
భారతీయ సంస్కృతి, భారతీయ సాంస్కృతిక ఏకత్వాన్ని చాటి చెప్పే అంతర్జాతీయ సాంస్కృతిక మహోత్సవంగా దక్షిణ భారతదేశంలో మొట్టమొదటిసారి హైదరాబాదులో జరిగే లోక్‌మంథన్ కార్యక్రమంను ఈ నెల 21న రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ప్రారంభిస్తారని కేంద్ర మంత్రి, లోక్‌మంథన్ ఆహ్వాన కమిటీ గౌరవ అధ్యక్షులు జి. కిషన్ రెడ్డి తెలిపారు.
రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ సర్‌సంఘ్‌చాలక్ డాక్టర్ మోహన్ భాగవత్‌తో పాటు ఆచార్య మిథిలేష్, తెలంగాణ గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్, కేంద్ర సాంస్కృతిక శాఖా మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్ సహా వివిధ రంగాల ప్రముఖులు పాల్గొంటున్నారు. నాలుగు రోజులపాటు జరిగే ఈ కార్యక్రమ వివరాలను శుక్రవారం మీడియా సమావేశంలో లోక్‌మంథన్ ఆహ్వాన కమిటీ ప్రధాన కార్యదర్శి, ప్రజ్ఞాప్రవాహ్ జాతీయ కన్వీనర్ జె.నందకుమార్ తో కలిసి వివరించారు.
లోక్ మంథన్ అనేక సంవత్సరాలుగా ప్రతి రెండేళ్లకొకసారి దేశానికి సంబంధించి, దేశ సాంస్కృతిక వారసత్వానికి సంబంధించి, దేశ ప్రజల జీవన విధానానికి సంబంధించి ప్రపంచంలోని ప్రముఖులను పిలిచి చర్చించి ఒక ఆలోచనా మథనం చేసే ఒక కార్యక్రమంగా నిర్వహిస్తున్నారని, ఈ ఏడాది హైదరాబాదులోని శిల్పకళావేదిక (శిల్పారామం)లో నవంబర్ 21 నుంచి 24 వరకూ జరుగుతుందని కిషన్ రెడ్డి తెలిపారు. నవంబర్ 21న ప్రతినిథుల నమోదు కార్యక్రమం, పూర్వ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు ద్వారా ఎగ్జిబిషన్, సాంస్కృతిక ఉత్సవాలను ప్రారంభిస్తారని చెప్పారు.
దేశంలోని వివిధ ప్రాంతాల నుంచి జాతీయ భావజాలం గలవారు, వందలాది కళాకారులు, మేధావులు, విద్యావేత్తలు, కవులు, కళాకారులు, విదేశాల నుంచి కూడా పలువురు ప్రతినిధులు సహా అన్ని వర్గాలవారు పాల్గొంటారని, సాగర మథనం జరిగినట్టుగా నేటి సమస్యలపై సెమినార్లు, కళా ప్రదర్శనల ద్వారా లోక్ మంథన్ కార్యక్రమం జరుగుతుందని చెప్పారు.
ఈ మహోత్సవంలో అడవులు, గిరులలో నివసించే వనవాసీలు, మైదాన ప్రాంతాల్లో జీవించే బంజారాల వంటి అందరూ పాల్గొంటారని తెలిజేస్తూ వనవాసి, గ్రామవాసి, నగరవాసి… అందరూ కలిస్తేనే భారత్ వాసి అవుతామని లోక్‌మంథన్ ఉద్దేశ్యాన్ని వివరించారు. కులం, భాషలు, ఇంకా అనేక రకాలుగా ప్రజల్ని విభజించే దుర్మార్గపు పరిస్థితులున్న నేటి సమయంలో రాజకీయాలకు అతీతంగా జాతీయ భావజాలంతో వందలాది సంస్థలకు చెందినవారి భాగస్వామ్యంతో ఈ లోక్ మంథన్ జరుగనుందని కిషన్ రెడ్డి పేర్కొన్నారు.
