భారత కుబేరుడు గౌతమ్ అదానీపై అమెరికా సంస్థల ఆరోపణల వేడి చల్లారకముందే ఇప్పుడు అలాంటి మరో ముడుపుల వ్యవహారం వెలుగుచూసింది. భారతీయ అధికారులకు లంచాలు ఇచ్చి, అక్రమంగా కాంట్రాక్టులు పొందాయనే ఆరోపణలతో పలు అమెరికన్ కంపెనీలకు యూఎస్ సెక్యూరిటీస్ అండ్ ఎక్స్చేంజ్ కమిషన్(ఎస్ఈసీ) భారీగా జరిమానాలు విధించింది.
మూంగ్ ఐఎన్సీ, ఒరాకిల్ కార్పొరేషన్, అల్బేమర్లే కార్పొరేషన్ వంటి సంస్థలు భారత్లో కాంట్రాక్టులు పొందేందుకు రైల్వే, హెచ్ఏఎల్, ఐఓసీ అధికారులకు లంచాలు ఇచ్చాయని ఎస్ఈసీ పేర్కొన్నది. ఈ ఆరోపణలను తీవ్రంగా పరిగణించిన ఎస్ఈసీ.. లంచాలు ఇచ్చిన మొత్తంపై 300 శాతం వరకు పెనాల్టీలు చెల్లించాలని ఆదేశించింది.
విచారణ నుంచి బయటపడేందుకు ఆయా అమెరికన్ కంపెనీలు ఈ జరిమానాలను ఎస్ఈసీకి చెల్లించి సెటిల్ చేసుకున్నాయి. భారత్లో ప్రభుత్వ అధికారులకు అదానీ సంస్థలు లంచాలు ఇచ్చాయని అమెరికాలో అభియోగాలు నమోదైన నేపథ్యంలో ఎస్ఈసీ చర్యలు కీలకంగా మారాయి. హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్(హెచ్ఏఎల్), భారతీయ రైల్వే అధికారులకు 4.24 కోట్ల లంచాలు ఇచ్చిందని మూంగ్ ఐఎన్సీ అనే సంస్థపై ఆరోపణలు వచ్చాయి. ఈ సంస్థ భారత్లో మూంగ్ మోషన్ కంట్రోల్స్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీని నిర్వహిస్తున్నది.
దక్షిణ మధ్య రైల్వే నుంచి ఓ కాంట్రాక్టును పొందేందుకు ఈ కంపెనీ 2020లో రైల్వే అధికారులతో పాటు రిసెర్చ్ డిజైన్స్ అండ్ స్టాండర్డ్స్ ఆర్గనైజేషన్ అధికారులకు లంచాలు చెల్లించిందని అక్టోబరు 11న జారీ చేసిన ఉత్తర్వుల్లో ఎస్ఈసీ పేర్కొన్నది. హెచ్ఏఎల్ నుంచి రూ.11 కోట్ల కాంట్రాక్టును పొందడానికి ఓ అధికారికి 2.5 శాతం లంచం ఇచ్చినట్టు తెలిపింది.
ఈ ఆరోపణల నేపథ్యంలో రూ.14 కోట్ల జరిమానాను ఎస్ఈసీకి మూంగ్ సంస్థ చెల్లించి రాజీ కుదుర్చుకుంది. 2019లో భారతీయ రైల్వే సహా పలు ప్రభుత్వ రంగ సంస్థల ఉద్యోగులకు 50 కోట్ల మేరకు లంచాలు ఇచ్చిందనే ఆరోపణ కేసులో ఒరాకిల్ సంస్థ రూ.195 కోట్ల జరిమానాను చెల్లించింది. 2009 నుంచి ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్(ఐఓసీ) అధికారులతో పాటు ఇండోనేషియా, వియత్నాం అధికారులకు రూ.539 కోట్ల లంచం ఇచ్చిందనే ఆరోపణల కేసులో అల్బేమర్లే కార్పొరేషన్ రూ.1,680 కోట్ల జరిమానాను చెల్లించింది.
More Stories
ఈపీఎస్ కనీస పెన్షన్ రూ. 2,500కు పెంపు?
దేశంలో ఆరు నగరాల్లోనే సంపద సృష్టి
పెట్రోల్ వాహనాలతో సమానంగా విద్యుత్ వాహనాల ధరలు