సమర్థత కలిగిన ప్రజాస్వామ్యాల భాగస్వామ్యం భారత్- జర్మనీ

సమర్థత కలిగిన ప్రజాస్వామ్యాల భాగస్వామ్యం భారత్- జర్మనీ
భారత్, జర్మనీ మధ్య వ్యూహాత్మక భాగస్వామ్యం దృఢమైన బంధంగా ఏర్పడిందని, తమది సమర్థత కలిగిన ప్రజాస్వామ్యాల భాగస్వామ్యమని ప్రధాని నరేంద్ర మోదీ తెలిపారు. భారత పర్యటనలో భాగంగా దిల్లీ వచ్చిన జర్మనీ ఛాన్స్‌లర్‌ ఒలాఫ్‌ షోల్జ్‌తో ప్రధాని నరేంద్ర మోదీ శుక్రవారం ద్వైపాక్షిక చర్చలు జరిపారు.
 
ఉద్రిక్తతలు, ఘర్షణలు, అనిశ్చితి వంటి పరిస్థితులను ప్రపంచం ఎదుర్కొంటుందని ప్రధాని ఆవేదన వ్యక్తం చేశారు. ఇండో-పసిఫిక్ ప్రాంతంలో తీవ్రమైన సమస్యలు ఉన్నాయని తెలిపారు. జర్మనీ అమలు చేస్తున్న ఫోకస్ ఆన్ ఇండియా స్ట్రాటజీని తాము స్వాగతిస్తున్నట్లు ప్రధాని మోదీ తెలిపారు. తమ భాగస్వామ్యాన్ని మరింత విస్తరించాలనుకుంటున్నట్లు ఒలాఫ్‌ షోల్జ్‌తో చెప్పారు. 
 
జర్మన్ బిజినెస్ ఆసియా-పసిఫిక్ కాన్ఫరెన్స్‌లో తాను పాల్గొన్నానని, దాని వల్ల తమ ఆర్థిక సహకారానికి ప్రోత్సాహం లభిస్తుందని చెప్పారు. ఆర్థిక వ్యవస్థలను వైవిధ్యపరచడంలో సహాయపడుతుందని చెప్పారు. విద్య, నైపుణ్యం సహా పలు అంశాలపై రెండు దేశాలు కలిపి పనిచేస్తున్నందుకు సంతోషంగా ఉందని పేర్కొన్నారు. యుద్ధం సమస్యలను పరిష్కరించదని, శాంతి కోసం సాధ్యమైన ప్రతి సహకారం అందించేందుకు భారత్ సిద్ధంగా ఉందని వెల్లడించారు.

అంతకుముందు డిల్లీలోనే జరిగిన 18వ ఆసియా- పసిఫిక్‌ కాన్ఫరెన్స్‌ ఆఫ్‌ జర్మన్‌ బిజినెస్‌-2024కు మోదీ హాజరై పలు వ్యాఖ్యలు చేశారు. దేశంలో పెట్టుబడులు పెట్టేందుకు జర్మనీ పారిశ్రామికవేత్తలను ఆహ్వానించారు. పెట్టుబడులకు భారత్‌ కంటే మెరుగైన ప్రాంతం మరొకటి లేదని చెప్పారు. దేశ ప్రగతి ప్రయాణంలో భాగస్వామి అయ్యేందుకు ఇదే సరైన సమయమని చెప్పారు.

విదేశీ పెట్టుబడిదారులంతా ‘మేక్ ఇన్ ఇండియా’ చొరవతో ‘మేక్ ఫర్ ది వరల్డ్’లో చేరడానికి సరైన సమయం ఇదేనని ప్రధాని ఉద్ఘాటించారు. భారతీయుల నైపుణ్యంపై జర్మనీ వ్యక్తం చేసిన విశ్వాసం అద్భుతమని మోదీ తెలిపారు. భారతీయులకు ఇచ్చే వీసాల సంఖ్యకు 20,000 నుంచి 90,000కు పెంచిన నిర్ణయాన్ని ప్రస్తావించారు. 

భారత్ గ్లోబల్ ట్రేడ్, మ్యానుఫ్యాక్చరింగ్ హబ్‌గా మారుతోంది మోదీ తెలిపారు. రోడ్లు, ఓడరేవుల్లో రికార్డు స్థాయిలో పెట్టుబడులు పెడుతున్నామని తెలిపారు. ప్రపంచ భవిష్యత్తుకు ఇండో-పసిఫిక్ ప్రాంతం చాలా ముఖ్యమైనదని చెప్పారు.

మరోవైపు, ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్య దేశంలో సమావేశం నిర్వహించుకుంటున్నామని ఓలాఫ్‌ స్కోల్జ్‌ తెలిపారు. వేగంగా అభివృద్ధి చెందుతున్న ఆర్థిక వ్యవస్థ భారత్​ది అంటూ కితాబిచ్చారు. రెండు రోజుల పర్యటన నిమిత్తం భారత్‌కు వచ్చిన ఓలాఫ్‌ స్కోల్జ్‌, శుక్రవారం ఉదయం ప్రధాని నరేంద్ర మోదీ అధికారిక నివాసంలో ఆయనను కలిశారు.
 
ప్రధాని మోదీతో తన సమావేశం గురించి ఛాన్సలర్ స్కోల్జ్ మాట్లాడుతూ, “ఈ ప్రపంచంలో, భారత్, జర్మనీల మాదిరిగానే మనకు స్నేహితులు, మిత్రదేశాలు కావాలి. ప్రియమైన నరేంద్ర మోదీ, న్యూ ఢిల్లీలో మాకు స్వాగతం పలికినందుకు ధన్యవాదాలు”అని తెలిపారు.  భారతదేశంలో తన మూడు రోజుల అధికారిక పర్యటనలో భాగంగా స్కోల్జ్ గురువారం అర్థరాత్రి ఢిల్లీకి చేరుకున్నారు. కేంద్ర హోం వ్యవహారాల సహాయ మంత్రి నిత్యానంద రాయ్ ఆయనకు స్వాగతం పలికారు.