మణిపుర్‌ పరిస్థితులపై హోంశాఖ మంత్రి అమిత్‌ షా సమీక్ష

మణిపుర్‌ పరిస్థితులపై హోంశాఖ మంత్రి అమిత్‌ షా సమీక్ష

ఈశాన్య రాష్ట్రం మణిపుర్‌లో మళ్లీ నెలకొన్న హింసాత్మక పరిస్థితులపై కేంద్ర హోంశాఖ అమిత్‌ షా సమీక్ష నిర్వహించారు. ఉన్నతాధికారులతో సమావేశమైన అమిత్​ షా మణిపుర్‌లో శాంతిస్థాపనకు అవసరమైన అన్ని చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. మహారాష్ట్రలో తన ఎన్నికల ప్రచారాన్ని రద్దు చేసుకుని ఢిల్లీకి తిరిగి వచ్చిన వెంటనే అమిత్‌ షా సమావేశాన్ని నిర్వహించారు.

మరోవైపు బీజేపీ నేతృత్వంలోని మణిపుర్‌ సర్కార్​కు తమ మద్దతును ఉపసంహరించుకున్నట్లు నేషనల్‌ పీపుల్స్‌ పార్టీ- ఎన్​పీపీ ప్రకటించింది. ఈ మేరకు బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డాకు ఎన్​పీపీ లేఖ రాసింది. మణిపుర్‌లో శాంతిభద్రతల సంక్షోభాన్ని పరిష్కరించడంలో సాధారణ స్థితిని పునరుద్ధరించడంలో బీరేన్ సింగ్ ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని లేఖలో పేర్కొంది. 

హింసాత్మక ఘటనల్లో అనేక మంది అమాయకులు ప్రాణాలు కోల్పోయారని అందుకే తమ మద్దతును తక్షణమే ఉపసంహరించుకుంటున్నట్లు లేఖలో తెలిపింది. మణిపుర్‌ అసెంబ్లీలో మొత్తం 60 సీట్లు ఉండగా 53 స్థానాలతో ఎన్డీయే అధికారంలో ఉంది. ఇందులో ‘ఎన్​పీపీ’కి 7 సీట్లు ఉన్నాయి. మైతేయ్‌- కుకీ తెగల మధ్య చెలరేగిన అల్లర్లతో ఏడాదిన్నరగా అతలాకుతలమవుతున్న మణిపుర్‌ మళ్లీ అట్టుడుకుతోంది. మిలిటెంట్లు బందీలుగా పట్టుకుపోయిన ఆరుగురు మైతీలు మృతదేహాలుగా నదిలో తేలడంతో మణిపూర్‌లో మళ్లీ తీవ్ర ఉద్రిక్తతలు చోటు చేసుకున్నాయి.

ఆగ్రహంతో ఉన్న బాధితులు శనివారం మంత్రులు, ఎమ్మెల్యేల ఇళ్లు, ఆస్తులపై దాడి చేశాయి. ఒక మూక తీవ్ర ఆగ్రహంతో ముఖ్యమంత్రి బీరేన్‌ సింగ్‌, మంత్రులు సపం రంజన్‌, ఎల్‌ సుసీంద్రో సింగ్‌, వై కఖేంచంద్‌లతో పాటు బీజేపీ ఎమ్మెల్యేలు సపమ్‌ కుంజాకెసోర్‌, జోయ్‌కిషన్‌ సింగ్‌, మరికొందరి ప్రజాప్రతినిధుల ఇళ్లపై దాడులు చేశారు. 

వారి ఇళ్లల్లోకి నిరసనకారులు చొరబడి ఫర్నిచర్, వాహనాలను, ఇతర సామగ్రిని తగలబెట్టారని పోలీసులు తెలిపారు. ఘటన సమయంలో ఇళ్లలో ఎవరూ లేరని చెప్పారు. ఈ ఘటనలో వారి ఇళ్లు పాకిక్షంగా కాలిపోయినట్లు తెలిపారు. ప్రభుత్వం ముందు జాగ్రత్త చర్యగా ఇంఫాల్‌లో నిరవధిక కర్ఫ్యూను విధించింది. ఏడు జిల్లాల్లో మొబైల్‌ సర్వీస్‌లు, ఇంటర్నెట్‌ను నిలిపివేసింది.

పలువురు మంత్రులు, ఎమ్మెల్యేలు రాజీనామా చేసే యోచనలో ఉన్నట్టు తెలిసింది. టీ రబీంద్రో, టీహెచ్‌ రాధేశ్యామ్‌, పావోనమ్‌ బ్రాజెన్‌లు రాజీనామా చేస్తారని ప్రచారం జరుగుతున్నది. అలాగే తనతో పాటు మిగిలిన కాంగ్రెస్‌ ఎమ్మెల్యేలు కూడా రాజీనామా చేస్తారని ఆ పార్టీ ఎమ్మెల్యే కీషామ్‌ మేఘచంద్ర ఆదివారం తెలిపారు.

ఇంఫాల్‌ లోయలోని 5 జిల్లాల్లో ప్రస్తుతం పరిస్థితులు ఉద్రిక్తంగా ఉన్నాయి. అటు కేంద్రం హోం శాఖ మంత్రి అమిత్‌ షా మహారాష్ట్రలోని తన ఎన్నికల ప్రచారాలను రద్దు చేసుకున్నారు. హుటాహుటిన దిల్లీకి వెళ్లి మణిపుర్‌ పరిస్థితిని సమీక్షించారు. 

దీనితో పలు ప్రాంతాల్లో భద్రతా బలగాలు పెట్రోలింగ్‌ను ముమ్మరం చేశాయి. మణిపుర్‌ రాష్ట్ర సచివాలయం, ఎమ్మెల్యేల నివాసాలు, బీజేపీ రాష్ట్ర కార్యాలయంతో పాటు రాజ్‌భవన్‌కు వెళ్లే అన్ని ప్రధాన రహదారుల వద్ద భారీస్థాయిలో భద్రత బలగాలు మోహరించాయి. మరోవైపు 24 గంటల్లో సాయుధ మిలిటెంట్‌ గ్రూపులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేస్తూ మైతేయి సంఘాలు మణిపుర్‌ ప్రభుత్వానికి ఆల్టిమేటం జారీ చేశాయి.