కొత్తగా 500 బ్రాంచీలు తెరవనున్న ఎస్‌బీఐ

కొత్తగా 500 బ్రాంచీలు తెరవనున్న ఎస్‌బీఐ
 
దేశీయ అతిపెద్ద ప్రభుత్వ రంగ బ్యాంకు అయిన స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్‌బీఐ) కస్టమర్లకు బ్యాంకింగ్ సేవలు మరింత చేరువయ్యేందుకు, మారు మూల గ్రామాలకు సైతం బ్యాంకిం సేవలు విస్తరించేందుకు తగిన చర్యలు తీసుకుంటోంది. ఇందులో భాగంగానే ఈ ఆర్థిక ఏడాది 2024-25 నాటికి కొత్త 500 బ్రాంచీలు ఏర్పాటు చేయనున్నట్లు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ సోమవారం ప్రకటించారు. 
 
ఎస్‌బీఐ ముంబై ప్రధాన కార్యాలయ భవనం శతాబ్ది ఉత్సవాల్లో  పాల్గొంటూ బ్యాంకింగ్ ఎకోసిస్టమ్ వృద్ధికి, పీఎస్‌యూ బ్యాంకింగ్ వృద్ధికి ఎస్‌బీఐ ప్రధాన పాత్ర పోషిస్తోందని ఆమె ప్రశంసలు కురిపించారు.

‘ఈ ఆర్థిక ఏడాది 2025లో 500 కొత్త శాకలు తెరవబోతున్నాం. ప్రస్తుతం ఎస్బీఐకి దేశవ్యాప్తంగా 2300 బ్రాంచీలు, 6580 ఏటీఎంలు, 85 వేల బ్యాంకింగ్ కరస్పాండెన్స్ ఉన్నాయి. అలాగే బ్యాంక్ డిపాజిట్లు 22.4 శాతం, అడ్వాన్సులు 19 శాతం, 50 కోట్లకుపైగా కస్టమర్లు, 25 శాతం డెబిట్ కార్డ్ ఖర్చు, మొబైల్ బ్యాంకిం లావాదేవీల్లో 22 శాతం, బ్యాంకులో 25 శాతం యూపీఐ లావాదేవీలు, 29 శాతం ఏటీఎం ట్రాన్సాక్షన్లు జరుగుతున్నాయి’ అని ఆర్ధిక మంత్రి తెలిపారు. 

 
డిజిటల్ టెక్నాలజీని బ్యాంక్ చాలా వేగంగా అందిపుచ్చుకోవడం ప్రశంసనీయం అని ఆమె కొనియాడారు. దేశంలోని అన్నిప్రాంతాల్లోని బ్రాంచీలకు డిజిటల్ సౌకర్యాలు కల్పించడంలో సమానమైన అవకాశాలు కల్పిస్తున్నారని నిర్మలా సీతారామన్ పేర్కొన్నారు.  ఎస్‌బీఐ డిజిటల్ యాప్ ప్రస్తుతం 8 కోట్ల మందికిపైగా కస్టమర్లు వినియోగిస్తున్నట్లు నిర్మలా సీతారామన్  చెప్పారు.
ఇంటర్నెట్ బ్యాంకింగ్ రంగానికి వస్తే ముఖ్యంగా రిటైల్ రంగంలోనే 13.2 కోట్ల మంది వినియోగదారులు ఉన్నట్లు ఆమె తెలిపారు. కొన్ని దేశాల్లో జనాభా సైతం అంత మొత్తం లేదని ఆర్ధిక మంత్రి గుర్తు చేశారు. అంత పెద్ద సంఖ్యలోని ప్రజలకు ఎస్బీఐ డిజిటల్ సేవలందిస్తోందని ప్రశంసించారు.  డిజిటల్ పెట్టుబడులు పెద్ద మొత్తంలో ఉన్నాయని, దాని ద్వారా రోజుకు 20 కోట్ల యూపీఐ ట్రాన్సాక్షన్లు నిర్వహించే సామర్థ్యాన్ని కలిగి ఉన్నట్లు ఆమె చెప్పారు.
దేశంలోని మారుమూల ప్రాంతాల గ్రామాలకు సైతం బ్యాంకింగ్ సేవలు అందించడంలో ఎస్‌బీఐ విశేష కృషి చేస్తోందని ఆమె కొనియాడారు. 2014 నుంచి ఇప్పటి వరుకు చాలా గ్రామాలకు ఎస్‌బీఐ సేవలు విస్తరించాయని గుర్తు చేశారు. అలాగే జన్ ధన్ యోజన, పీఎం సురక్షా యోజన, జీవన్ బీమా యోజన, అటల్ పెన్షన్ యోజన వంటి వివిధ రకాల ప్రజా సంక్షేమ పథకాల అమలులో కీలక పాత్ర పోషిస్తోందని ఆమె వివరించారు.