ఏటూరునాగారంలో ఏడుగురు మావోయిస్టులు మృతి

ఏటూరునాగారంలో ఏడుగురు మావోయిస్టులు మృతి
 
మావోయిస్టులకు వరుస ఎదురుదెబ్బలు తగులుతున్నాయి. గత కొంతకాలంగా వరుస ఎన్‌కౌంటర్లలో పెద్ద సంఖ్యలో క్యాడర్‌ను కోల్పోతున్నది. తాజాగా ములుగు జిల్లాలో భారీ మావోయిస్టులు, పోలీసులకు మధ్య ఎదురు కాల్పులు చోటుచేసుకున్నాయి. జిల్లాలోని ఏటూరునాగారంలో జరిగిన ఈ ఎన్‌కౌంటర్‌లో ఏడుగురు మావోయిస్టులు మరణించారు. 14 ఏండ్ల తర్వాత ఉమ్మడి వరంగల్‌ జిల్లాలో ఇది అతిపెద్ద ఎన్‌కౌంటర్‌ కావడం విశేషం.
తెలంగాణ గ్రేహౌండ్స్‌, యాంటీ మావోయిస్ట్‌ స్క్వాడ్‌ సంయుక్తంగా ఈ ఆపరేషన్‌ను నిర్వహించాయి. అయితే దీనిని పోలీసులు ఇంకా ధృవీకరించలేదు. ప్రస్తుతం ఎన్‌కౌంటర్‌ జరుగుతుందని, మరికొంతమంది మావోయిస్టులు గాయపడినట్లు తెలుస్తుందని అధికారులు చెప్పారు. ఇల్లందు-నర్సంపేట ఏరియా కమిటీ కార్యదర్శి కురుసం మంగు అలియాస్‌ భద్రు అలియాస్‌ పాపన్న (35)తోపాటు అతని దళ సభ్యులు మృతిచెందారు.
మృతిచెందినవారిలో ఏటూరునాగారం మహదేశ్‌పూర్‌ కార్యదర్శి ఎగోలపు మల్లయ్య అలియాస్‌ మధు (43), ముస్సకి దేవల్‌ అలియాస్‌ కరుణాకర్‌ (22), ముస్సకి జమున (23), జైసింగ్‌ (25), కిశోర్‌ (22), కామేశ్‌ (23) ఉన్నారు. ఈ ఎన్ కౌంటర్ ను ములుగు జిల్లా ఎస్పీ ధ్రువీకరించారు. ఘటనా స్థలిలో భారీగా ఆయుధాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. రెండు ఏకే-47 రైఫిల్స్‌తోపాటు మరికొన్ని పేలుడు పదార్థాలను సైతం స్వాధీనం చేసుకున్నారు.

కాగా, ఈ ఏడాది సెప్టెంబర్‌లోనూ తెలంగాణలో భారీ ఎన్‌కౌంటర్ జరిగింది. భద్రాద్రి-ములుగు జిల్లాల సరిహద్దుల్లోని గుండాల, కరికగూడెం మండలాల పరిధిలో భారీ ఎన్‌కౌంటర్ జరిగింది. నీలాద్రిపేట అటవీ ప్రాంతంలో గ్రేహండ్స్ బలగాలు అడవిలో కూబింగ్ చేపట్టగా… వారికి మావోయిస్టులు తారసపడ్డారు. దీంతో పోలీసులు, మావోయిస్టులకు మధ్య భీకర ఎదురుకాల్పులు జరగాయి. ఈ కాల్పుల్లో లచ్చన్న దళానికి చెందిన ఆరుగురు మావోయిస్టులు హతమయ్యారు.

గత నెల 22న ఛత్తీస్‌గఢ్‌ లోని భెజ్జీ ప్రాంతంలో జరిగిన ఎన్‌కౌంటర్‌లో పది మంది మావోయిస్టులు చనిపోయారు. యాంటీ నక్సల్స్‌ ఆరేషన్‌లో భాగంగా కుంటా పోలీస్‌ స్టేషన్‌ పరిధిలో డిస్ట్రిక్ట్ రిజర్వ్ గార్డ్, మావోయిస్టులు గాలింపు చేపట్టారు. ఈ క్రమంలో ఇరుపక్షాల మధ్య ఎదురుకాల్పులు చోటు చేసుకున్నాయి. దీంతో 10 మంది మృతిచెందారు. ఎన్‌కౌంటర్‌ ప్రాంతం నుంచి మూడు ఆటోమేటిక్‌ తుపాకులతో పాటు పలు ఆయుధాలను స్వాధీనం చేసుకున్నారు.

తెలంగాణలో చాలా కాలంగా మావోయిస్టుల కదలికలు అంతగా లేవనే చెప్పొచ్చు. పోలీసులు తెలంగాణ సరిహద్దుల్లోని అడవిని జల్లెడ పడుతుండటంతో వారి కదలికలు తగ్గాయి. అడపాదడపా ఎన్‌కౌంటర్లు జరిగినా.. ఈ స్థాయిలో మాత్రం మావోయిస్టులు హతం కాలేదు. మరోవైపు పీపుల్స్ లిబరేషన్ గెరిల్లా ఆర్మీ 24వ వార్షికోత్సవాలను డిసెంబర్ 2 నుండి 8 వరకు తెలంగాణ వ్యాప్తంగా నిర్వహించాలని మావోయిస్టు పార్టీ నిర్ణయించింది. కొయ్యూరు ఎన్ కౌంటర్ కు పాతికేళ్ళు అవుతున్న నేపథ్యంలో వారోత్సవాలు నిర్వహించాలని నిర్ణయించింది. ఈ మేరకు ఓ ప్రకటన కూడా విడుదల చేసింది.