నాతకోత్సవానికి ఆమె ముఖ్యఅతిథిగా హాజరయ్యారు.
వైద్యవృత్తిలో పెరుగుతున్న మహిళల భాగస్వామ్యం, వారి సహకారం దేశం అభివృద్ధి చెందిన సమాజంగా మారుతున్నట్లు నిరూపిస్తున్నాయని రాష్ట్రపతి ద్రౌపదీముర్ము చెప్పారు. యువ వైద్యులు చిత్తశుద్ధితో పనిచేసి దేశ ఆరోగ్యాభివృద్ధిలో పాలుపంచుకోవాలని పిలుపునిచ్చారు. యువ వైద్యులు గ్రామీణ, గిరిజన ప్రాంతాల్లో వైద్యసేవలు అందించాలని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము సూచించారు.
సేవ ద్వారా యువ వైద్యులు కీర్తిప్రతిష్టలు పొందాలని, మన దేశం వైద్య సేవలలో ప్రపంచంలోనే ఒక ప్రత్యేకతను సంతరించుకోవడంలో వీరి పాత్ర మరువలేనిదని రాష్ట్రపతి ద్రౌపదిముర్ము తెలిపారు. ఆరోగ్యకరమైన అభివృద్ధి సాధించే దేశం మన అందరి కర్తవ్యం కావాలని పిలుపునిచ్చారు.
‘మెడికల్ టెక్నాలజీ ఎడ్యుకేషన్ తో అందరికీ ఉపయోగపడే సేవలు వైద్యలు అందించాలి. ఆయుష్మాన్ భారత్ ద్వారా దేశ ప్రజలకు ఆరోగ్య సేవలు తేలిగ్గా అందించడమే ధ్యేయం. ప్రపంచ పటంలో భారతదేశం మెడికల్ సేవలలో అందుబాటులో ఉండే దేశంగా నిలవటానికి మన డాక్టర్ల సేవలు మరువలేనివి. ప్రతి రోగికీ సేవలందించాలి. ప్రతి డాక్టర్ సేవకే ప్రాధాన్యత ఇవ్వాలి. యువ డాక్టర్లు సేవ చేయడానికే ప్రాధాన్యత ఇవ్వాలని కోరుతున్నా. ఆరోగ్యకరమైన, అభివృద్ధి సాధించే భారతదేశం మనందరికీ కావాలి’ అని రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము పేర్కొన్నారు.
మంగళగిరి ఎయిమ్స్ నుంచి ఎంబీబీఎస్ పట్టాలు పొందిన వైద్య విద్యార్దుల్లో ఎక్కువ మంది యువతులు ఉండటం చాలా సంతోషకంగా ఉందని, మంగళగిరి ఎయిమ్స్‌కు మొదటి బ్యాచ్ విద్యార్ధులే బ్రాండ్ అంబాసిడర్లు అంటూ అందరికీ తన శుభాకాంక్షలు తెలిపారు. అత్యాధునిక సేవలు అందిస్తున్న ఎయిమ్స్‌కు అన్ని రకాలుగా అండగా ఉంటామన్న సీఎం చంద్రబాబు, సంస్థ దేశంలోనే నెంబర్ -1గా ఉండాలని ఆకాంక్షించారు. అందుకు ఎయిమ్స్ సిబ్బంది కృషి చేయాలని, రాష్ట్ర ప్రభుత్వం కూడా సహకారం అందిస్తుందని సీఎం హామీ ఇచ్చారు.
దేశ ప్రజలందరూ ఆరోగ్యవంతులుగా ఉండాలని, పూర్తి ఆరోగ్యంపై అందరూ దృష్టి పెట్టాలని, ప్రతీరోజూ ఆరోగ్యకరమైన వాతావరణం ఉండేలా చూసుకోవాలని రాష్ట్రపతి ఆకాంక్షించారు. యోగాసనాలు, ప్రాణాయామాలు.. ఆరోగ్యంగా ఉండటానికి దోహదపడతాయని ఆమె చెప్పారు. సమయం, పరిస్ధితులను బట్టి ప్రతీ మనిషి జీవనశైలి ఉండాలని ముర్ము సూచించారు.
మంగళగిరి ఎయిమ్స్ అభివృద్ధికి కూటమి ప్రభుత్వం పూర్తి సాకారం అందిస్తుందని సీఎం చంద్రబాబు తెలిపారు. అత్యాధునిక సేవలందిస్తున్న మంగళగిరి ఎయిమ్స్ దేశంలో మెుదటి స్థానంలో నిలవాలని ఆకాంక్షించారు. మంగళగిరి ఎయిమ్స్ అభివృద్ధి కోసం మరో పది ఎకరాల స్థలం కేటాయిస్తున్నామని చంద్రబాబు వెల్లడించారు.
మంగళగిరి నియోజకవర్గం నుంచి మంత్రి లోకేశ్ ప్రాతినిధ్యం వహిస్తున్నారని, ఎయిమ్స్ అభివృద్ధిపై తనకు కూడా చాలా బాధ్యత ఉందని తెలిపారు. పది రూపాయల రుసుంతో ఎయిమ్స్‌లో వైద్య సేవలకు రావొచ్చని, దేశంలోనే ఎయిమ్స్ మొదటి ర్యాంకు సాధించేలా వైద్య విద్యార్ధులతోపాటు అధ్యాపకులు ఆ దిశగా పనిచేయాలని విజ్ఞప్తి చేశారు.
“భవిష్యత్‌లో మంగళగిరి ఎయిమ్స్ దేశంలో మొదటి స్థానంలో నిలవబోతుంది. మంగళగిరి ఎయిమ్స్ మొదటి స్నాతకోత్సవం జరుపుకోవటం చాలా సంతోషంగా ఉంది. భవిష్యత్తులో ఎటువంటి సమస్యలు ఎదురైనా వాటిని పరిష్కరించటమే మా తొలి ప్రాధాన్యత. ఎయిమ్స్ అభివృద్ధికి పూర్తిస్థాయి సహకారం అందిస్తాం” అని చంద్రబాబు తెలిపారు.
మొదట ప్రత్యేక విమానంలో గన్నవరం విమానాశ్రయానికి చేరుకున్న రాష్ట్రపతి ముర్ముకు గవర్నర్ జస్టిస్ అబ్దుల్ నజీర్, ముఖ్యమంత్రి చంద్రబాబు, ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ సహా పలువురు స్వాగతం పలికారు. అక్కడి నుంచి ఎయిమ్స్‌కు చేరుకుని మొదటి బ్యాచ్‌గా వైద్య విద్యపూర్తి చేసుకున్న 49 మంది ఎంబీబీఎస్ విద్యార్థులకు పట్టాలు ప్రదానం చేశారు.
ప్రతిభ కనబరిచిన నలుగురు విద్యార్థులకు బంగారు పతకాలు అందించారు. కార్యక్రమంలో కేంద్రమంత్రి ప్రతాప్‌రావు జాదవ్, రాష్ట్ర మంత్రులు నారా లోకేశ్, సత్యకుమార్ యాదవ్, సంధ్యారాణి పాల్గొన్నారు.
More Stories
మహిళల నేతృత్వంలో అభివృద్దే `వికసిత భారత్’కు పునాది
అమెరికా సుంకాలతో ప్రపంచ మార్కెట్లు కోల్పోకుండా వ్యూహం!
హైదరాబాద్ భారతీయ ఆత్మలో భాగమైన నిర్ణయాత్మక రోజు