
మణిపూర్‌లో మరోసారి హింస ప్రజ్వరిల్లింది. జిరిబం జిల్లాలో అపహరణకు గురైన ముగ్గురు శవాలై తేలడంతో ఇంఫాల్‌లో జనాగ్రహం పెల్లుబికింది. ఆందోళనకారులు ముఖ్యమంత్రి బీరెన్ సింగ్, ముగ్గురు మంత్రులు, మరో ఆరుగురు ఎమ్మెల్యేల నివాసాలను చుట్టుముట్టారు. దాడులకు దిగారు. విధ్వంసం సృష్టించారు. న్యాయం జరగాలంటూ డిమాండ్ చేస్తూ ఆందోళనకు దిగడంతో ఇంఫాల్ వెస్ట్ జిల్లా యంత్రాంగ తక్షణ చర్యలకు దిగింది.
జిల్లాలో నిరవధిక నిషేధాజ్ఞలు జారీచేసింది. ఇంఫాల్ వెస్ట్, ఈస్ట్, బిష్ణుపూర్, థౌబల్, కాక్‌చింగ్, కాంగ్పోక్పి, చురాచాంద్‌పూర్‌లో రెండ్రోజుల పాటు ఇంటర్నెట్, మొబైల్ డాటా సర్వీసులను నిలిపివేసింది. కుకీ, మైతీ జాతుల ఘర్షణతో రగులుతున్న మణిపూర్‌లో ఈ సంఘటన జరిగింది. ఇంఫాల్‌లోని వివిధ ప్రాంతాల్లో నిరసనకారులను చెదరగొట్టేందుకు భద్రతా బలగాలు టియర్ గ్యాస్ షెల్స్ ప్రయోగించాయని పోలీసులు తెలిపారు.
గతవారం జిరిబామ్‌లోని బోకోబెరాలో కుకీ మిలిటెంట్లు దాడి చేశారు. కొందరు మహిళలు, పిల్లలను కిడ్నాప్ చేశారు. ఈ సందర్భంగా భద్రతా దళాలతో జరిగిన ఎన్‌కౌంటర్‌లో పది మంది కుకీ మిలిటెంట్లు మరణించారు. జిరిబం జిల్లా నుంచి అపహరణకు గురైన ఆరుగురిలో ముగ్గురి మృతదేహాలు మణిపూర్-అసోం సరిహద్దు వెంబడి జిరి-బరాక్ నదీ సంగమం సమీపంలో శుక్రవారం రాత్రి కనిపించాయి.
కుళ్లిపోయిన స్థితిలో ఉన్న ఈ మృతదేహాల్లో ఇద్దరు పిల్లలు, ఒక మహిళ ఉన్నట్టు శనివారం ఉదయం గుర్తించారు. కుకీ మిలిటెంట్లు మహిళను, పిల్లలను బందీలుగా పట్టుకుని కాల్చిచంపారని అనుమానిస్తున్నారు. దీంతో మైతీ వర్గానికి చెందిన ప్రజలు రాజధాని ఇంఫాల్‌లో శనివారం భారీ నిరసన చేపట్టారు. తమ వర్గం హత్యలపై న్యాయం చేయాలని డిమాండ్ చేశారు.
ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ మంత్రి సపమ్ రంజన్ నివాసంపై ఒక గుంపు దాడి చేసింది. మరోవైపు పశ్చిమ ఇంఫాల్ జిల్లాలోని సగోల్‌బండ్ ప్రాంతంలో ముఖ్యమంత్రి ఎన్ బీరెన్ సింగ్ అల్లుడు, బీజేపీ ఎమ్మెల్యే ఆర్‌కే ఇమో నివాసం ముందు ఆందోళనకారులు గుమిగూడి నిరసన తెలిపారు.
ముగ్గురు అమాయక ప్రజలను బలిగొన్న నిందితులను 24 గంటల్లో అరెస్టు చేయాలంటూ ఆందోళనకారులు డిమాండ్ చేశారు. పలు వాహనాలను ధ్వసం చేయడంతో పాటు కొన్నింటికి నిప్పుపెట్టారు. అలాగే కైషామ్‌థాంగ్ నియోజకవర్గం స్వతంత్ర ఎమ్మెల్యే సపం నిషికాంత సింగ్‌ను కలిసేందుకు ఆయన నివాసానికి నిరసనకారులు చేరుకున్నారు. అయితే రాష్ట్రంలో ఆయన లేరని చెప్పడంతో ఆ ఎమ్మెల్యేకు చెందిన వార్తా పత్రిక కార్యాలయ భవనంపై దాడి చేశారు.
More Stories
నేపాల్ అలజడులతో చిక్కుకున్న మానసరోవర్ యాత్రికులు
దేశవ్యాప్తంగా ఓటర్ల జాబితా సవరణకు కసరత్తు
భారత్- నేపాల్ సరిహద్దుల్లో హై అలర్ట్