ప్రపంచాన్ని అర్థం చేసుకోవడం, ప్రపంచ సమస్యలపై చర్చ, పరిష్కారానికి ఆలోచనా విధానాన్ని ఏర్పాటు చేసుకోవడం, అందుకు కావలసిన వ్యవస్థను నిర్మించుకోవడం దీని ప్రధాన ఉద్దేశ్యమని చెప్పారు. నేడు భగవాన్ బిర్సాముండా జయంతి సందర్భంగా ఈ రోజును జాతీయ గిరిజన గౌరవ దినంగా పాటించాలన్న భారత ప్రభుత్వ నిర్ణయాన్ని కిషన్ రెడ్డి గుర్తు చేస్తూ లోక్‌మంథన్ వేడుకలో గిరిజనుల చేతివృత్తుల కళారూపాలు, కళా ప్రదర్శనలు ప్రదర్శిస్తారని, ఇక్కడ ఏర్పాటు చేసే స్టాల్స్‌లో అనేక ఉత్పత్తుల ప్రదర్శనతో పాటు, ప్రజలకు సైతం తమ నైపుణ్యాన్ని ప్రదర్శించే కార్యక్రమం ఉంటుందని తెలిపారు.
వందకు పైగా సాంస్కృతిక కార్యక్రమాలు, 1000 మందికి పైగా కళాకారులతో సంప్రదాయ సంగీత వాయిద్యాలు, పనిముట్ల ప్రదర్శనలు ఉంటాయని చెప్పారు. హైదరాబాద్, చుట్టుపక్కల బస్తీ ప్రజలు, గిరిజనులు, ఐటీ రంగం సహా అన్ని వర్గాల ప్రజలు కూడా వచ్చేలా అందరినీ అహ్వానిస్తున్నామని, కనీసం లక్షలాది మంది వచ్చేలా ఏర్పాట్లు చేస్తున్నామని కిషన్ రెడ్డి వివరించారు. లోక్‌మంథన్ వేడుకలు గతంలో భోపాల్, రాంచీ, గౌహతిలోనూ జరిగాయని తెలిపారు.
లోక్‌మంథన్ ఆహ్వాన కమిటీ ప్రధాన కార్యదర్శి, ప్రజ్ఞాప్రవాహ్ జాతీయ కన్వీనర్ జె.నందకుమార్ మాట్లాడుతూ “లోక్” అంటే ఏదో ఒక వర్గానికి మాత్రమే పరిమితమైన మాట కాదని, అది మన దేశపు ప్రాథమిక సంస్కృతికి సంబంధించినదని చెప్పారు. వేర్వేరు సంస్కృతులున్నప్పటికీ అంతర్గతంగా భిన్నత్వంలో ఏకత్వాన్ని చాటుతున్న భారతదేశంలో నేడు కొన్ని శక్తులు ప్రజల్లో చీలికలు తెచ్చి విద్వేష భావాన్ని నింపుతున్నాయని, అందువల్ల మరొకసారి ఏకత్వాన్ని చాటిచెప్పాల్సిన అవసరముందని తెలిపారు.
ఇప్పటికీ వలసపాలన ప్రభావంలోనే ఉన్న మన భావజాలాన్ని దాని నుంచి విముక్తి చెయ్యడం తొలి బాధ్యతగా ఉందంటూ లోక్‌మంథన్ వేదికగా మేధావులు, కార్యాచరణశీలురు కలసి ఈ దిశగా కృషి చేస్తారని తెలిపారు. లోక్ అవలోకన్ ప్రధాన అంశంగా లోక్ విచార్ (ప్రకృతి, సాంస్కృతిక సంబధమైన ఆలోచనా ప్రక్రియ), లోక్ వ్యవహార్ (సంప్రదాయాలు – ఆచరణ), లోక్ వ్యవస్థ (సంస్థలు-వ్యవస్థలు) అనే మూడు ఉప అంశాలతో లోక్‌మంథన్ ఉత్సవం జరుగుతుందని వివరించారు.
