గుజరాత్ తీరంలో 700 కేజీల మెథాంఫెటమిన్‌ స్వాధీనం

గుజరాత్ తీరంలో 700 కేజీల మెథాంఫెటమిన్‌ స్వాధీనం

* ఢిల్లీలో రూ. 900 కోట్ల డ్రగ్స్‌ పట్టివేత

గుజరాత్‌ తీరంలో మరొకసారి భారీ ఎత్తున డ్రగ్స్‌ పట్టుబడటం కలకలం రేపింది. భారత నౌకాదళం, గుజరాత్‌ పోలీసులు, నార్కొటిక్స్‌ కంట్రోల్‌ బ్యూరో (ఎన్‌సిబి) అధికారులు చేపట్టిన జాయింట్‌ ఆపరేషన్‌లో భారత సముద్ర జలాల్లోకి ప్రవేశిస్తున్న ఒక బోటులో 700 కేజీల మెథాంఫెటమిన్‌ గుర్తించారు. పట్టుబడ్డ డ్రగ్‌ విలువ దాదాపు రూ.1700 కోట్లుగా ఉంటుందని వారు అంచనా వేశారు. 
 
బోటులో ఉన్న ఎనిమిది మంది విదేశీయులను పోలీసులు అరెస్ట్‌ చేశారు. తాము ఇరానీయన్లమని అరెస్టయినవారు చెప్పినట్టు అధికారులు తెలిపారు. డ్రగ్స్‌తో ఒక బోటు భారత జలాల్లోకి ప్రవేశిస్టున్నదని నిఘావర్గాల నుంచి అందిన సమాచారం మేరకు తాము రంగంలోకి దిగామని ఎన్‌సిబి అధికారి జ్యానేశ్వర్‌ సింగ్‌ వెల్లడించారు. సాగర్‌-మంతన్‌-4 కోడ్‌ పేరుతో ఆపరేషన్‌ను చేపట్టామని వివరించారు.
 
డ్రగ్‌ సిండికేట్‌లో సంబంధాలను గుర్తించటానికి దర్యాప్తు కొనసాగుతు న్నదని తెలిపారు. ఇందుకోసం విదేశీ ఏజెన్సీల సాయాన్ని కోరుతున్నామని చెప్పారు. గుజరాత్‌లో వరుసగా డ్రగ్స్‌ పట్టుబడుతుండటం ఆందోళన కలిగిస్తున్నది. ఈ ఏడాది మూడు కేసుల్లో ఇప్పటి వరకు 11 మంది ఇరాన్‌ దేశస్థులు, 14 మంది పాకిస్థానీలు అరెస్టయ్యారు. వారంతా గత తొమ్మిది నెలలుగా జైలులో మగ్గుతున్నారు. 
 
అధికారులు చేపట్టిన భారీ ఆపరేషన్‌లలో పోర్‌బందర్‌ దగ్గర అరేబియన్‌ సముద్రం నుంచి 4000 కేజీలకు పైగా డ్రగ్స్‌ స్వాధీనమైంది. తొమ్మిది నెలల క్రితం ఎన్సీబీ, గుజరాత్‌ ఏటీఎస్‌, నేవీ చేపట్టిన జాయింట్‌ ఆపరేషన్‌లో భారీ ఎత్తున 3,132 కేజీల పలు రకాల డ్రగ్స్‌ పట్టుబడింది. మరొక మేజర్‌ ఆపరేషన్‌లో భాగంగా రూ.60 కోట్ల విలువ చేసే 173 కేజీల డ్రగ్స్‌ను స్వాధీనం చేసుకున్నారు.
 
మరోవంక, దేశ రాజధాని న్యూఢిల్లీలో భారీగా డ్రగ్స్‌ పట్టుబడ్డాయి. రూ.900 కోట్ల విలువైన 90 కిలోల కొకైన్‌ను నార్కోటిక్స్‌ కంట్రోల్‌ బ్యూరో (ఎన్సీబీ) అధికారులు శుక్రవారం పట్టుకున్నారు. న్యూఢిల్లీలోని నాంగ్లోయ్‌, పశ్చిమ ఢిల్లీలో ఆస్ట్రేలియా నుంచి వచ్చిన 82 కిలోల కొకైన్‌ను ఎన్సీబీ కొరియర్‌ ఆఫీస్‌లో పట్టుకుంది. 
 
దీన్ని తెప్పించిన డ్రగ్‌ సిండికేట్‌కు విదేశాలతో సంబంధాలు ఉన్నట్టు అధికారులు తెలిపారు. ఈ సందర్భంగా ఢిల్లీ, సోనిపట్‌లకు చెందిన కొందరు నిందితులను అరెస్ట్‌ చేశారు. ఈ ఏడాది అక్టోబర్‌లో కూడా సుమారు రూ.5,620 కోట్ల విలువైన మాదకద్రవ్యాలను ఢిల్లీలో పట్టుకున్నారు.