
సిరియాలో శాంతి స్థాపనతో పాటు రాజకీయ పరివర్తన కోసం అమెరికా, తుర్కియే, ఐరోపా సమాఖ్య, అరబ్ దేశాలు పిలుపునిచ్చాయి. జోర్డాన్‌లో వివిధ దేశాల విదేశాంగ మంత్రులు హాజరై సిరియాలో తదుపరి పరిస్థితులపై చర్చించి సంయుక్త ప్రకటన విడుదల చేశారు. సిరియాలో ఉన్న ఇజ్రాయెల్ దళాలను వెంటనే ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు.
సిరియాలో తీవ్రవాద గ్రూపుల ఆవిర్భావాన్ని నిరోధించాలని, రసాయన ఆయుధాల నిల్వలను సురక్షితంగా నాశనం చేయాలని పిలుపునిచ్చారు. సిరియా ప్రాదేశిక సమగ్రతకు పూర్తి మద్దతును కూడా తెలిపారు. అరబ్ దేశాల విదేశాంగ మంత్రులు మరో ప్రత్యేక ప్రకటన విడుదల చేశారు. సిరియన్లు ఆమోదించిన కొత్త రాజ్యాంగం ఆధారంగా ఐరాస-పర్యవేక్షించే ఎన్నికలకు పిలుపునిచ్చారు. సిరియా బఫర్ జోన్‌తో పాటు సమీపప్రదేశాల్లో ఇజ్రాయెల్ చొరబాట్లను హేయమైన చర్యగా పేర్కొన్నారు.
మరోవైపు సిరియా రాజధాని డమాస్కస్ దాని శివారు ప్రాంతాలపై ఇజ్రాయెల్ దాడులను ఉద్ధృతం చేసింది. ఆయా ప్రాంతాల్లో క్షిపణి బంకర్లు ఉన్నట్లు సిరియా సైనిక వర్గాలు వెల్లడించాయి. పర్వతాల దిగువన ఏర్పాటు చేసిన బంకర్లలోని రాకెట్లను, ఆయుధసామగ్రిని ఇజ్రాయెల్ సైన్యం (ఐడీఎఫ్) ధ్వంసం చేసిందని బ్రిటన్ కేంద్రంగా పని చేస్తున్న సిరియన్ అబ్జర్వేటరీ ఫర్ హ్యూమన్ రైట్స్ (ఎస్‌ఓహెచ్‌ఆర్) స్పష్టం చేసింది.
అంతేకాకుండా పర్వతసానువుల్లోని సొరంగాలను, ఆయుధ డిపోలను, బాలిస్టిక్ క్షిపణి లాంచర్లను కూడా ఐడీఎఫ్ బలగాలు నాశనం చేశాయని వెల్లడించింది. డమాస్కస్‌కు ఉత్తరంగా ఉన్న బార్జేలోని సైనిక శాస్త్రసాంకేతిక విభాగాలకు చెందిన సామగ్రిని కూడా ఐడీఎఫ్ నాశనం చేసినట్లు ఎస్‌ఓహెచ్‌ఆర్ తెలిపింది.
గతంలో ఇజ్రాయెల్‌పైకి సిరియా రసాయన ఆయుధాలను ప్రయోగించింది. అధ్యక్షుడు బషర్ అల్-అసద్ దేశం విడిచి పారిపోయినప్పటి నుంచి ఇజ్రాయెల్ ఆ దేశంపై దాడులు చేస్తూనే ఉంది. వ్యూహాత్మక ప్రదేశాల్లో ఉన్న సిరియా యుద్ధ సామగ్రిని, మిలటరీ వ్యవస్థను సమూలంగా నాశనం చేసే ప్రయత్నాలు చేస్తోంది. ఈ మేరకు సైన్యానికి ఇజ్రాయెల్ పూర్తి స్వేచ్ఛ ఇచ్చింది.
అవసరమైతే అక్కడ కొన్నాళ్లపాటు ఉండేలా ఏర్పాట్లు చేసుకోవాలని ఆ దేశ రక్షణశాఖ మంత్రి ఉన్నతాధికారులకు దిశానిర్దేశం చేశారు. సిరియా సైనిక స్థావరాలే లక్ష్యంగా 350 సార్లు దాడి చేసినట్లు ఐడీఎఫ్ ధ్రువీకరించింది. మరోవైపు రాజకీయ అనిశ్చితి నెలకొన్న తరుణంలో బఫర్ జోన్ ప్రాంతం నుంచి బలగాలను ఉపసంహరించుకోవాలని ఇజ్రాయెల్‌కు ఐక్యరాజ్యసమితి సూచించింది.
సిరియా వ్యవహారాల్లో రష్యా, ఇరాన్‌లు జోక్యం చేసుకోవడం మానుకోవాలని తుర్కియే పేర్కొంది. ‘డమాస్కస్ తిరుగుబాటుదారుల వశమైంది. ఇంకా బషర్ అల్ అసద్ దళాలకు మద్దతు ఇచ్చే ప్రయత్నం రష్యా, ఇరానియన్లు చేయొద్దు’ అని విదేశాంగ శాఖ మంత్రి హకస్ ఫిదాన్ పేర్కొన్నారు.
More Stories
వారణాసిలో చదివిన నేపాల్ కాబోయే ప్రధాని కార్కి
నేపాల్ తాత్కాలిక ప్రధానిగా సుశీల కర్కిని ఒప్పించిన ఆర్మీ చీఫ్
పాక్, స్విట్జర్లాండ్‌లకు భారత్ హెచ్చరిక