రైతులపై టియర్‌ గ్యాస్‌ ప్రయోగం.. పాదయాత్ర నిలిపివేత

రైతులపై టియర్‌ గ్యాస్‌ ప్రయోగం.. పాదయాత్ర నిలిపివేత
శంభు సరిహద్దు వద్ద మరోసారి ఉద్రిక్తత చోటు చేసుకుంది. తమ డిమాండ్ల పరిష్కారానికై రైతులు చేపట్టిన ‘ఢిల్లీ చలో’ మార్చ్‌ను పోలీసులు అడ్డుకున్నారు. దీంతో అక్కడ ఆందోళనకర పరిస్థితులు తలెత్తాయి. రైతులపై హర్యాణా పోలీసులు టియర్‌ గ్యాస్, జల ఫిరంగులను ప్రయోగించారు. ఈ ఘటనలో సుమారు 17 మంది రైతులకు గాయాలయ్యాయి. 
 
దీంతో రైతు సంఘాల నేతలు కీలక నిర్ణయం తీసుకున్నారు. ఢిల్లీకి తమ పాదయాత్రను మరోసారి నిలిపివేశారు. అంతర్గత సమావేశం అనంతరం తమ తదుపరి కార్యాచరణను ప్రకటిస్తామని రైతు నాయకుడు తేజ్వీర్‌ సింగ్‌ తెలిపారు. శనివారం మధ్యాహ్నం ‘చలో ఢిల్లీ’ మార్చ్‌ను ప్రారంభించారు. కనీస మద్దతు ధర సహా 11 డిమాండ్ల సాధన కోసం 101 మంది రైతులు ఈ మార్చ్‌లో పాల్గొన్నారు. 
 
అయితే, రైతులను శంభు సరిహద్దు వద్ద హర్యాణా పోలీసులు అడ్డుకున్నారు.  ఇక రైతుల ఢిల్లీ చలో మార్చ్‌ను అడ్డుకోవడం ఇది మూడోసారి. డిసెంబర్‌ 6 నుంచి ఢిల్లీ వైపుకు వెళ్లేందుకు రైతులు ప్రయత్నించగా ఇప్పటికే ఆ ప్రయత్నాలను రెండు సార్లు పోలీసులు అడ్డుకున్నారు. దీంతో పోలీసుల తీరుపై రైతులు తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
 
రైతుల నిరసనపై హర్యానా మంత్రి అనిల్ విజ్ మాట్లాడుతూ, “సుప్రీంకోర్టు కేసును విచారిస్తోంది. కొంత సమయం కోరింది. రైతులు కొంతకాలం పాటు తమ నిరసనను నిలిపివేయాలని సుప్రీంకోర్టు సూచించింది. రైతులు కోర్టు మాట వినాలని నేను భావిస్తున్నాను” అని చెప్పారు.
 
హర్యానా- పంజాబ్ శంభు సరిహద్దులో, కాంగ్రెస్ నాయకుడు, రెజ్లర్ బజరంగ్ పునియా స్పందిస్తూ, “ఒక వైపు ప్రభుత్వం రైతులను ఆపడం లేదని చెబుతోంది, మరోవైపు వారు టియర్ గ్యాస్, ఇతర వస్తువులను ఉపయోగిస్తున్నారు. దీనిని పాకిస్తాన్ సరిహద్దులాగా పరిగణిస్తున్నారు. నాయకులు నిరసన తెలిపేందుకు ఢిల్లీకి వెళ్లినప్పుడు, వారు అనుమతి తీసుకుంటారా? రైతులు తమ పంటలకు మద్దతు ధరను మాత్రమే కోరుకుంటున్నారు. మేము ఎల్లప్పుడూ రైతులకు మద్దతు ఇస్తాము. ప్రభుత్వం తన వాగ్దానాలను నెరవేర్చాలి.” అని స్పష్టం చేశారు.
ఇక రైతుల ఢిల్లీ మార్చ్‌ నేపథ్యంలో హర్యాణా ప్రభుత్వం అప్రమత్తమైంది. ముందు జాగ్రత్త చర్యగా మొబైల్‌ ఇంటర్నెట్‌ సేవలను నిలిపివేసింది. శనివారం ఉదయం 6 గంటల నుంచి 17వ తేదీ అర్ధరాత్రి వరకూ సేవలు నిలిపివేస్తున్నట్లు ఓ ప్రకటనలో తెలిపింది. తాము పండించిన పంటలకు కనీస మద్దతు ధరకు చట్టబద్ధత కావాలని రైతులు ప్రధానంగా కోరుతున్నారు. 
 
రుణ మాఫీ చేయాలని, రైతులు, రైతు కూలీలకు పెన్షన్‌ ఇవ్వాలని, విద్యుత్‌ చార్జీలు పెంచరాదని, రైతులపై పెట్టిన పోలీస్‌ కేసులు ఎత్తివేయాలని, 2021 లఖింపూర్‌ ఖీరి బాధితులకు న్యాయం చేయాలని, భూసేకరణ చట్టం 2013ను పునరుద్ధరించాలని, ఆందోళనలో మరణించిన రైతుల కుటుంబాలకు నష్టపరిహారం అందజేయాలని వారు డిమాండ్‌ చేస్తున్నారు.