* లగిచర్ల వెళ్తున్న అరుణ, ఈటెల, ఏలేటి అరెస్ట్!
శాంతి భద్రతల వైఫల్యం వల్లే వికారాబాద్ జిల్లాలో లగచర్ల ఘటన జరిగిందని బిజెపి ఎంపి డీకే అరుణ విమర్శించారు. లగచర్ల కంపెనీకి భూసేకరణ కోసం రైతులు నిరాకరించారని ఆమె చెప్పారు. వికారాబాద్ కలెక్టర్‌పై దాడి కేసులో అరెస్టు అయి సంగారెడ్డి సెంట్రల్ జైలులో ఉన్న 16 మందితో బిజెపి ఎంపి ఈటల రాజేందర్ తో కలిసి డీకే అరుణ ములాఖత్ అయ్యారు.
అనంతరం ఆమె మీడియాతో మాట్లాడుతూ ఫార్మా కంపెనీ వద్దని గత 8 నెలలుగా రైతులు దీక్షలు చేస్తున్నారని, కానీ, బలవంతంగా భూములు లాక్కుంటామని అధికారులు చెప్పడంతో రైతులు ఆగ్రహనికి గురయ్యారని ఎంపీ ఆరోపించారు. ప్రభుత్వం చేపట్టిన ప్రజావేదికను గ్రామస్థులు బహిష్కరించారని తెలిపారు.
ఈ క్రమంలో పోలీసులకు సమాచారం లేకుండా కలెక్టర్ ఒక్కరే గ్రామానికి వెళ్లారని, అక్కడికి వచ్చిన కలెక్టర్‌ను గో బ్యాక్ అని ప్రజలు నిరసన తెలిపారని చెప్పారు. వాస్తవంగా ప్రజాభిప్రాయ సేకరణకు రాకపోతే వికారాబాద్ జిల్లా కలెక్టర్ ప్రతీక్ జైన్ ఒక్కరే ఎందుకు వెళ్లారని ఆమె నిలదీశారు. పోలీసుల వైఫల్యంతోనే ఈ ఘటన జరిగిందని ఆమె స్పష్టం చేశారు.
సీఎం రేవంత్ సోదరుడు అక్కడ ఉన్న రైతులను బయపెట్టారని, భూములు ఎలాగైనా గుంజుకుంటామని చెప్పారని అరుణ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ ఘటన తర్వాత రాత్రి గ్రామాల్లోకి వచ్చి పోలీసులు ఇష్టం వచ్చినట్లుగా దాడి చేశారని, గొడవ జరిగిన ఘటనలో కాంగ్రెస్ పార్టీ వారిని వదిలేసి మిగతా వారిని అరెస్ట్ చేశారని ఆమె మండిపడ్డారు. సీఎం రేవంత్‌రెడ్డికు ఫార్మా కంపెనీలపై అంత ప్రేమ ఎందుకని డీకే అరుణ ప్రశ్నించారు.
భూములు ఇవ్వమని చెబితే సీఎం రేవంత్ స్వయంగా వెళ్లి వారిని కలిసి మాట్లాడితే బాగుండేదని అరుణ చెప్పారు. కానీ ఇవన్నీ చేయకుండా భయపెట్టి దాడులు చేయించి ఇలా చేయడం కరెక్టు కాదని ఆమె హితవు పలికారు. సీఎం సోదరుడు అక్కడికి వెళ్లవచ్చు కానీ తనను అక్కడికి వెళ్లకుండా ఎందుకు అడ్డుకున్నారని ఆమె ప్రశ్నించారు.
రైతులతో దౌర్జన్యంగా బెదిరించి సంతకాలు పెట్టించుకుంటున్నారని మాజీ మంత్రి ఆరోపించారు. రేవంత్‌రెడ్డి సీఎం అయితే తమ నియోజకవర్గం బాగుంటుందని అనుకుంటే మీరేమో జనాలపై కక్ష కట్టారని ఆమె ధ్వజమెత్తారు. ఓటేసి గెలిపించిన జనాల కాంటే మీకు ఫార్మా కంపెనీ ముఖ్యమా? అని ఆమె ప్రశ్నించారు. సీఎం కొడంగల్ వాసి కాదు వలస వచ్చారని ఆమె ధ్వజమెత్తారు.
మీకు నచ్చిన వారికి కంపెనీలు అప్పజెప్పడానికే ఫార్మా కంపెనీలు పెడుతున్నారా? అని నిలదీశారు. వెంటనే లగచర్ల బాధితులను విడుదల చేయాలని ఆమె డిమాండ్ చేశారు. పేదల ఉసురు పోసుకున్న కేసీఆర్ ఇంటికి పోయారని గుర్తు చేస్తూ మీరు 11 నెలలకే పేదల ఉసురు పోసుకుంటున్నారని విమర్శించారు. సీఎం రేవంత్ అహంకారం వీడాలని, రైతులను ఒప్పించి భూములు తీసుకోవాలని డీకే అరుణ కోరారు.
కాగా, ప్రజాప్రతినిధులుగా లగిచర్ల వెళ్తున్న డీకే అరుణ, ఈటెల రాజేందర్, బిజెపి సీఎల్పీ నేత ఏలేటి మహేశ్వర్ రెడ్డిలను అడ్డుకొని పోలీసులు అరెస్ట్ చేశారు. వారిని అడ్డుకోవడం ప్రభుత్వం పిరికితనానికి, పూర్తి అధికార దుర్వినియోగానికి నిదర్శనం అని కేంద్ర మంత్రి, రాష్ట్ర బిజెపి అధ్యక్షుడు జి కిషన్ రెడ్డి విమర్శించారు.
ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నుకోబడిన ప్రజాప్రతినిధులను అడ్డుకొని అరెస్టు చేయడం రాష్ట్ర ప్రభుత్వ అహంకార ధోరణి ని వెల్లడిస్తోందని ధ్వజమెత్తారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రజా ప్రతినిధులను అరెస్టు చేయించడం.. ప్రజాస్వామ్యంగా ఎన్నుకోబడిన నేతలపై దాడులు చేయించడంగానే భావిస్తున్నట్లు స్పష్టం చేశారు.

More Stories
జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికల్లో ఏపీ బిజెపి నేతల ప్రచారం!
‘కాషాయ జెండా’ తొలగింపుతో దుమారం
వందల మొబైల్ ఫోన్లు పేలడంతో బస్సు ప్రమాదం?