జనగణన పూర్తి కావడానికి దాదాపు 18 నెలల సమయం పడుతుందని అధికారులు అంచనా వేస్తున్నారు. హోంశాఖ ఈ ప్రక్రియకు నేతృత్వం వహించనున్నది. 2026లో ప్రభుత్వం గణాంకాలను వెల్లడించే అవకాశం ఉందని సమాచారం. ప్రధానమంత్రి కార్యాలయం తుది అనుమతులు రాగానే జనాభా లెక్కల ప్రక్రియ ప్రారంభం కాబోతున్నట్లు ప్రభుత్వ అధికారులను ఉటంకిస్తూ జాతీయ మీడియా పేర్కొంటోంది.
కాగా, ఇప్పటికే జనాభాలో చైనాను భారత్ దాటిపోయి ప్రపంచంలోనే అత్యధిక జనాభా కలిగిన దేశంగా మారిందని గత ఏడాది ఐక్యరాజ్యసమితి నివేదిక పేర్కొన్న విషయం తెలిసిందే. చివరిసారిగా 2011లో జనగణన చేపట్టారు. ఆ తర్వాత 2021లో జరగాల్సి ఉన్నప్పటికీ కరోనా మహమ్మారి కారణంగా వాయిదా పడింది.
బ్రిటిష్ కాలంలో 1881లో మొదలైన దేశంలో జనగణన ప్రతి పదేళ్లకు ఒకసారి జరుగుతుంది. రాష్ట్రాలవారీగా, జాతీయస్థాయిలో వివిధ అభివృద్ధి పథకాలు, సంక్షేమ కార్యక్రమాల అమలుకు ఈ జనాభా లెక్కలే కీలకం. ఇదే సమయంలో కులగణన కూడా చేపట్టాలని ప్రతిపక్ష పార్టీలు డిమాండ్ చేస్తున్నాయి. దీనిపై ప్రభుత్వం ఇంత వరకూ ఎటువంటి నిర్ణయం తీసుకోలేదు. జనగణనకు సంబంధించి విధివిధానాలను త్వరలోనే విడుదల చేసే అవకాశం ఉందని అధికార వర్గాలు తెలిపాయి.
జనగణన జరగకపోవడం వల్ల ఆర్థిక డాటా, ద్రవ్యోల్బణం, ఉద్యోగాలకు సంబంధించిన సమాచార నాణ్యతపై ప్రభావం పడుతున్నదని పలువురు ఆర్థికవేత్తలు కూడా పేర్కొన్నారు. ఇప్పటివరకు ఈ లెక్కలన్నీ 2011 జనాభా లెక్కల ఆధారంగా చేస్తూ రావడం వల్ల దేశంలో అసలైన పరిస్థితులు ప్రతిబింబించడం లేదని అభిప్రాయపడ్డారు. దీంతో ఎట్టకేలకు దిగివచ్చిన ప్రభుత్వం కులగణన చేపట్టేందుకు సిద్ధమవుతోంది.
కేంద్ర హోం మంత్రి అమిత్ షా కొద్దినెలల క్రితం మాట్లాడుతూ..‘తగిన సమయంలో జనగణణ ప్రక్రియను నిర్వహిస్తాం.. దానిపై నిర్ణయం తీసుకున్న తర్వాత అది ఎలా జరుగుతుందో నేను ప్రకటిస్తాను.. ఈసారి పూర్తిగా డిజిటల్ విధానంలో ఈ సర్వే ఉంటుంది’ అని వెల్లడించారు. కాగా, వచ్చే ఏడాది చేపట్టి జనగణనలో జనరల్, ఓబీసీ, ఎస్సీ, ఎస్టీ కేటగిరీల ఉప-కులాలతో పాటు మతం, సామాజిక తరగతి అంశాలు కూడా ఉండే అవకాశం ఉందని విశ్వసనీయ వర్గాలు తెలిపాయి.

More Stories
భారత్ కూల్చివేసిన పాక్ ప్రయోగించిన తుర్కియే డ్రోన్!
ఢిల్లీని కమ్మేసిన పొగమంచు
ఆసియాలోనే అతిపెద్ద కారాగారం తిహార్ జైలు తరలింపు