
16వ బ్రిక్స్ దేశాల రెండు రోజుల శిఖరాగ్ర సదస్సు రష్యాలోని కజన్‌లో బుధవారంతో ముగిసింది. వర్ధమాన దేశాలకు కూడా ప్రాతినిధ్యం కల్పిస్తూ భద్రతా మండలి మరింత సమర్ధవంతంగా తయారయ్యేందుకు వీలుగా సంస్కరణలు తీసుకురావాల్సిన అవసరాన్ని నొక్కి చెబుతూ సంయుక్త డిక్లరేషన్‌ను ఆమోదించింది. 134 దేశాలు ఈ డిక్లరేషన్‌పై సంతకాలు చేశాయి.
ఏకపక్షంగా, అక్రమంగా ఆంక్షలు విధించడాన్ని బ్రిక్స్ తీవ్రంగా వ్యతిరేకించింది. దీనివల్ల ప్రపంచ ఆర్థిక వ్యవస్థపై తీవ్ర ప్రతికూల ప్రభావం వుంటుందని సభ్య దేశాలు ఆందోళన వ్యక్తం చేశాయి. అలాగే జాతీయ కరెన్సీలను కూడా ఉపయోగించాలని సభ్య దేశాలు నిర్ణయించాయి. తద్వారా అమెరికా డాలరుపై ఆధారపడడాన్ని తగ్గించాలని భావించాయి.
పరస్పర ప్రయోజనాల ప్రాతిపదికన వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని విస్తరించుకోవడం చాలా ముఖ్యమని బ్రిక్స్ భావిస్తోందని డిక్లరేషన్ పేర్కొంది. అణ్వస్త్ర వ్యాప్తి నిరోధక ఒప్పందాన్ని బలోపేతం చేయాలని, ప్రపంచ సుస్థిరతలో ఆ ఒప్పందం పాత్రను గుర్తించాలని పిలుపిచ్చింది. అభివృద్ధి క్రమంలో బాగా వెనుకబడిన దేశాలకు అంతర్జాతీయ ప్రక్రియల్లో మరింతగా ప్రాతినిధ్యం కల్పించాలని బ్రిక్స్ కోరింది.
సూడాన్‌లో హింస పెచ్చరిల్లడంపై ఆందోళన వ్యక్తం చేస్తూ తక్షణమే కాల్పుల విరమణకు పిలుపిచ్చింది. అలాగే గాజాలో కూడా తక్షణమే కాల్పుల విరమణ జరగాలని, బందీల విడుదల చేపట్టాలని కోరింది. ‘గాజా, వెస్ట్‌బ్యాంక్‌లో ఇజ్రాయెల్ మిలిటరీ చర్యలతో ప్రజల సామూహిక హత్యలు జరుగుతున్నాయి. వెంటనే కాల్పులు విరమించడంతో పాటు ఇరు వైపులా బందీలను విడిచిపెట్టాలి’ అని డిక్లరేషన్‌లో పేర్కొన్నారు.
ఐక్యరాజ్య సమితిలో పూర్తి స్థాయి సభ్యదేశంలో పాలస్తీనాను ఆమోదించడానికి బ్రిక్స్ దేశాలు మద్దతిచ్చాయి. చర్చల ద్వారా ఉక్రెయిన్ సమస్యను పరిష్కరించుకోవడానికి మధ్యవర్తిత్వ ప్రతిపాదనలను బ్రిక్స్ దేశాలు పరిశీలిస్తున్నాయి. బహుళపక్ష వాదం పట్ల నిబద్ధతను పునరుద్ఘాటిస్తూ, అంతర్జాతీయ వ్యవస్థలో ఐక్యరాజ్య సమితి కీలక కేంద్ర పాత్రను పరిరక్షించాలని పిలుపిచ్చింది.
‘ఉగ్రవాదాన్ని, ఉగ్రవాదానికి నిధులు సమకూరకుండా అడ్డుకునేందుకు మాకు అందరి బలమైన మద్దతు కావాలి. ఈ తీవ్రమైన అంశంలో ద్వంద్వ ప్రమాణాలకు తావు లేదు’ అని బ్రిక్స్ సభ్య దేశాలకు ప్రధాని నరేంద్ర మోదీ తన ప్రసంగంలో పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా ప్రధాన మంత్రి నరేంద్ర నేరుగా ఏ దేశం పేరును ప్రస్తావించకపోయినప్పటికీ ఉగ్రవాదాన్ని ప్రేరేపిస్తున్న పాకిస్థాన్‌కు చైనా ఆర్థిక సహాయాన్ని ఎండగట్టారు.
More Stories
వారణాసిలో చదివిన నేపాల్ కాబోయే ప్రధాని కార్కి
నేపాల్ తాత్కాలిక ప్రధానిగా సుశీల కర్కిని ఒప్పించిన ఆర్మీ చీఫ్
పాక్, స్విట్జర్లాండ్‌లకు భారత్ హెచ్చరిక