ముఖ్యమంత్రి పదవి పోటీ నుండి షిండే వెనకడుగు

ముఖ్యమంత్రి పదవి పోటీ నుండి షిండే వెనకడుగు
* ప్రధాని మోదీ నిర్ణయమే ఆమోదయోగ్యమని ప్రకటన
 
మహారాష్ట్ర ముఖ్యమంత్రి పదవిపై నెలకొన్న సందిగ్థత బుధవారం తొలగిపోయింది. ఇప్పటి వరకు ముఖ్యమంత్రి పదవికోసం పట్టుబడుతున్నట్లు భావిస్తున్న ఆపద్ధర్మ ముఖ్యమంత్రి ఎకనాథ్ షిండే తాను ఓ పదవి కోసం, హోదా కోసం తాపత్రయపడే వ్యక్తిని కాదని స్పష్టం చేశారు. ముఖ్యమంత్రి పదవికోసం పట్టుబట్టడం లేదని స్పష్టమైన సంకేతం ఇస్తూ ఈ విషయంలో ప్రధాని నరేంద్ర మోదీ ఏ నిర్ణయం తీసుకున్నా తనకు ఆమోదయోగ్యమే అని స్పష్టం చేశారు.
“నేనేమీ కలత చెందటం లేదు. నాకేమీ  కోపం లేదు. గత 2-4 రోజులుగా మీరు ఎవరో దుఃఖించారని పుకార్లు చూసి ఉంటారు. మేము బాధపడేవాళ్ళం కాదు.. నేను నిన్న ప్రధానమంత్రితో మాట్లాడి ప్రభుత్వం ఏర్పాటులో మేమేమి అడ్డంగా లేమని చెప్పాను. మీరో నిర్ణయం తీసుకోమని చెప్పాను.  మేము ఆ నిర్ణయాన్ని అంగీకరిస్తాము.. ముఖ్యమంత్రి పదవికి సంబంధించి బీజేపీ సీనియర్ నేతలు ఎలాంటి నిర్ణయం తీసుకున్నా, వారి అభ్యర్థికి శివసేన పూర్తిగా మద్దతు ఇస్తుంది” అని ఏక్‌నాథ్ షిండే ప్రకటించారు.
‘మహాయుతి కార్యకర్తలందరూ కష్టపడి పనిచేశారు. మహాయుతికి మహారాష్ట్ర ప్రజలు ఘన విజయం కట్టబెట్టారు. ఎన్నికల సమయంలో తెల్లవార్లు పనిచేశాను. రోజుకు రెండు మూడు గంటలు మాత్రమే నిద్రపోయాను. ఒక కార్యకర్తలా చెప్పులరిగేలా తిరిగాను. నా దృష్టిలో సీఎం అంటే కామన్‌ మ్యాన్‌. సామాన్య రైతు కుటుంబం నుంచి వచ్చాను. కష్టాలన్నీ తెలుసు. మహిళలు, రైతులు ఇలా అన్నీ వర్గాల సంక్షేమమే లక్ష్యంగా పథకాలు తీసుకొచ్చాం. మా సంక్షేమ పథకాలు చూసిన తర్వాతే ప్రజలు మళ్లీ పట్టం కట్టారు’ అని తెలిపారు. 
 
“సీఎంగా రెండున్నరేళ్లుగా చేసిన పని సంతృప్తినిచ్చింది. ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో ప్రధాని మోదీ, అమిత్‌షా అండగా నిలిచారు. ప్రధాని మోదీ, అమిత్‌ షాతో ఫోన్‌లో మాట్లాడాను. సీఎం ఎంపిక విషయంలో వారు తీసుకునే నిర్ణయానికి కట్టుబడి ఉంటాను” అని ఏక్‌నాథ్‌ షిండే స్పష్టం చేశారు.
 
మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలలో బీజేపీ నేతృత్వంలోని సంకీర్ణాన్ని భారీ విజయానికి నడిపించిన తరువాత, ముఖ్యమంత్రి పదవికి ముందంజలో ఉన్న బిజెపి సీనియర్ నాయకుడు దేవేంద్ర ఫడ్నవిస్ పార్టీ అగ్ర నేతలతో సమావేశాల కోసం సోమవారం అర్ధరాత్రి దేశ రాజధానికి చేరుకున్నారు. షిండే ఈ ప్రకటన చేయడంతో ఇప్పుడు ప్రభుత్వం ఏర్పాటుకు మార్గం సుగమమైంది.