
రెండు రోజులపాటు రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ (ఆర్ఎస్ఎస్) అఖిల భారతీయ కార్యకారి మండల్ (ఎబికెఎం) వార్షిక సమావేశాలను ఉత్తర ప్రదేశ్ లోని మధురలో శుక్రవారం ఉదయం సర్ సంఘచాలక్ డా. మోహన్ భగవత్ సర్ కార్యవాహ దత్తాత్రేయ హోసబలేతో కలిసి భారత మాత చిత్రపటంపై ప్రతీకాత్మకంగా పుష్పాలు సమర్పించడం ద్వారా ప్రారంభించారు.
ఈ సంవత్సరం మధుర సమీపంలోని గౌ గ్రామ్ వద్దగల దీనదయాళ్ గౌ విజ్ఞాన్ రీసెర్చ్ అండ్ ట్రైనింగ్ సెంటర్‌లోని సమావేశాలు జరుగుతున్నాయి. సమావేశం ప్రారంభంలో, ఇటీవల మరణించిన పూజ్య రాఘవాచార్య జీ మహరాజ్ (జైపూర్), ప్రముఖ పారిశ్రామికవేత్త పద్మవిభూషణ్ రతన్ టాటా, పశ్చిమ బెంగాల్ మాజీ ముఖ్యమంత్రి బుధదేవ్ భట్టాచార్య, ఈనాడు, రామోజీ ఫిల్మ్ సిటీ వ్యవస్థాపకుడు రామోజీ రావు, కమ్యూనిస్ట్ నాయకుడు సీతారాం ఏచూరి, మాజీ విదేశాంగ మంత్రి కె. నట్వర్ సింగ్, బీహార్ మాజీ ఉప ముఖ్యమంత్రి సుశీల్ మోదీ, అడ్మిరల్ (రిటైర్డ్) రాందాస్, ఇతర ప్రముఖులకు నివాళులు అర్పించారు.
అక్టోబర్ 26 సాయంత్రం 6:15 గంటలకు సమావేశం ముగుస్తుందని ఆర్‌ఎస్‌ఎస్ అఖిల భారతీయ సహ ప్రచార్ ప్రముఖ్ నరేంద్ర కుమార్ తెలిపారు. ఈ సమావేశంలో విజయదశమి పర్వదినాన్ని పురస్కరించుకుని సర్ సంఘచాలక్ అందించిన ఆలోచనలు, ఆయన ప్రసంగంలో పేర్కొన్న ముఖ్యాంశాలు, దేశంలోని సమకాలీన అంశాల తదుపరి ప్రణాళికలపై సమగ్ర చర్చ జరగనుంది.
దీంతో పాటు ప్రతినిధి సభలో ఏర్పాటు చేసిన వార్షిక ప్రణాళికపై సమీక్ష, సంఘ్ కార్యవర్గ విస్తరణ నివేదికను కూడా తీసుకోనున్నారు. ఈ సమావేశంలో సంఘ్ శతాబ్ది వర్ష్ (శతాబ్ది సంవత్సరం)లో పని విస్తరణ ప్రణాళికతో సహా ఇప్పటివరకు చేసిన పనులపై సమీక్ష, పంచ పరివర్తన (సామాజిక సామరస్యం, కుటుంబ జ్ఞానోదయం, పర్యావరణం, స్వయం ఆధారిత జీవనం, పౌర విధులు) సమాజంలో వర్తింప చేయడంపై చర్చ జరుగుతుంది.
మొత్తం 11 మండలాలు, 46 ప్రాంత్ ల నుండి సంఘచాలక్, సహ-సంఘచాలక్, కార్యవాహ, ప్రచారక్‌లతో సహా మొత్తం 393 మంది కార్యకర్తలు పాల్గొంటున్నారు. జమ్మూ కాశ్మీర్, కేరళ, అరుణాచల్ ప్రదేశ్, మణిపూర్, త్రిపుర మొదలైన ప్రాంతాల నుండి స్వయంసేవకులు కూడా ఉన్నారు. ప్రత్యేక కార్యక్రమాలు, వివిధ ప్రాంత్ లలో నెలకొన్న పరిస్థితులను సమావేశంలో నివేదిస్తారు. మార్చి 2025 వరకు వివరణాత్మక ప్రణాళికలు కూడా చర్చిస్తారు.
More Stories
దేశభక్తి, దైవభక్తి పదాలు భిన్నమైనా వేర్వేరు కాదు
ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో క్రాస్ వోటింగ్ తో ఆత్మరక్షణలో ప్రతిపక్షాలు
జర్మనీ వైపు చూస్తున్న భారతీయ విద్యార్థులు