
హైదరాబాద్ నగరంలోని ఎన్టీఆర్ మైదానంలో ఎన్టీవీ- భక్తి టీవీ ఆధ్వర్యంలో వేడుకగా నిర్వహిస్తున్న కోటి దీపోత్సవ కార్యక్రమానికి గురువారం భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము విశిష్ట అతిథిగా హాజరై కోటి దీపోత్సవ వేడుకలో జ్యోతి ప్రజ్వలన చేశారు. కోటి దీపోత్సవంలో పూరీ జగన్నాథునికి రాష్ట్రపతి ముర్ము ప్రత్యేక పూజలు నిర్వహించారు.
యాదగిరి శ్రీ లక్ష్మీనరసింహస్వామికి రాష్ట్రపతి పట్టువస్త్రాలు సమర్పించారు. తొలి కార్తీక దీపాన్ని రాష్ట్రపతి ముర్ము వెలిగించారు. కోటి దీపోత్సవంలో పాల్గొన్న సందర్భంగా రాష్ట్రపతి ముర్ము ప్రసంగిస్తూ దీపాలతో ప్రతి కార్యక్రమాన్ని ప్రారంభించడం మన సంప్రదాయమని ద్రౌపది ముర్ము తెలిపారు. కోటి దీపోత్సవంలో పాల్గొనడం ఎంతో సంతోషంగా ఉందని చెప్పారు.
కార్తీక మాసంలో అందరూ శివున్ని పూజిస్తారని, అసత్యంపై సత్యం గెలిచిన పండగ అని ఆమె పేర్కొన్నారు. తెలుగు నేలపై కార్తీక మాసం వేళ కోటి దీపోత్సవం చేయడం ఎంతో ఆనందంగా ఉందని ఆమె చెప్పారు. అందరూ ఒక్కటై దీపాలు వెలిగించడం ఏకత్వాన్ని సూచిస్తుందని రాష్ట్రపతి వ్యాఖ్యానించారు. యాదాద్రి శ్రీ లక్ష్మీనరసింహ స్వామి కళ్యాణం, పూరీ జగన్నాథుని పూజలో పాల్గొనడం తన అదృష్టమని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము చెప్పారు. 13వ రోజైన నవంబర్ 21న కోటి దీపోత్సవానికి రెండు తెలుగు రాష్ట్రాల నుంచి పెద్ద సంఖ్యలో భక్తులు తరలివచ్చి దీపాలు వెలిగించారు.
గురువారంనాడు విశేష కార్యక్రమాలను నిర్వహించారు. చిలుకూరు బాలాజీ ఆలయ ప్రధాన అర్చకులు సీఎస్ రంగరాజన్ ప్రవచనామృతం వినిపించారు. వేదికపై పూరీ జగన్నాథ హారతి, నృసింహ రక్షా కంకణ పూజ నిర్వహించారు. యాదగిరి శ్రీలక్ష్మీనరసింహ స్వామి కళ్యాణాన్ని వీక్షించిన భక్తులు భక్తపారవశ్యంలో మునిగిపోయారు. వేష వాహనంపై స్వామివారు భక్తులను అనుగ్రహించారు.
చివరలో లింగోద్భవం, సప్తహారతులు, మహా నీరాజనాలతో 13వ రోజు కోటి దీపోత్సవం విజయవంతంగా ముగిసింది. రాష్ట్రపతి ద్రౌపది ముర్ముకు నిర్వాహకులు ఘన స్వాగతం పలికారు. రాష్ట్రపతితోపాటు తెలంగాణ గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ, కేంద్రమంత్రి కిషన్ రెడ్డి, మంత్రి సీతక్క కోటి దీపోత్సవ కార్యక్రమంలో పాల్గొన్నారు. కాగా, గత ఏడాది కోటి దీపోత్సవ కార్యక్రమానికి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ హాజరై ప్రత్యేక పూజలు నిర్వహించిన విషయం తెలిసిందే.
More Stories
గవర్నర్ ఆమోదం పొందని రిజర్వేషన్ల బిల్లులు
ఓ ఉగ్రవాది అరెస్టుతో ఉలిక్కిపడ్డ బోధన్
జూబ్లీ హిల్స్ లో బిఆర్ఎస్ అభ్యర్థి మాగంటి సునీత