దేశానికి తొలి ‘మిస్ గ్రాండ్ ఇంటర్నేషనల్’ కిరీటం

దేశానికి తొలి ‘మిస్ గ్రాండ్ ఇంటర్నేషనల్’ కిరీటం

పంజాబ్‌కు చెందిన 20 ఏళ్ల రేచల్ గుప్తా ప్రతిష్ఠాత్మక ‘మిస్ గ్రాండ్ ఇంటర్నేషనల్ 2024’ కిరీటం అందుకున్నారు. బ్యాంకాక్‌లో జరిగిన ఈ పోటీల్లో 70 దేశాలకు చెందిన సుందరాంగులు పాల్గొన్నారు. వారందరినీ వెనుకకు నెట్టి రేచల్ టైటిల్ సాధించారు. ఈ విజయంతో రేచల్ ‘గ్రాండ్ పీజెంట్ చాయిస్’ అవార్డును కూడా గెలుచుకుని మిస్ యూనివర్స్ 2000 లారా దత్తా సరసన చేరారు.

ఈ విజయాన్ని రేచల్ తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో షేర్ చేసుకున్నారు. భారతదేశ చరిత్రలోనే తొలిసారిగా గోల్డెన్ క్రౌన్‌ను గెలుచుకున్నట్లు రేచల్ తెలియజేశారు. ఈ సందర్భంగా తనపై విశ్వాసం ఉంచిన అందరికీ రేచల్ కృతజ్ఞతలు తెలిపారు.  ఆమె విజయం కేవలం వ్యక్తిగత గౌరవం మాత్రమే కాకుండా, భారతీయ సాంస్కృతిక ప్రతిభకు అంతర్జాతీయ గుర్తింపుగా నిలిచింది.

రేచల్, 2023 ఆగస్టులో ‘మిస్ గ్రాండ్ ఇండియా’ టైటిల్‌ను గెలుచుకోవడం ద్వారా ‘మిస్ గ్రాండ్ ఇంటర్నేషనల్ 2024’ పోటీలకు అర్హత సాధించారు. అంతకుముందు 2022లో ‘మిస్ సూపర్ టాలెంట్ ఆఫ్ ద వరల్డ్’ టైటిల్‌ను గెలుచుకున్న ఆమె, అప్పటికే తన సామర్థ్యాన్ని నిరూపించుకున్నారు.

ఇన్‌స్టాగ్రామ్‌లో ఆమెకు ఇప్పటికే మిలియన్ ఫాలోవర్లు ఉన్నారు.  దీనికి తోడు ఇప్పుడు ఆమె విజయం మరింత అభిమానులను సొంతం చేసుకుంటుంది.  మిస్ గ్రాండ్ ఇంటర్నేషనల్ 2024 కిరీటాన్ని గెలుచుకోవడం ద్వారా రేచల్ ప్రపంచశాంతి, సామరస్యం, స్థిరత్వం వంటి అంశాలపై గ్లోబల్ అంబాసిడర్‌గా అవతారమెత్తనున్నారు.