
జమ్మూ కశ్మీర్ ముఖ్యమంత్రి ఒమర్ అబ్దుల్లా గురువారం దేశ రాజధాని డిల్లీలో ప్రధాన మంత్రి నరేంద్ర మోదీని కలుసుకున్నారు. ఇటీవలి ఎన్నికల్లో ముఖ్యమంత్రి అయిన తర్వాత ప్రధానితో ఆయన సమావేశం కావడం ఇదే తొలిసారి. కశ్మీర్‌కు రాష్ట్ర హోదా గురించి ఈ నేపథ్యంలో ఆయన ప్రధానంగా ప్రస్తావించారు.
వీరిరువురి భేటీ గురించి తరువాత అధికారిక ప్రకటన వెలువడింది. కశ్మీరీల ప్రత్యేక గుర్తింపు, వారి విశిష్టత పరిరక్షణ, రాజ్యాంగ హక్కుల పునరుద్ధరణ వంటి అంశాలను ప్రస్తావిస్తూ జమ్మూ కశ్మీర్ ప్రభుత్వం ఇటీవలే రాష్ట్రహోదా ఇవ్వాలనే డిమాండ్‌తో తీర్మానం చేసింది.
దీనిని గవర్నర్ మనోజ్ సిన్హా ఆమోదించి, కేంద్రం పరిశీలనకు పంపించారు. ఈ తీర్మానం విషయం కూడా ప్రధానితో భేటీ సందర్భంగా ప్రస్తావనకు వచ్చినట్లు తెలిసింది. ఇక రెండు మూడు రోజుల క్రితమే కశ్మీర్‌లో ఉగ్రవాదుల కాల్పుల ఘటనలు చోటుచేసుకోవడం, ఓ స్థానిక డాక్టరు, ఆరుగురు స్థానికేతర వలస కూలీలు చనిపోవడం భయాందోళనలకు దారితీసింది.
ఈ క్రమంలోనే ఇక్కడికి చేరిన ఒమర్ ముందుగా కేంద్ర హోం మంత్రి అమిత్‌షాను కలిశారు. రాష్ట్ర హోదా పునరుద్ధరణ విషయాన్ని ప్రస్తావించారు. ఇందుకు కేంద్రం సుముఖంగా ఉందని, సంబంధిత ప్రక్రియ ఆరంభమవుతుందని అమిత్ షా ఒమర్‌కు హామీ ఇచ్చినట్లు కశ్మీరీ మీడియా తెలిపింది. ఆ తర్వాత ఒమర్ కేంద్ర రవాణా, హైవేల మంత్రి నితిన్ గడ్కరినీ ఆయన కార్యాలయానికి వెళ్లి కలిశారు. ఆయనకు సాంప్రదాయక కశ్మీరీ శాలువా కానుక అందించారు. జమ్మూ కశ్మీర్‌కు మరింతగా రవాణా అనుసంధాన పనుల గురించి కూడా గడ్కరీకి అబ్దుల్లా నివేదించినట్లు వెల్లడైంది.
More Stories
ఉగ్రవాదంపై విజయానికి ప్రతీక ఆపరేషన్ సిందూర్
ఖర్గేను పరామర్శించిన ప్రధాని మోదీ
హిందుస్తానీ సంగీతకారుడు పండిట్ చన్నులాల్ మిశ్రా మృతి