ఖర్గే, రాహుల్ గాంధీకి రూ.100 కోట్ల పరువు నష్టం నోటీసులు

ఖర్గే, రాహుల్ గాంధీకి రూ.100 కోట్ల పరువు నష్టం నోటీసులు

భారతీయ జనతా పార్టీ (బిజెపి) జాతీయ ప్రధాన కార్యదర్శి వినోద్ తావ్డే శుక్రవారం కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే, లోక్‌సభలో ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీ, పార్టీ అధికార ప్రతినిధి సుప్రియా శ్రీనాటేలకు  ఓటర్లకు డబ్బు పంచుతున్నారనే ఆరోపణలపై పరువు నష్టం నోటీసు ఇచ్చారు.

ఆ ముగ్గురు కాంగ్రెస్ నాయకులు క్షమాపణలు చెప్పాలని లేదా వారిపై రూ.100 కోట్ల దావా వేస్తామని తావ్డే లాయర్ లీగల్ నోటీసు పంపారు. తావ్డే వారి నుంచి బేషరతుగా క్షమాపణలు చెప్పాలని కోరారు, క్షమాపణ చెప్పని పక్షంలో తన పరువు తీసేందుకు ప్రయత్నించిన వారిపై క్రిమినల్, సివిల్ కేసులు నమోదు చేస్తానని స్పష్టం చేశారు.

మహారాష్ట్రలో అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా ఓట్ల కోసం నగదు పంపిణీ చేస్తూ పట్టుబడిన తర్వాత తనపై “నిరాధార ఆరోపణలు” చేసినందుకు ఈ నోటీసులు పంపారు. తావ్డే ఆరోపణలను ఖండించగా, బిజెపికి అనుకూలంగా ఎన్నికలను ప్రభావితం చేయడానికి డబ్బు పంపిణీ చేయడం ద్వారా ఆయన అనైతిక మార్గాలను అవలంబిస్తున్నారని ప్రతిపక్షాలు ఆరోపించాయి.

ఎక్స్ లో ఒక పోస్ట్‌లో, తావ్డే ఇలా తెలిపారు: “కాంగ్రెస్ ఏకైక పని అబద్ధాలు ప్రచారం చేయడం! తప్పుడు నల్లసొపర కేసులో కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే, రాహుల్ గాంధీ, పార్టీ అధికార ప్రతినిధి సుప్రియా శ్రీనాట్‌లు ఈ విషయంలో అబద్ధాలు ప్రచారం చేస్తూ నా ప్రతిష్టను, భారతీయ జనతా పార్టీని కించపరిచేందుకు ప్రయత్నించినందున వారికి పరువు నష్టం నోటీసు పంపాను”.

ఎన్నికల సంఘం, పోలీసుల దర్యాప్తులో ఆరోపించిన విధంగా రూ. 5 కోట్లు ఎప్పుడూ స్వాధీనం చేసుకోలేదని పేర్కొంటూ ఈ కేసు కాంగ్రెస్ “అధో స్థాయి రాజకీయాలు,దేశాన్ని త ప్పుదోవ పట్టించడానికి వారి తీరని ప్రయత్నాలను” బట్టబయలు చేసిందని ఆయన విమర్శించారు. బిజెపి “నిజం, ప్రజల విశ్వాసానికి మద్దతుగా నిలుస్తుంది!” అని తావ్డే స్పష్టం చేశారు.

నవంబర్ 20న పోలింగ్‌కు ఒక రోజు ముందు, బహుజన్ వికాస్ అఘాడి (బివిఎ) కార్యకర్తలు తావ్డే, ఇతర బిజెపి కార్యకర్తలు వసాయి విరార్‌లోని ఒక హోటల్‌లో డబ్బు పంపిణీ చేస్తున్నారని ఆరోపించారు. పాల్ఘర్ జిల్లాలో బీజేపీ సీనియర్ నేత వినోద్ తావ్డే డబ్బులు పంచారంటూ బహుజన్ వికాష్ ఆఘాడి (బీవీఏ) నేత హితేంద్ర ఠాకూర్ ఆరోపించారు.

తావ్డే-బీవీఏ నేతలు-కార్యకర్తల మధ్య చోటుచేసుకున్న వివాదానికి సంబంధించిన వీడియో కూడా బయటకు రావడంతో సంచలనమైంది. ఓటర్లను ప్రభావితం చేసేందుకు, రూ.5 కోట్లు పంచేందుకు విరార్ హోటల్‌కు వినోద్ తావ్డే వచ్చారని పలువురు బీజేపీ నేతలు తనకు సమాచారం ఇచ్చారని, ఆయనను తాను విరార్‌లో చూశానని, ఆయనపై ఈసీ చర్యలు తీసుకోవాలని ఠాకూర్ డిమాండ్ చేశారు. 

తావ్డే హోటల్‌లో ఉన్నప్పుడు సీసీటీవీ రికార్డును నిలిపివేశారని, తాము చేసిన విజ్ఞప్తి తర్వాతే సీసీటీవీలను తిరిగి హోటల్ యాజమాన్యం ఆన్ చేసిందని చెప్పారు. ఓటర్లను లోబరుచుకునేందుకు తావ్డే డబ్బులు పంచారని ఆరోపించారు. అయితే, బివిఎ ఆరోపణలను నేరుగా రుజువు చేయలేక పోయినప్పటికీ, ఎన్నికల సందర్భంగా జరిగిన ఈ సంఘటన బిజెపిని ఆత్మరక్షణలో పడవేసింది. 

తావ్డే అన్ని ఆరోపణలను నిరాధారమైనవని తీవ్రంగా ఖండించారు. పార్టీ, దాని జాతీయ ప్రధాన కార్యదర్శి ప్రతిష్టను అణగదొక్కడానికి ప్రతిపక్షాల రూపకల్పనలో భాగంగా డబ్బు పంపిణీ ఆరోపణలు సృష్టించారని పేర్కొంటూ  సీనియర్ బిజెపి నాయకులు కూడా తావ్డేకు మద్దతుగా నిలిచారు. 

కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే సైతం ఈ విషయంపై ప్రధాని నరేంద్ర మోదీపై విరుచుకుపడ్డారు, డబ్బు, కండబలంతో మహారాష్ట్రను “భద్రంగా” ఉంచుతామని ప్రధాని వాగ్దానం చేస్తుంటే, పార్టీ నాయకుడు రూ.5 కోట్ల నగదుతో “రెడ్ హ్యాండెడ్”గా పట్టుబడ్డారని  ఆరోపించారు.