కరడుగట్టిన లష్కరే ఉగ్రవాది ఎన్‌కౌంటర్

కరడుగట్టిన లష్కరే ఉగ్రవాది ఎన్‌కౌంటర్
కరడుగట్టిన లష్కరే తొయిబా ఉగ్రవాది జునైద్ అహ్మద్ భట్‌ ను ఎన్‌కౌంటర్‌లో భద్రతా బలగాలు మంగళవారంనాడు మట్టుబెట్టాయి. ఇటీవల గందేర్బల్ లోయలోని ఒక ప్రైపేటు కంపెనీ హౌసింగ్ కాంప్‌పై కాల్పులు జరిపి ఆరుగురు కార్మికులు, ఒక డాక్టర్‌ను పొట్టనపెట్టుకున్న ఉగ్రదాడి ఘటనలో అహ్మద్ భట్ ప్రమేయం ఉందని కశ్మీర్ జోన్ పోలీసులు ఒక ట్వీట్‌లో తెలిపారు.

ఎగువ డచిగామ్‌ ప్రాంతంలో ఉగ్రవాదుల కదలికలపై సమాచారం అందడంతో జమ్మూ కశ్మీర్ పోలీసులు, ఆర్మీ సంయుక్తంగా గందేర్బల్‌లో సంయుక్త ఆపరేషన్ నిర్వహించినట్టు అధికారులు తెలిపారు. ఈ సందర్భంగా జరిగిన ఎన్‌కౌంటర్‌లో ఒక ఉగ్రవాది మరణించాడని, అతనని లష్కరే తొయిబా కేటగిరి-ఎ తీవ్రవాద జునైద్ అహ్మద్ భట్‌గా గుర్తించామని చెప్పారు. 

గంగాఘీర్, గందెర్బల్‌లో సాధారణ ప్రజానీకాన్ని పొట్టనపెట్టుకున్న ఘటనల్లో ఇతని ప్రమేయం ఉందని తెలిపారు. ఎన్‌కౌంటర్ పరిసర ప్రాంతాల్లో గాలింపు చర్యలు కొనసాగుతున్నట్టు చెప్పారు. కాగా, గందేర్బల్‌ ఉగ్రదాడి సమయంలో జునైద్ అహ్మద్ భట్ ఏకే సిరీస్ తుపాకీతో తిరుగుతున్నట్టు సీసీటీవీలో నమోదైంది. ఇటీవలే ఆ ఫుటేజ్ బయటకు రావడంతో అప్పట్నించి అతని కదలికలపై పోలీసులు, నిఘా విభాగాలు కన్నేసి ఉంచారు.