ఆప్‌ నుండి కైలాశ్‌ గెహ్లాట్‌ బీజేపీలో చేరిక

ఆప్‌ నుండి కైలాశ్‌ గెహ్లాట్‌ బీజేపీలో చేరిక
అసెంబ్లీ ఎన్నికలకు ముందు ఢిల్లీలో అధికార ఆమ్‌ ఆద్మీ పార్టీకి గట్టి షాక్‌ తగిలింది. ఆ పార్టీ కీలక నేతగా వ్యవహరించిన అశోక్‌ గెహ్లాట్‌ ఆదివారం ఢిల్లీ మంత్రి పదవికి,  ఆప్‌కు రాజీనామా చేసిన విషయం తెలిసిందే. తాజాగా ఆయన బీజేపీలో చేరారు. కేంద్ర మంత్రి మనోహర్‌ లాల్‌ ఖట్టర్‌, బీజేపీ జాతీయ ఉపాధ్యక్షుడు బైజయంత్ పాండ, ఢిల్లీ అధ్యక్షుడు వీరేంద్ర సచ్‌దేవ్‌ ల సమక్షంలో బీజేపీ కండువా కప్పుకున్నారు.

బీజేపీలో చేరిన అనంతరం గెహ్లాట్ మాట్లాడుతూ, ఎవరి ఒత్తిళ్లతోనో రాత్రికి రాత్రి తాను ఈ నిర్ణయం తీసుకున్నట్టు కొందరి భావనగా ఉందని, వారికి తాను చెప్పదలచుకున్నది ఒక్కటేనని, ఏనాడూ తాను ఒత్తిళ్లకు లొంగి నిర్ణయాలు తీసుకున్నది లేదని స్పష్టం చేశారు. ఈడీ, సీబీఐ ఒత్తిళ్లతోనే ఈ పరిణామం చోటుచేసుకుందని కొందరు తప్పుగా విశ్లేషిస్తున్నారని చెప్పారు.

”ఆరోజు అందరూ ఒకతాటిపైకి ఎందుకు వచ్చామో అది ఈనాడు కనిపించడం లేదు. ఒక ప్రభుత్వం ప్రతి అంశం మీద కేంద్రంతో గొడవపడుతుంటే ఢిల్లీ అభివృద్ధి అనేది ఎప్పటికీ సాధ్యం కాదు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల సమన్వయంతోనే ఢిల్లీ అభివృద్ధి సాధ్యమని నేను బలంగా నమ్ముతున్నాను. ఆ కారణంగానే నేను బీజేపీలో చేరారు. ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ విజన్, విధానల స్ఫూర్తితో పనిచేస్తాను” అని కైలాష్ గెహ్లాట్ తెలిపారు.

ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలు వచ్చే ఏడాది ప్రారంభంలో జరగాల్సిన తరుణంలో ‘ఆమ్ ఆద్మీ పార్టీ’కి గెహ్లాట్ ఆదివారంనాడు రాజీనామా చేయడం సంచలనమైంది. కేంద్రంతో ‘ఆప్’ ప్రభుత్వ నిరంతర ఘర్షణ, ఇచ్చిన హామీలను నిలబెట్టుకోలేకపోవడం, శీష్‌మహల్ వివాదం, యమునా నది ప్రక్షాళ హామీకు తూట్లు పొడవడం వంటి అంశాలను కేజ్రీవాల్‌కు రాసిన లేఖలో గెహ్లాట్ ప్రస్తావించారు. 

ఆమ్ ఆద్మీ పార్టీని ఇంకా నమ్మాల్సిన అవసరం ఉందా? అనే అభిప్రాయం ప్రతి ఒక్కరిలోనూ ఉందని తప్పుపట్టారు. ప్రజల నమ్మకాన్ని నిలబెట్టుకునేందుకు బదులు రాజకీయ ఆకాంక్షలకే ఆప్ పరిమితమైనందున తాను గత్యంతరం లేకనే పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి, మంత్రి పదవికి రాజీనామా చేస్తున్నట్టు పేర్కొన్నారు. కాగా, గెహ్లాట్ రాజీనామాపై బీజేపీని ఆప్ తప్పుపట్టింది. కేంద్ర ఏజెన్సీలను ఉసిగొలిపి ఒత్తిడి రాజకీయాలకు పాల్పడిందని ఆరోపించింది.