అసెంబ్లీ డిప్యూటీ స్పీకర్ గా రఘురామకృష్ణరాజు

అసెంబ్లీ డిప్యూటీ స్పీకర్ గా రఘురామకృష్ణరాజు

ఉండి ఎమ్మెల్యే రఘురామకృష్ణంరాజు ఉపసభాపతిగా ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఈ మేరకు స్పీకర్‌ అయ్యన్నపాత్రుడు శాసనసభలో ప్రకటన చేయగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉపముఖ్యమంత్రి పవన్ కల్యాణ్‌, బీజేపీ శాసనసభ పక్ష నేత విష్ణుకుమార్ రాజు రఘురామకృష్ణరాజును స్పీకర్‌ సీట్లో కూర్చోబెట్టారు. 

ఉపసభాపతిగా బాధ్యతలు స్వీకరించిన రఘురామకృష్ణరాజును స్పీకర్‌ అయ్యన్నపాత్రుడు అభినందించారు. అనంతరం మంత్రులు అచ్చెన్నాయుడు, నాదెండ్ల మనోహర్, సత్యకుమార్‌.. డిప్యూటీ స్పీకర్ ట్రిపుల్ ఆర్‌కు అభినందనలు తెలిపారు. తర్వాత మంత్రులతో పాటు సభ్యులందరూ ఒక్కొక్కరూ వెళ్లి రఘురామను అభినందించారు.

ఆర్‌ఆర్‌ఆర్‌ సినిమాలో నాటు నాటు పాట ఎంత పాపులర్‌ అయ్యిందో రఘురామకృష్ణరాజు రచ్చబండ ప్రోగ్రాం రాజకీయాల్లో అంతే పాపులర్‌ అయ్యిందని సీఎం చంద్రబాబు కొనియాడారు. డిప్యూటీ స్పీకర్‌గా బాధ్యతలు చేపట్టిన రఘురామకు సీఎం చంద్రబాబు మనస్ఫూర్తిగా అభినందనలు తెలిపారు. 

తెలుగుబిడ్డగా పంచెకట్టులో వచ్చిన రఘురామ స్పీకర్‌ స్థానానికి నిండుతనం తీసుకొచ్చారని కొనియాడారు. కొత్త బాధ్యతలో రఘురామను చూస్తుంటే సంతోషం కలుగుతోందని చంద్రబాబు చెప్పారు.  రఘురామ ఎంపీగా పనిచేసిన ఐదేళ్లలో నియోజకవర్గానికి రానియ్యకపోతే రచ్చబండ కార్యక్రమం ద్వారా ప్రజలకు దగ్గరయ్యారని తెలిపారు. 

పోరాట యోధుడిగా గెలిచిన రఘురామను అభినందిస్తున్నానని చెప్పారు. అప్పుడు రఘురామను రాష్ట్రానికి రానీయని వాళ్లు నేడు ఈయన ముందు సభలోకి రాలేని, కూర్చోలేని పరిస్థితి వచ్చిందని ఎద్దేవా చేశారు. ఇది దేవుడు రాసిన స్క్రిప్టు ఇదే బ్యూటీ ఆఫ్‌ డెమోక్రసీ అని సీఎం చంద్రబాబు పేర్కొన్నారు.