
పంజాబ్‌లో రైతుల నిరసనలకు రాష్ట్రంలో అధికారంలో ఉన్న ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) ప్రభుత్వమే కారణమని కేంద్ర మంత్రి రవ్‌నీత్ సింగ్ బిట్టూ ఆరోపించారు. సీఎం భగవంత్ మాన్ రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. ఆయన రాజీనామా చేస్తే రైతుల సమస్యలు రెండు రోజుల్లో పరిష్కారమవుతాయని స్పేశ్రం చేశారు. ఆప్ అధినేత అరవింద్ కేజ్రీవాల్, ఆ పార్టీ నేత రాఘవ్ చద్దా పంజాబ్ ప్రజలకు శత్రువులని విమర్శించారు.
పంజాబ్‌లోని ఆప్ ప్రభుత్వం ఉద్దేశపూర్వకంగా రైతుల సమస్యను సృష్టించిందని ఆరోపించారు. ఈ సమస్య రైతుల వైపు నుంచి లేదా కేంద్ర ప్రభుత్వం నుంచి కాదని స్పష్టం చేశారు. కాగా, కనీస మద్దతు ధర (ఎంఎస్పీ)కు పంటలను సేకరించేందుకు కేంద్ర ప్రభుత్వం రెండు నెలల కిందటే రూ.44,000 కోట్లు విడుదల చేసిందని కేంద్ర మంత్రి రవ్‌నీత్ సింగ్ బిట్టూ తెలిపారు.
అయితే పంజాబ్‌కు శత్రువులైన అరవింద్ కేజ్రీవాల్, రాఘవ్ చద్దా వంటి వ్యక్తులు అక్కడ పట్టు కలిగి ఉన్నారని విమర్శించారు. పంటలను సేకరించేందుకు అధికారులకు ఆదేశాలు జారీ చేయడం లేదని మండిపడ్డారు. ‘గవర్నర్‌ను కలుస్తాం. ముఖ్యమంత్రి (భగవంత్ మాన్) రాజీనామా చేస్తే, ఈ సమస్య రెండు రోజుల్లో పరిష్కారమవుతుంది’ అని చెప్పారు. మరోవైపు సకాలంలో వరి సేకరణతో సహా పలు డిమాండ్ల కోసం రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాలకు వ్యతిరేకంగా తమ నిరసనలు కొనసాగుతాయని పంజాబ్ రైతులు స్పష్టం చేశారు.
రాష్ట్రంలోని సంగ్రూర్, భటిండా, మోగా, బటాలా, ఫగ్వారాలో రోడ్ల దిగ్బంధం నిర్వహిస్తామని చెప్పారు. పంట వ్యర్థాలు తగులబెట్టిన రైతులపై పోలీసుల చర్యలకు వ్యతిరేకంగా ఆందోళనలు చేస్తామన్నారు. రోడ్ల దిగ్బంధం వల్ల ప్రజలకు ఇబ్బంది కలుగకుండా ఉండేందుకు పంజాబ్, కేంద్ర ప్రభుత్వాలు పరిష్కారాన్ని కనుగొని సమస్యను సకాలంలో పరిష్కరించాలని డిమాండ్ చేశారు.
More Stories
వక్ఫ్ సవరణ చట్టంలో రెండు నిబంధనల అమలు నిలిపివేత
బాక్సింగ్ చాంపియన్‌షిప్స్‌లో రెండు బంగారు పతకాలు
ఓట్ల కోసం చొరబాటుదారులను కాంగ్రెస్ మద్దతు ఇచ్చింది