భవానీ దీక్ష భక్తుల కోసం ప్రత్యేక యాప్

భవానీ దీక్ష భక్తుల కోసం ప్రత్యేక యాప్
 
 విజయవాడ దుర్గామల్లేశ్వరస్వామి దేవస్థానంలో భవానీ దీక్షల విరమణ కోసం ఏర్పాట్లు చకాచకా జరుగుతున్నాయి. భవానీ దీక్షల విరమణ కోసం సుమారుగా ఐదు లక్షల మంది భక్తులు ఇంద్రకీలాద్రికి వస్తారని అంచనా. ఈ నేపథ్యంలో విజయవాడ దుర్గమ్మ దర్శనం కోసం వచ్చే సామాన్య భక్తులతో పాటుగా భవానీ దీక్షల విరమణకు వచ్చే స్వాములకు అసౌకర్యం కలగకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. 
 
ఈ క్రమంలోనే భవానీ దీక్షల విరమణకు వచ్చే వారి కోసం యాప్ అందుబాటులోకి తెచ్చారు. రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి ఈ యాప్‌ను ప్రారంభించారు. భవానీ దీక్షల విరమణ కోసం ఇంద్రకీలాద్రికి వచ్చే భక్తులకు ఇబ్బందులు కలగకుండా ఈ మొబైల్ యాప్ తెచ్చినట్లు మంత్రి చెప్పారు. 
 
ఇంద్రకీలాద్రిపై క్యూలైన్ల ప్రారంభం. వెయిటింగ్ హాళ్లు, పార్కింగ్ స్థలాలు, లడ్డూ ప్రసాదం పంపిణీ కౌంటర్లు, అన్నప్రసాదం పంపిణీ వివరాలు అన్ని ఈ మొబైల్ యాప్‌లో అందుబాటులో ఉంటాయని మంత్రి వివరించారు. విజయవాడ కనకదుర్గమ్మ దర్శనానికి వచ్చే భవానీ స్వాములు ఈ యాప్‌ను ఉపయోగించుకోవాలని సూచించారు. భవానీ దీక్షల విరమణ కోసం ఐదు రోజుల్లో ఐదు లక్షల మంది వచ్చే అవకాశం ఉన్నట్లు మంత్రి అంచనా వేశారు.

మరోవైపు భవానీ దీక్షల విరమణ సందర్భంగా భక్తులకు ఇబ్బందులు తలెత్తకుండా ప్రత్యేక చర్యలు తీసుకున్నట్లు ఆనం రామనారాయణరెడ్డి తెలిపారు. కనకదుర్గ నగర్‌లో 3 హోమగుండాలను ఏర్పాటు చేసినట్లు వివరించారు. అలాగే ఇరుముడి బియ్యానికి ప్రత్యేక కౌంటర్లు తెరిచినట్లు చెప్పారు. ఇక అందుబాటులోకి తెచ్చిన యాప్ ద్వారా ఎంత మంది భవానీలు దర్శనానికి వచ్చారనే విషయం తెలుస్తుందన్న ఆయన దుర్గమ్మ దర్శనం కోసం యాప్‌లోనే సమయం కూడా నమోదు చేసుకోవచ్చని సూచించారు.

మరోవైపు భవానీ భక్తుల కోసం కనకదుర్గ నగర్‌లో షెడ్లు ఏర్పాటు చేస్తున్నారు. దుర్గాఘాట్‌, పద్మావతి ఘాట్‌, సీతమ్మవారి పాదాలు వంటిచోట్ల ప్రత్యేక షవర్లు ఏర్పాటు చేస్తున్నారు. అలాగే దుర్గమ్మ ఆలయ ప్రాంగంణంతో పాటు, ముఖ్యమైన ప్రదేశాల్లో సీసీ కెమెరాలు ఏర్పాటు చేశారు.