న‌టి క‌స్తూరి హైదరాబాద్ లో అరెస్ట్

న‌టి క‌స్తూరి హైదరాబాద్ లో అరెస్ట్

తెలుగు మహిళలపై వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన నటి కస్తూరిని తమిళనాడు రాష్ట్ర పోలీసులు హైదరాబాద్ లో అరెస్టు చేశారు. నవంబర్3వ తేదీ నుంచి పరారీలో ఉన్న ఆమెను హైదరాబాద్‌లోని గచ్చిబౌలిలో తమిళనాడు పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అనంతరం ప్రత్యేక వాహనంలో చెన్నైకి తరలించారు. 

హిందూ మక్కల్ కట్చి ఆధ్వర్యంలో చెన్నైలో నిర్వహించిన ఆందోళనలో పాల్గొన్న కస్తూరి తెలుగువారిపై అభ్యంతరకర వ్యాఖ్యలు చేశారు. దీనిపై తెలుగు సంఘాలు, ప్రముఖులు ఆగ్రహం వ్యక్తం చేశారు. 300 సంవత్సరాల క్రితం ఒక రాజు వద్ద అంతఃపుర మహిళలకు సేవ చేసేందుకు వచ్ని తెలుగు వారు, ప్రస్తుతం మాది తమిళ జాతి అంటున్నారని విమర్శించారు. 

ఎప్పుడో ఇక్కడకు వచ్చిన బ్రాహ్మణులను తమిళులు కాదని చెప్పేందుకు మీరెవరంటూ ద్రవిడ సిద్ధాంత వాదులపై ఆమె ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇతరుల ఆస్తులను లూటీ చేయొద్దని, ఇతరుల భార్యలపై మోజు పడొద్దని, ఒకరికంటే ఎక్కువ మంది భార్యలను చేసుకోవద్దని బ్రాహ్మణులు చెబుతుండడంతోనే తమిళనాడులో వారికి వ్యతిరేకంగా ప్రచారం జరుగుతోందంటూ కస్తూరి విమర్శించారు. 

కస్తూరి వ్యాఖ్యలపై పెద్ద ఎత్తున విమర్శలు రావడంతోపాటు, తెలుగు సంఘాలు పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసిన పోలీసులు చెన్నైలోని పోయస్ గార్డెన్‌లో ఉన్న ఆమె ఇంటికి వెళ్లే సరికి తాళం వేసి ఉంది. దాంతో, క‌స్తూరి ముంద‌స్తు బెయిల్ కోసం మ‌ద్రాస్ హైకోర్టును ఆశ్ర‌యించింది. కానీ, స‌ద‌రు హైకోర్టు ఆమెకు బెయిల్ ఇచ్చేందుకు నిరాక‌రించింది.

కస్తూరి చేసిన వ్యాఖ్యలు ముమ్మాటికీ విద్వేషాలను రెచ్చగొట్టేవేనని ధర్మానసం తేల్చిచెప్పింది. తెలుగువారిని తమిళనాడుకు వలస వచ్చిన వారిగా ఎలా అంటారని హైకోర్టు ప్రశ్నించింది. తెలుగువారు వలస వచ్చిన వారు కాదని.. తమిళనాడు అభివృద్ధిలో కీలక భాగస్వాములని పేర్కొంది. తమిళనాడులో తెలుగువారు, తమిళులను వేరుచేసి చూడలేమని అభిప్రాయపడింది మద్రాసు ధర్మాసనం.

అందుక‌ని పోలీసుల‌కు చిక్క‌కూడ‌దనే ఉద్దేశంతో ఆమె ఫోన్ స్విచాఫ్ చేసి హైద‌రాబాద్‌లో త‌ల‌దాచుకుంది. దీంతో ప్రత్యేక టీములను ఏర్పాటు చేసిన చెన్నై పోలీసు ఉన్నతాధికారులు కస్తూరి కోసం గాలిస్తున్నారు. ఈ క్రమంలోనే హైదరాబాద్‌లో కస్తూరి ఉన్నట్లు తెలుసుకున్న చెన్నై పోలీసులు ఇక్కడికి వచ్చి అదుపులోకి తీసుకున్నారు.

ఒక‌ప్పుడు మ‌ద్రాస్‌గా పిలిచే చెన్నైలో పుట్టిన క‌స్తూరి హై స్కూల్ రోజుల్లోనే మోడ‌లింగ్ చేసింది. 1992లో మిస్ మ‌ద్రాస్ టైటిల్ గెల‌పొంద‌ని క‌స్తూరికి సినిమా అవ‌కాశాలు వ‌చ్చాయి. అదే ఏడాది ఆమె తెరంగేట్రం చేసింది. స్టార్ హీరో ప్ర‌భు గ‌ణేశ‌న్ స‌ర‌స‌న న‌టించి మంచి మార్కులు కొట్టేసింది. ఆ త‌ర్వాత శంక‌ర్ రూపొందించిన భార‌తీయుడు సినిమాలో క‌మ‌ల్ హాసన్ కూతురిగా మంచి అభిన‌యం క‌న‌బ‌రిచిన క‌స్తూరి.. నాగార్జున ప్ర‌ధాన పాత్ర‌లో న‌టించిన‌ అన్న‌మ‌య్య సినిమాలో కీల‌క పాత్ర పోషించింది.