మాస్కోలో ఐఈడీ పేలుడులో కెమిక‌ల్ డిఫెన్స్ చీఫ్ మృతి

మాస్కోలో ఐఈడీ పేలుడులో కెమిక‌ల్ డిఫెన్స్ చీఫ్ మృతి

ర‌ష్యా రాజ‌ధాని మాస్కోలో మంగళవారం అనుమానిత ఐఈడీ పేలుడు సంభ‌వించింది. న‌గ‌రంలోని రాజ‌న్‌స్కీ ప్రాస్పెట్ ప్రాంతంలో ఉన్న ఓ బిల్డింగ్ వ‌ద్ద ఈ ఘ‌ట‌న జ‌రిగింది. ఈ ఘటనలో రష్యా న్యూక్లియర్, బయోలాజికల్, కెమికల్ ప్రొటెక్షన్ ట్రూప్స్ అధినేత లెఫ్టినెంట్ జనరల్ ఇగోర్ కిరిల్లోవ్ దారుణ హత్యకు గురయ్యాడు. 

రష్యాలో అణు, జీవ, రసాయన ఆయుధాల రక్షణ ఆయన అధీనంలోనే ఉంది. కిరిల్లోవ్‌ను తామే చంపినట్లు ఉక్రెయిన్‌ ప్రకటించింది. దీనివెనుక ఉక్రెయిన్‌ సెక్యూరిటీ సర్వీస్‌ ఎస్ బి యు హస్తం ఉన్నట్లు తెలిపింది. అయితే ఆ ఘ‌ట‌న ఎందుకు జ‌రిగింద‌న్న దానిపై ర‌ష్యా ద‌ర్యాప్తు సంస్థ ఇంకా ఎటువంటి వివ‌ర‌ణ ఇవ్వ‌లేదు. మొత్తం 300 గ్రాముల పేలుడు పదార్థాలను ఎలక్ట్రిక్ స్కూటర్‌లో అమర్చారని.. దాన్ని రిమోట్‌తో ఆపరేట్ చేశారని రష్యా పోలీసు అధికారులు చెబుతున్నారు. 

ప్ర‌స్తుతం పేలుడు జ‌రిగిన ప్ర‌దేశంలో ఫోరెన్సిక్ నిపుణులు స‌మాచారం సేక‌రిస్తున్నారు. మెడిక‌ల్‌, బాంబు ఎక్స్‌ప‌ర్ట్స్ కూడా ద‌ర్యాప్తు చేప‌ట్ట‌నున్నారు. సైడ్‌వాక్ వ‌ద్ద ఇద్ద‌రు వ్య‌క్తుల మృత‌దేహాలు ఉన్న‌ట్లు అనేక వీడియోలు, ఫోటోల ఆధారంగా తెలిసింది. మృత‌దేహాల వ‌ద్ద భారీగా ర‌క్తం క‌నిపించింది. అపార్ట్‌మెంట్ బిల్డింగ్‌లో విండోలు, బ్రిక్‌వ‌ర్క్ ధ్వంస‌మైన ఫూటేజ్ కూడా రిలీజైంది.

కెమిక‌ల్ డిఫెన్స్ చీఫ్ లెఫ్టినెంట్ జ‌న‌ర‌ల్ ఇగోర్ కిరిల్లోవ్ మృతిచెందిన‌ట్లు ర‌ష్యా ప్ర‌భుత్వం ద్రువీక‌రించింది. రేడియోలాజిక‌ల్ కెమిక‌ల్ అండ్ బ‌యోలాజిక‌ల్ డిఫెన్స్ ద‌ళాల చీఫ్ ఆ పేలుడు మృతిచెందిన‌ట్లు పేర్కొన్నారు.  మంగళవారం తెల్లవారుజామున  మాస్కోలోని రెసిడెన్షియల్‌ అపార్ట్‌మెంట్‌ బ్లాక్‌కు సమీపంలో స్కూటర్‌లో అమర్చిన బాంబు  పేలిందని, ఈ ఘటనలో ఆయన మరణించినట్లు రష్యా దర్యాప్తు కమిటీ తెలిపింది. 

కిరిల్లోవ్‌తో పాటు ఆయన సహాయకుడు కూడా ఈ పేలుడులో మరణించాడని వెల్లడించింది. 54 ఏళ్ల కిరిల్లోవ్‌ 2017 నుంచి ర‌ష్యా కెమిక‌ల్ డిఫెన్స్ చీఫ్ బాధ్య‌త‌ల‌ను నిర్వ‌ర్తిస్తున్నారు. యుద్ధ‌క్షేత్రంలో ర‌సాయ‌నిక ఆయుధాలు వాడ‌డంలో కిరిల్లోవ్ నిష్ణాతుడు. ఉక్రెయిన్‌లో ఉన్న అనేక ల్యాబ్‌ల‌ను అమెరికా ఆప‌రేట్ చేస్తున్న‌ట్లు ఆయ‌న గ‌తంలో ఆరోపించారు.

కిరిల్లోవ్ హత్యకు ఒక్కరోజు ముందే ఉక్రెయిన్‌పై ఆయన రసాయన ఆయుధాలను ఉపయోగించారని కివ్ ఇండిపెండెంట్ నివేదించింది. ఫిబ్రవరి 2022లో ఉక్రెయిన్‌పై రష్యా సైనిక చర్యలు ప్రారంభించిన సమయంలో ఉక్రెయిన్‌లో నిషేధిత రసాయన ఆయుధాలను వినియోగించారంటూ కిరిల్లోవ్‌కు డిసెంబర్‌ 16న ఉక్రెయిన్‌ కోర్టు గైర్హాజరు శిక్ష విధించింది.