అమెరికాలో మరో తెలుగు యువతి మృతి

అమెరికాలో మరో తెలుగు యువతి మృతి
* ప్రకాశం జిల్లాకు చెందిన మరో ఇద్దరు అమెరికా, లండన్ లలో మృతి
అమెరికాలో జరిగిన రోడ్డు ప్రమాదంలో గుంటూరు జిల్లా తెనాలికి చెందిన యువతి మృతి చెందిన ఘటన గత శుక్రవారం రాత్రి జరిగింది. గుంటూరు జిల్లా తెనాలికి చెందిన వ్యాపారి గణేష్‌, రమాదేవి దంపతుల కుమార్తె నాగశ్రీ వందన పరిమళ (26)  ఎంఎస్ చేయడానికి   2022 డిసెంబర్‌లో అమెరికాకు వెళ్లారు. అక్కడ టెన్నెసీ రాష్ట్రంలోని ఒక యూనివర్శిటీలో ఎంఎస్‌ చదువుతోంది. 
 
గత శుక్రవారం రాత్రి ఆమె తన స్నేహితులతో కలిసి కారులో వెళుతుండగా, రాక్‌వుడ్‌ ఎవెన్యూ సమీపంలో ట్రక్‌ వెనుక నుంచి కారును ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో కారు నుజ్జునుజ్జు అయింది. నాగశ్రీ వందన పరిమళతో పాటు స్నేహితులకు కూడా తీవ్రగాయాలయ్యాయి. వెంటనే వారిని స్థానిక ఆసుపత్రికి తరలించారు. నాగశ్రీ వందన ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందారు. 
 
ఈ ప్రమాదంలో నాగశ్రీ వందన స్నేహితులు నికిత్‌, పవన్‌ తీవ్రంగా గాయపడి ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. వీరిలో నికిత్‌ ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉండగా, పవన్‌ పరిస్థితి మాత్రం విషమంగా ఉందని తెలిసింది. కుమార్తె మృతి చెందినట్లు నాగ శ్రీ వందన తల్లిదండ్రులకు ఫోన్‌ రావడంతో ఆ కుటుంబం శోకసంద్రంలో మునిగిపోయింది. తల్లిదండ్రులు రోదిస్తున్నారు.
 
కాగా, అమెరికాలో ప్ర‌కాశం జిల్లాకు చెందిన‌ సాఫ్ట్‌వేర్ ఇంజ‌నీర్ బుచ్చిబాబు (40), మృతి చెందారు. ముండ్ల‌మూరుకు చెందిన దొద్దాల కోటేశ్వ‌ర‌రావు, కోటేశ్వ‌ర‌మ్మ‌ల‌కు కుమారుడు బుచ్చిబాబు ఎనిమిదేళ్ల‌గా హైద‌రాబాద్‌లో సాఫ్ట్‌వేర్ ఉద్యోగం చేశాడు. కంపెనీ ఆదేశాల ప్ర‌కారం ఏడాద‌న్న‌ర క్రిత‌మే భార్య కిర‌ణ్మ‌యితో క‌లిసి కాలిఫోర్నియాకు వెళ్లి అక్క‌డే నివాసం ఉంటుంది. అక్క‌డే ఉద్యోగం చేస్తున్నాడు. మూడు రోజుల క్రితం కుటుంబంతో క‌లిసి స‌ర‌దాగా స‌ముద్ర స్నానానికి వెళ్లారు. అక్క‌డ ఈత కొడుతుండ‌గా ప్ర‌మాద‌వ‌శాత్తు స‌ముద్రంలో కొట్టుకుపోయి ఊపిరాడ‌క మృతి చెందాడు.

మరోవైపు లండ‌న్‌లో  ప్రకాశం జిల్లా యువ‌కుడు చీమ‌కుర్తి మండ‌లం బూద‌వాడ‌కు చెందిన పంగ‌లూరి చిరంజీవి నాలుగు రోజులు క్రితం జ‌రిగిన రోడ్డు ప్ర‌మాదంలో  మృత్యువాత ప‌డ్డారు. ఎంఎస్ చేసేందుకు లండ‌న్ వెళ్లాడు.  ఎంఎస్ పూర్తి చేసిన త‌రువాత అక్క‌డే ఉద్యోగం చేస్తున్నారు. మంగ‌ళ‌వారం న‌లుగురు స్నేహితుల‌తో క‌లిసి చిరంజీవి కారులో వెళ్తుతుండ‌గా లీసెస్ట‌ర్ స‌మీపంలో వాహ‌నం అదుపు త‌ప్పి రోడ్డు ప‌క్క‌నే ఉన్న చెట్టుకు బ‌లంగా ఢీకొట్టింది. ఈ ఘ‌ట‌న‌లో తీవ్రంగా గాయ‌ప‌డిన చిరంజీవి అక్క‌డిక‌క్క‌డే మృతి చెందారు.