అభివృద్ధికే పట్టం కట్టిన మహారాష్ట్ర ప్రజలు

అభివృద్ధికే పట్టం కట్టిన మహారాష్ట్ర ప్రజలు
తాజా ఎన్నికల్లో ప్రజలు అభివృద్ధికే పట్టం కట్టారని ప్రధాని నరేంద్ర మోదీ తెలిపారు. అబద్ధాలు, వంచన రాజకీయాలకు పాల్పడిన కాంగ్రెస్‌, దాని మిత్రపక్షాలను ఓడించారని చెప్పారు. శనివారం రాత్రి ఢిల్లీలోని బీజేపీ ప్రధాన కార్యాలయంలో ఏర్పాటు చేసిన విజయోత్సవ సభలో మోదీ ప్రసంగించారు. 
 
మహారాష్ట్ర అన్ని రికార్డులను బ్రేక్‌ చేసిందని పేర్కొంటూ గడిచిన 50 ఏళ్లలో ఏ పార్టీ గానీ, ఎన్నికల ముందు ఏర్పాటైన కూటమిగానీ ఇంతటి ఘన విజయం సాధించలేదని గుర్తు చేశారు. ఈ ఎన్నికల్లో మహారాష్ట్ర నుంచి వచ్చిన అతిపెద్ద సందేశం ఐక్యతేనని పేర్కొన్నారు. ‘ఐక్యంగా ఉంటేనే సురక్షితంగా ఉంటాం (ఏక్‌ హై తో సేఫ్‌ హై)’ అనే నినాదమే ఇప్పుడు దేశానికి మహా మంత్రంగా మారిందని చెప్పారు. 
 
కులం, మతం ఆధారంగా దేశాన్ని విభజించాలని కోరుకున్న వారికి ప్రజలు బుద్ధి చెప్పారని ప్రధాని స్పష్టం చేశారు. అన్ని వర్గాల ప్రజలు బీజేపీకి ఓటేశారని మోదీ సంతోషం వ్యక్తం చేశారు. కాంగ్రెస్‌ పార్టీ అధికారం కోసం కులతత్వం అనే విషాన్ని వ్యాపింపజేస్తోందని ప్రధాని మండిపడ్డారు. మహారాష్ట్రలో అస్థిరతను సృష్టించేందుకు యత్నించిన, ద్రోహానికి పాల్పడిన కొందరిని ఓటర్లే శిక్షించారని ప్రధాని మోదీ చెప్పారు.
 
”ఈరోజు మనం మరో చారిత్రక విజయాన్ని నమోదు చేసుకున్నాం. మహారాష్ట్రలో ప్రగతి, సుస్థిరతకు ఓటు వేశారు. అబద్ధాలు, మోసాలు, ప్రతికూల రాజకీయాలను చిత్తు చేశారు” అని కార్యకర్తలను ఉద్దేశించి మాట్లాడుతూ మోదీ తెలిపారు. గత రికార్డులను మహారాష్ట్ర బద్ధలు కొట్టిందని, గత 50 ఏళ్లలో ఏ పార్టీ కానీ, ఎన్నికల ముందు పొత్తులుపెట్టుకున్న కూటములు కానీ సాధించని అతిపెద్ద విజయం ఈసారి నమోదైందని కొనియాడారు. 
 
బీజేపీ సారథ్యంలోని మహాయుతి కూటమిపై ఎంతో నమ్మకముంచి అఖండ విజయం అందించిన మహారాష్ట్ర ప్రజలు, ముఖ్యంగా యువకులు, మహిళలు, రైతులకు తాను కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నానని తెలిపారు. ‘దేశమే ముందు’ అనే వారితో తప్ప ‘కుర్చీయే ముందు’ అనే వారిని ఓటర్లు నమ్మరని తేలిపోయిందని ప్రధాని ఎద్దేవా చేశారు. ప్రపంచంలోని ఏ శక్తీ ఆర్టికల్‌ 370ను పునరుద్ధరించలేదని మోదీ మరోసారి పునరుద్ఘాటించారు. కాంగ్రెస్‌ బుజ్జగింపు రాజకీయాలకు వక్ఫ్‌బోర్డే ఉదాహరణ అని పేర్కొన్నారు. 
 
‘‘కాంగ్రెస్‌ పార్టీ బుజ్జగింపుల కోసమే చట్టాలు చేసింది. వక్ఫ్‌ చట్టమే దానికి ఉదాహరణ. 2014లో ఢిల్లీ సమీపంలోని చాలా ఆస్తులను వక్ఫ్‌ బోర్డుకు కట్టబెట్టారు. రాజ్యాంగంలో వక్ఫ్‌ చట్టానికి చోటే లేదు. కానీ, ఇప్పటికీ ఈ సదుపాయాన్ని కాంగ్రెస్‌ పార్టీ తమ కుటుంబ ఓటు బ్యాంకుగా మార్చుకునే ప్రయత్నాలు చేస్తూనే ఉంది. అసలైన లౌకికవాదాన్ని చంపేసే ప్రయత్నం చేస్తోంది’’ అని మోదీ ధ్వజమెత్తారు.
 
కాగా, అంతకు ముందు మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో ఘనవిజయం సాధించిన అధికార మహాయుతి కూటమికి  ప్రధాని నరేంద్రమోదీ అభినందనలు తెలిపారు. ఇది అభివృద్ధికి, సుపరిపాలనకు ప్రజలు అందించిన విజయమని అభివర్ణించారు. ఐక్యంగా మరిన్ని విజయ తీరాలను చేరాలని ఆయన ఆకాంక్ష వెలిబుచ్చారు.
ఇది అభివృద్ధి విజయమని, సుపరిపాలన సాధించిన గెలుపని, సమష్టిగా ఉంటే మనం మరింత ఎత్తుకు ఎదుగుతామని ప్రధాని మోదీ తెలిపారు.
 
తమకు ఇంతటి చారిత్రక విజయం అందించిన మహారాష్ట్ర ప్రజలకు, ముఖ్యంగా యువతకు, మహిళలకు హృదయపూర్వక కృతజ్ఞతలు అని ఆయన చెప్పారు. మహారాష్ట్ర ప్రగతికి అహరహం పాటుపడుతామని బీజేపీ హామీ ఇస్తోందని స్పష్టం చేశారు. ఈ మేరకు ప్రధాని మోదీ తన అధికారిక ఎక్స్‌ ఖాతాలో ఒక పోస్టు పెట్టారు.
 
జార్ఖాండ్‌ పార్టీ ఫలితాలపై మాట్లాడుతూ, రాష్ట్రాభివృద్ధికి రెట్టించిన ఉత్సాహంతో పనిచేస్తామని వాగ్దానం చేశారు. జార్ఖాండ్ ప్రగతికి అవిశ్రాంతంగా పని చేస్తామని, ఈ లక్ష్య సాధనకు ప్రతి ఒక్క బీజేపీ కార్యకర్త కూడా కట్టుబడి ఉంటారని భరోసా ఇచ్చారు. అక్కడ విజయం సాధించిన హేమంత్ సొరేన్ కు ఆయన అభినందనలు తెలిపారు.