పీటీఐ కార్యకర్తల ఆందోళనలతో అట్టుడుకుతున్న పాక్‌

పీటీఐ కార్యకర్తల ఆందోళనలతో అట్టుడుకుతున్న పాక్‌
మాజీ ప్రధాని, తెహ్రీక్‌-ఇ-ఇన్సాఫ్‌ చీఫ్‌ ఇమ్రాన్‌ ఖాన్‌ మద్దతుదారుల ఆందోళనతో పొరుగుదేశం పాకిస్థాన్‌ అట్టుడుకుతోంది. జైల్లో ఉన్న మాజీ ప్రధానిని విడుదల చేయాలని డిమాండ్‌ చేస్తూ పీటీఐ కార్యకర్తలు లక్షలాది మంది దేశ రాజధాని ఇస్లామాబాద్‌  వైపు మార్చ్‌ నిర్వహించారు. ఇమ్రాన్‌ ఖాన్‌ భార్య బుష్రా బీబీ, ఖైబర్‌ పఖ్తుంఖా ముఖ్యమంత్రి అలీ అమీన్‌ ఈ కవాతుకు నేతృత్వం వహించారు.

ఇమ్రాన్‌ఖాన్‌ మద్దతుదారుల  ర్యాలీపై పోలీసులు కాల్పులు జరిపారు. ఈ కాల్పుల్లో  ఆరుగురు  మరణించినట్లు అధికారులు తెలిపారు. మృతుల్లో నలుగురు భద్రతా సిబ్బంది, ఓ పౌరుడు ఉన్నారని అన్నారు. మద్దతుదారులు రాజధాని చుట్టూ ఏర్పాటు చేసిన భారీ కంటైనర్‌ల వలయాన్ని చేధించేందుకు యత్నించగా పోలీసులు కాల్పులు జరిపారు. 

మద్దతుదారులను చెదరగొట్టేందుకు టియర్‌గ్యాస్‌ ప్రయోగించారని, ఓ జర్నలిస్టు సహా పలువురికి గాయాలయ్యాయి. జర్నలిస్ట్‌ కెమెరాను లాక్కున్నారని, తలకు గాయాలు కావడంతో ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నట్లు అధికారులు తెలిపారు. రాజధానిలో ర్యాలీని నిషేధించామని   అంతర్గత వ్యవహారాల మంత్రి మొహ్సిన్‌ నఖ్వీ పేతెలిపారు. ఉత్తర్వులను ధిక్కరిస్తే భద్రతా దళాలు ప్రత్యక్ష కాల్పులతో స్పందిస్తాయని హెచ్చరించారు. కనిపిస్తే కాల్చివేత ఉత్తరువులు జారీచేశారు.

ర్యాలీని అడ్డుకోవడంలో భాగంగా పోలీసులు శుక్రవారం నుండి 4,000మందికి పైగా మద్దతుదారులను అరెస్ట్‌ చేశారని సంబంధిత అధికారులు తెలిపారు. కొన్ని ప్రాంతాల్లో ఇంటర్నెట్‌ సేవలను నిలిపివేశారు. షిప్పింగ్‌ కంటైనర్లతో రహదారిని బ్లాక్‌ చేయడంతో ఇస్లామాబాద్‌ , ఇతర నగరాల మధ్య రాకపోకలు నిలిచిపోయాయి. అన్ని విద్యాసంస్థలు మూతపడ్డాయి.

డజన్ల కొద్దీ పోలీసులు గాయపడ్డారు. ఇమ్రాన్ మద్దతుదారుల నిరసనలతో దేశవ్యాప్తంగా ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. అక్రమ కేసుల్లో ఇరికించి, ఏడాదిపైగా జైల్లో నిర్బంధించిన తమ పార్టీ నేత ఇమ్రాన్‌ఖాన్‌ను తక్షణమే విడుదల చేయాలని కోరుతూ వేలాది మంది పాకిస్థాన్‌ తెహ్రీక్‌ ఇన్సాఫ్‌ (పిటిఐ) మద్దతుదారులు సోమవారం నుండి లాంగ్‌ మార్చ్‌ చేపట్టారు.

బానిసత్వ సంకెళ్లను తెంచేందుకు చేస్తున్న ఈ నిరసన కవాతులో ప్రజలు పాల్గొనాలని ఇమ్రాన్‌ ఖాన్‌ పార్టీ పీటీఐ పిలుపునిచ్చింది. ఇమ్రాన్‌ ఖాన్‌తో పాటు తమ పార్టీ ఇతర నాయకులను జైళ్ల నుంచి విడుదల చేయాలని, ఫిబ్రవరిలో జరిగిన ఎన్నికల్లో తమ పార్టీ నుంచి దొంగిలించిన మెజారిటీని పునరుద్ధరించాలని, ఉన్నత స్థాయి జడ్జీల నియామకంలో చట్టసభల సభ్యులకు గల అధికారులను పునరుద్ధరించాలని పీటీఐ డిమాండ్‌ చేసింది. 

దీంతో అప్రమత్తమైన ప్రభుత్వం భద్రతా చర్యలు చేపట్టింది. ఇస్లామాబాద్‌లో భారీగా భద్రతా దళాలను మోహరించింది. రోడ్లను మూసివేసి, మొబైల్‌, ఇంటర్నెట్‌ సేవలను నిలిపేసింది.నిరసనకారులు రాజధానిలోకి ప్రవేశించకుండా ప్రభుత్వం హైవేలను సైతం మూసివేసింది. రహదారులకు అడ్డంగా కంటెయినర్లు, కాంక్రటీట్‌ పరికరాలు, బారికేడ్లు ఏర్పాటు చేసింది. అయితే, నిరసనకారులు వాటిని తొలగించి ముందుకు చొచ్చుకొచ్చారు.

ఇస్లామాబాద్‌ సమీపంలో, పంజాబ్‌ ప్రావిన్స్‌ అంతటా జరిగిన ఘర్షణల్లో కనీసం 119 మంది గాయపడ్డారు. 22 పోలీసు వాహనాలకు నిరసనకారులు నిప్పు పెట్టారు. ఇద్దరు అధికారుల పరిస్థితి విషమయంగా ఉన్నట్లు ప్రావిన్షియల్‌ పోలీసు చీఫ్‌ ఉస్మాన్‌ అన్వర్‌ తెలిపారు. ఈ హింసాత్మక ఘటనల్లో ఇమ్రాన్ ఖాన్ మద్దతుదారులకు కూడా గాయాలైనట్లు వెల్లడించారు.