వేములవాడ ఆలయం వివాదంలో మంత్రి కొండా సురేఖ

వేములవాడ ఆలయం వివాదంలో మంత్రి కొండా సురేఖ
ఇప్పటికే బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌, హీరో అక్కినేని నాగార్జున కుటుంబంపై తీవ్ర వ్యాఖ్యలు చేసి పరువు నష్టం దావాలు ఎదుర్కొంటున్న రాష్ట్ర దేవాదాయ, ధర్మాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ తాజాగా వేములవాడ రాజరాజేశ్వర స్వామి ఆలయంలోని కోడెల వివాదంలో మంత్రి కొండా సురేఖ పేరు వినిపిస్తోంది. 
 
కోడెల పంపిణీలో ఆలయ ఈఓ వినోద్ రెడ్డి ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఈ క్రమంలోనే కోడెలు దారి తప్పుతున్నాయని ఆరోపిస్తూ విశ్వహిందూ పరిషత్, భజరంగ్ దళ్ నాయకుల ఫిర్యాదు చేయటంతో పలు ఆసక్తికర విషయాలు వెలుగులోకి వచ్చాయి.

మంత్రి కొండా సురేఖ సిఫార్సుతోనే ఆగస్టు 12న ఆమె అనుచరుడైన రాంబాబు అనే వ్యక్తికి ఆలయ అధికారులు 49 కోడెలను అందించినట్టు పెద్ద ఎత్తున ఆరోపణలు వినిపిస్తున్నాయి. మంత్రిని మెప్పించడం కోసమే నిబంధనలకు విరుద్ధంగా కోడెలను అప్పగించారనే ప్రచారం నడుస్తోంది. కేవలం 2, 3 కోడెలను మాత్రమే రైతులకు అందించి మంత్రి చెప్పినందుకే రాంబాబు అనే వ్యక్తికి ఒకేసారి 49 కోడెలను ఇచ్చారని ఆరోపిస్తున్నారు. 
 
అయితే తాను మాత్రం కోడెలను టెండర్ ద్వారా పొందినట్లు రాంబాబు పోలీసులకు చెప్తున్నాడు. ఈ నేపథ్యంలో మంత్రి అనుచరుడు రాంబాబుపై వరంగల్ జిల్లా గీసుకొండ పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదైంది. పశువుల వ్యాపారి అయిన మంత్రి అనుచరుడు రాంబాబుకు ఏకంగా 49 రాజన్న కోడెలు అప్పగించడంపై భక్తులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. 
 
నిబంధనలకు విరుద్ధంగా ఒకే వ్యక్తికి 49 కోడెలను కేటాయించడంపై విచారణ జరిపించాలని విశ్వహిందూ పరిషత్, భజరంగ్ దళ్ నాయకులు డిమాండ్ చేస్తున్నారు. మరోవైపు వేములవాడ రాజన్న కోడెల తరలింపుపై ఆలయ ఈఓ కార్యాలయం ఎదుట బీజేపీ నాయకులు ధర్నా చేపట్టారు.  ఈవోను వెంటనే సస్పెండ్ చేసి.. కోడెల వ్యవహారంపై విచారణ చేపట్టాలని డిమాండ్ చేశారు.
మంత్రి అనుచరులకు రాజన్న కోడెలు ఇవ్వడం ఏంటని ప్రశ్నించారు. మంత్రివర్గం నుంచి కొండా సురేఖను కూడా బర్తరఫ్ చేయాలంటూ పెద్ద ఎత్తున డిమాండ్ చేశారు. అయితే, రాజన్న కోడెలు అక్రమ రవాణా జరిగినట్లు వస్తున్న వార్తల్లో నిజం లేదని  కొండా సురేఖ స్పష్టం చేశారు. ప్రభుత్వంపై కుట్రపూరితంగా ప్రచారం అవుతున్న తప్పుడు వార్తలు ఇవన్నీ అంటూ ఆమె కొట్టిపారేశారు. 

కోడెల పంపిణీకి ఆరు నెలల క్రితమే ఓ కమిటీని రూపొందించి మార్గదర్శకాలను రూపొందించామని, దానికి సంబంధించిన జివో విషయాన్ని కూడా మంత్రి కొండా సురేఖ గుర్తు చేశారు. దేవస్థానంలో ప్రతి కోడెకు శాశ్వతమైన ట్యాగ్ ఉంటుందని, అటువంటి ట్యాగ్ లున్న కోడెలు ఎక్కడా పట్టబడలేదని ఆమె వివరించారు.