దావూద్‌ డ్రగ్‌ ఫ్యాక్టరీ మేనేజర్‌ అరెస్ట్

దావూద్‌ డ్రగ్‌ ఫ్యాక్టరీ మేనేజర్‌ అరెస్ట్
మాఫియా డాన్‌ దావూద్‌ ఇబ్రహీంకు అత్యంత సన్నిహితుడు, దావూద్‌ డ్రగ్‌ ఫ్యాక్టరీ మేనేజర్‌ డానిష్‌ మర్చెంట్‌ అలియాస్‌ డానిష్‌ చిక్నాను పోలీసులు అరెస్టు చేశారు. ఆ మాఫియా డాన్‌ నిర్వహించే డ్రగ్‌ ఫ్యాక్టరీకి సంబంధించిన కార్యకలాపాలను డోంగ్రి ప్రాంతంలో ఇతడే చూసుకుంటాడని సమాచారం. ఇతడితోపాటు మరో ఖాదిర్‌ గులామ్‌ షేక్‌ అనే వ్యక్తిని కూడా పోలీసులు అరెస్టు చేశారు. 
 
మహమ్మద్‌ అషికుర్‌ షిదుర్‌ రహ్మాన్‌, రేహన్‌ షకీల్‌ అన్సారీ అనే ఇద్దరిని గత నెలలో పోలీసులు అరెస్టు చేశారు. వారి నుంచి రాబట్టిన సమాచారం మేరకు తాజాగా చిక్నాను అదుపులోకి తీసుకున్నారు. నవంబర్‌ 8న 144 గ్రాముల డ్రగ్స్‌తో రహ్మాన్‌ను మెరైన్‌ లైన్‌ స్టేషన్‌ పరిధిలో ముందుగా అరెస్టు చేశారు. 
 
అతడు అన్సారీ నుంచి వీటిని కొనుగోలు చేసినట్లు పోలీసులకు సమాచారం ఇవ్వడంతో అధికారులు అన్సారీని కూడా అరెస్టు చేశారు. అతడి వద్ద 55 గ్రాముల మాదకద్రవ్యాలను గుర్తించారు. వీటిని డానిష్‌ మర్చెంట్‌, ఖాదిర్‌ ఫాంటా నుంచి తీసుకొచ్చినట్లు బయటపెట్టారు. పోలీసులు వీరిద్దరి కోసం కొన్ని వారాల నుంచి తీవ్రస్థాయిలో గాలింపు చేపట్టారు. 
 
డిసెంబర్‌ 13న వీరిద్దరూ డోంగ్రి అనే ప్రాంతంలో ఉన్నట్లు పోలీసులకు నమ్మకమైన సమాచారం వచ్చింది. ఈ నేపథ్యంలో అత్యంత పకడ్బందీగా ప్రణాళిక సిద్ధం చేసి వారిపై దాడి చేశారు. డ్రగ్స్‌ రాకెట్‌లో పనిచేస్తున్నట్లు నిందితులు అంగీకరించారు. 2019లో నార్కోటిక్స్‌ కంట్రోల్‌ బ్యూరో అధికారులు ముంబయిలో డోంగ్రిలో డ్రగ్స్‌ ఫ్యాక్టరీ నిర్వహిస్తున్నట్లు గుర్తించి దాడులు చేశారు. 
 
కోట్ల రూపాయల విలువైన మాదక ద్రవ్యాలతోపాటు, మర్చంట్‌ను అరెస్టు చేశారు. అతడు నాటి నుంచి జైల్లోనే ఉంటూ ఇటీవలే విడుదలయ్యారు. మళ్లీ అదే వ్యాపారం చేస్తుండటంతో పోలీసులు అరెస్టు చేశారు.