విమానాలకు బాంబు బెదిరింపుల వెనుక మహారాష్ట్ర వ్యక్తి

విమానాలకు బాంబు బెదిరింపుల వెనుక మహారాష్ట్ర వ్యక్తి
పలు ఎయిర్‌లైన్స్‌కు చెందిన విమానాలకు ఇటీవల కాలంలో బాంబు బెదిరింపులు భారీగా పెరిగిన విషయం తెలిసిందే. గత 13 రోజుల్లో దాదాపు 400కు పైగా బెదిరింపులు వచ్చాయి. ఈ బెదిరింపులు వెనుక ఎవరున్నారు? అనే ప్రశ్నలు అందరి మదిలో ఎదురయ్యాయి. ఈ క్రమంలో కేసు నమోదు చేసి విచారణ జరుపుతున్న నాగ్‌పూర్‌ పోలీసులు పురోగతి సాధించారు.
మహారాష్ట్రలోని గోందియాకు చెందిన 35 సంవత్సరాల వ్యక్తికి గుర్తించారు. నకిలీ బాంబు బెదిరింపుల వెనుక సదరు వ్యక్తి హస్తం ఉన్నట్లు సమాచారం. నాగ్‌పూర్‌ సిటీ పోలీస్‌ స్పెషల్‌ బ్యాంక్‌ ఆ వ్యక్తిని జగదీశ్‌ ఉకేయిగా గుర్తించినట్లు ఓ పోలీస్‌ అధికారి తెలిపారు.  సదరు వ్యక్తి 2021లో ఓ కేసులో అరెస్టయ్యాడు. ఉగ్రవాదంపై ఒక పుస్తకాన్ని కూడా రాశాడు.  ప్రస్తుతం పరారీలో ఉన్నాడని, డీసీపీ శ్వేతా ఖేద్కర్ నేతృత్వంలోని దర్యాప్తులో వెల్లడైందని తెలుస్తున్నది.
ప్రధానమంత్రి కార్యాలయం, రైల్వేమంత్రి, మహారాష్ట్ర సీఎం ఏక్‌నాథ్‌, ఎయిర్‌లైన్‌ కార్యాలయాలు, డీజీపీ, రైల్వే ప్రొటక్షన్‌ ఫోర్స్‌, వివిధ ప్రభుత్వ సంస్థలకు ఈ-మెయిల్‌ ద్వారా బెదిరింపు మెయిల్స్‌ ఉకెయి పంపినట్లు పేర్కొన్నారు. ఇక మహారాష్ట్ర డిప్యూటీ సీఎం ఫడ్నవీస్‌కు సైతం బెదిరింపులు రావడంతో ఆయన భద్రతను పోలీసులు కట్టుదిట్టం చేశారు. అయితే, సదరు వ్యక్తి తనకు తెలిసిన రహస్య ఉగ్రవాద కోడ్‌లో మాట్లాడేందు,  ప్రధాని మోదీతో చర్చించేందుకు అవకాశం ఇవ్వాలని ఆ బెదిరింపుల్లో జగదీశ్‌ పేర్కొన్నట్లుగా అధికారులు పేర్కొన్నారు.

ప్రస్తుతం అతడు పరారీలో ఉన్నాడని, పట్టుకునేందుకు గాలింపు చర్యలు చేపట్టామని, త్వరలోనే పట్టుకుంటామని తెలిపారు. ఉకెయిని పట్టుకునేందుకు ప్రస్తుతం సిట్‌ను ఏర్పాటు చేశారు. ఇదిలా ఉండగా.. గత 13 రోజుల్లో ఎక్కువగా సోషల్‌ మీడియా ద్వారా మాత్రమే బెదిరింపులు వచ్చాయని దర్యాప్తు సంస్థలు పేర్కొన్నాయి. సామాజిక మాధ్యమాల ద్వారానే ఎక్కువగా బెదిరింపులకు పాల్పడుతున్నట్లు పలు ప్రభుత్వ సంస్థలు పేర్కొన్నాయి. ఈ నెల 22న ఒకే రోజు ఇండిగో, ఎయిర్‌ ఇండియాకు చెందిన 13 విమానాలు సహా దాదాపు 50 విమానాలకు బాంబు బెదిరింపులు వచ్చినట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి.