ఢిల్లీ మార్కెట్‌లో చైనీస్ మొబైల్ ఫోన్‌ జామర్లు

ఢిల్లీ మార్కెట్‌లో చైనీస్ మొబైల్ ఫోన్‌ జామర్లు

దేశ రాజధాని ఢిల్లీలోని మార్కెట్‌లో చైనీస్‌ మొబైల్‌ ఫోన్‌ జామర్లను పోలీసులు గుర్తించారు. భద్రతకు ముప్పు కలిగించే వీటిని అక్రమంగా అమ్మేందుకు ఉంచిన ఆ షాపు యజమానిని అరెస్ట్‌ చేశారు. పాలికా బజార్‌లోని షాపు యజమాని రవి మాథుర్‌కు ఈ పరికరాలను విక్రయించడానికి లైసెన్స్, తగిన పత్రాలు లేవని పోలీసులు తెలిపారు.

అతడ్ని ప్రశ్నించగా ఢిల్లీలోని లజ్‌పత్ రాయ్ మార్కెట్ నుంచి రూ. 25,000 చొప్పున రెండు చైనా తయారీ మొబైల్‌ ఫోన్‌ జామర్‌లను కొనుగోలు చేసినట్లు చెప్పారు. వాటిని అధిక ధరకు విక్రయించేందుకు షాపులో ఉంచాడని పోలీసులు వివరించారు. దీని గురించి టెలికమ్యూనికేషన్ విభాగానికి సమాచారం అందించినట్లు తెలిపారు. ఢిల్లీలోని ఇతర మార్కెట్లలో కూడా సోదాలు నిర్వహిస్తామని వెల్లడించారు.

కాగా, మొబైల్‌ ఫోన్‌ జామర్లు 50 మీటర్ల వరకు మొబైల్ సిగ్నల్స్‌కు అంతరాయం కలిగిస్తాయి. ఇన్‌కమింగ్, అవుట్‌గోయింగ్ కాల్స్‌, ఎస్‌ఎంఎస్‌లు, సమీపంలోని అన్ని సెల్యూలర్‌ యాక్టివిటీస్‌ను నిరోధిస్తాయి. అలాగే ఆ ప్రాంతంలోని అన్ని మొబైల్స్‌ నెట్‌వర్క్‌ను, యాక్టివ్‌ కాల్స్‌ను బలవంతంగా డిస్‌కనెక్ట్‌ చేస్తాయి. దీంతో మొబైల్‌ ఫోన్లలో ‘నో నెట్‌వర్క్’ గుర్తు కనిపిస్తుంది.

మరోవైపు ఈ జామర్ల వల్ల నేరాలు జరిగిన ప్రాంతాల్లో ఎలాంటి కమ్యూనికేషన్ జరిగిందో అన్నది పోలీసులు ట్రాక్ చేయలేరు. ఈ నేపథ్యంలో భద్రతకు ముప్పు కలిగించే వీటిని అనధికార వ్యక్తులు వినియోగించడం, విక్రయించడాన్ని నిషేధించారు. కేంద్ర ప్రభుత్వం నిబంధనల ప్రకారం నిర్దిష్ట లైసెన్స్, పత్రాలు కలిగిన అధీకృత ప్రభుత్వ, రక్షణ శాఖ అధికారులు మాత్రమే మొబైల్‌ జామర్లు వినియోగించేందుకు అనుమతి ఉంటుంది.