ఇందులో భాగంగా లోక జీవనదృష్టి, లోక జీవన విజ్ఞానం, లోక సాహిత్యం, లోక అర్థశాస్త్రం, భారతీయ లోక చేతనలో పర్యావరణం, లోక సురక్ష-న్యాయం, లోక సర్వసమావేశీ వ్యవస్థ తదితర అంశాలపై సదస్సులు ఉంటాయని తెలిపారు. ప్రత్యేకించి మన భావితరాలైన విద్యార్థులు, యువతరం దృష్టి సారించేలా లోక్‌మంథన్ రూపకల్పన జరిగిందని చెప్పారు.
మన సాంస్కృతిక ఏకత్వాన్ని చాటి చెప్పేందుకు కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకూ వివిధ వృత్తులు, రంగాలకు చెందిన కళాకారులు వస్తుండగా, ప్రపంచవ్యాప్తంగా ఉన్న సాంస్కృతిక భారతీయ వారసత్వానికి చెందినవారు కూడా వచ్చి ప్రదర్శనలిస్తారని నందకుమార్ తెలిపారు.
ఉదాహరణకు ఇండోనేషియా కళాకారులు రామాయణం ఆధారంగా ప్రదర్శించే కేచక్ నృత్య ప్రదర్శన ఉంటుందని, ప్రపంచంలో అబ్రహామిక్ మతాలకు పూర్వమున్న మతాలు, సంస్కృతుల వారు సైతం లోక్‌మంథన్‌కి విచ్చేస్తున్నారని, వీరిలో సిరియాలోని రోమోలు, ఆర్మేనియాలోని యజిదీలు (సుర్యపుత్రులు), లిథువేనియా వాసులు సైతం ఉన్నారని నందకుమార్ వివరించారు.
అబ్రహామిక్ మతాల రాకకు పూర్వం ఆ దేశాలలో అచరించిన, నేటికీ ఆచరిస్తున్న సూర్యారాధన, హవన విధానాలను వీరు హైదరాబాద్ లోక్‌మంథన్‌లో చేసి చూపిస్తారని పేర్కొన్నారు. లోక్‌మంథన్ ఎగ్జిబిషన్స్‌లో భాగంగా తెలంగాణ, త్రిపుర, ఛత్తీస్‌గఢ్, ఉత్తరాఖండ్, మధ్యప్రదేశ్ సహా 10 రాష్ట్రాలకు చెందిన విభిన్న సంస్కృతులు, కళలు, చిత్రాల ప్రదర్శన, సంప్రదాయ ఆహారం, సంప్రదాయ క్రీడలు, సాహిత్యం, చర్చలు ఉంటాయని మీడియాకు తెలియజేశారు.
హైదరాబాద్ లోక్‌మంథన్‌కు ప్రతి ఒక్కరూ విచ్చేసి భారతీయ సాంస్కృతిక వైభవాన్ని అనుభవించి, ఆస్వాదించాలని ఆయన కోరారు. లోక్‌మంథన్ ఉత్సవం జరిగే నాలుగు రోజులూ శిల్పారామంలోకి ప్రజలందరికీ ఉచిత ప్రవేశం కల్పించేందుకు సంబంధిత శాఖ అంగీకారం తెలిపిందని నందకుమార్ వివరించారు.
More Stories
`ఓటు యాత్ర’ జనాన్ని ఆకట్టుకున్నా, ఓట్లు పెంచలేదు!
నేపాల్ కల్లోలం వెనుక అమెరికా `డీప్ స్టేట్’!
నేపాల్ తాత్కాలిక నాయకత్వంపై నేపాల్ జెన్ జెడ్‌లో చీలిక!