బిఆర్ఎస్ ఎమ్యెల్యే కౌశిక్ రెడ్డికి జడ్జ్ రిమాండ్ తిరస్కరణ

బిఆర్ఎస్ ఎమ్యెల్యే కౌశిక్ రెడ్డికి జడ్జ్ రిమాండ్ తిరస్కరణ
బిఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి అరెస్ట్ అంతా ఓ నాటకీయంగా మారింది. ఉదయం 10 గంటల ప్రాంతంలో కౌశిక్‌రెడ్డిని అరెస్ట్‌ చేసిన బంజారాహిల్స్‌ పోలీసులు, నోటీసులు ఇచ్చి వదిలిపెట్టేందుకు అవకాశాలున్నా రాత్రి పొద్దుపోయే దాకా పీఎస్‌లోనే నిర్బంధించారు. రాత్రి 10.30 గంటలు దాటిన తర్వాత వైద్య పరీక్షలు నిర్వహించి అర్ధరాత్రి కొత్తపేటలోని న్యాయమూర్తి ఇంట్లో హాజరు పరిచారు. వాదనలు విన్న జడ్జి రిమాండ్‌ను తిరస్కరించారు. కౌశిక్‌కు బెయిల్‌ మంజూరు చేశారు.

గురువారం తెల్లవారుజామునే కొండాపూర్‌లో ఎమ్మెల్యే కౌశిక్‌రెడ్డి నివాసముంటున్న కొల్లా లగ్జరియా విల్లాస్‌ వద్ద బంజారాహిల్స్‌ పోలీసులు, టాస్క్‌ఫోర్స్‌ పోలీసులు భారీగా మోహరించారు. వీరికి తోడుగా గచ్చిబౌలి పోలీసులు కూడా భారీగా అక్కడికి చేరుకున్నారు.

కౌశిక్‌రెడ్డిని అరెస్ట్‌ చేయకుండా అడ్డుకుంటున్నారని సైబరాబాద్‌ పోలీసులు ముందస్తుగా హరీశ్‌రావు, ఎమ్మెల్సీ శంభీపూర్‌ రాజు, మాజీ ఎమ్మెల్యే శంకర్‌నాయక్‌ తదితరులను అరెస్ట్‌ చేసి గచ్చిబౌలి పీఎస్‌కు, మాజీ మంత్రి జగదీశ్‌రెడ్డి, కొత్త ప్రభాకర్‌రెడ్డి, రాకేశ్‌రెడ్డి తదితరులను అరెస్ట్‌ చేసి రాయదుర్గం పీఎస్‌కు తరలించారు.

 
‘నాకు వారెంట్‌ చూపించాలి, నాపై ఏమేం కేసులు నమోదయ్యాయి? వాటిల్లో ఉన్న సెక్షన్లు ఏంటి? నా అరెస్టుకు స్పీకర్‌ అనుమతి ఇచ్చారా?’ అని కౌశిక్‌రెడ్డి పోలీసులను నిలదీశారు. పోలీసులు ఎలాంటి సమాధానం చెప్పకపోవడంతో ఆయన బెడ్రూమ్‌లోకి వెళ్లి తలుపులు వేసుకున్నారు. అయినా లెక్కచేయని పోలీసులు తలపులు బద్దలు కొట్టే ప్రయత్నం చేసి ఆయనను అదుపులోకి తీసుకున్నారు. 
 
బలంతంగా వాహనం ఎక్కించి నేరుగా బంజారాహిల్స్‌ పీఎస్‌కు తరలించారు. మీడియాతో మాట్లాడనీయకుండా ఆంక్షలు పెట్టారు. అరెస్ట్‌ సందర్భంగా కౌశిక్‌రెడ్డి ఇంటి పరిసరాల్లో వందలాదిమంది పోలీసులతో భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు.కౌశిక్‌రెడ్డిని అరెస్ట్‌ చేసేందుకు వచ్చారని తెలిసి మాజీ మంత్రులు, ఎమ్మెల్యేలు హరీశ్‌రావు, జగదీశ్‌రెడ్డి అక్కడికి చేరుకొని ప్రభుత్వం బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేలపై కక్ష సాధింపు చర్యలకు దిగుతున్నదంటూ ఆందోళన చేపట్టారు. 
 
ఈ క్రమంలో మరింతమంది బీఆర్‌ఎస్‌ శ్రేణులు కౌశిక్‌రెడ్డి ఇంటి వద్దకు చేరుకోకుండా విల్లాస్‌ ప్రధాన గేట్‌ను పోలీసులు మూసేయించారు. ఎమ్మెల్సీ శంభీపూర్‌ రాజు గేటు దూకి కౌశిక్‌రెడ్డి ఇంటి వద్దకు చేరుకొని బీఆర్‌ఎస్‌ నాయకులతో కలిసి ఆందోళన నిర్వహించారు.