
భారత వ్యతిరేక, పాకిస్థాన్ అనుకూల నినాదాలు చేసిన ఓ నిందితుడికి మధ్యప్రదేశ్ హైకోర్టు తిక్క కుదిర్చింది. అతడికి బెయిలు మంజూరు చేస్తూ ఊహించని షరతులు విధించింది. కేసు పూర్వాపరాల్లోకి వెళ్తే ఈ ఏడాది మే 17న ఓ వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్ అయింది. భోపాల్ సమీపంలోని మిస్రోద్‌లో ఓ పంక్చర్ షాప్ నిర్వహించే ఫైసల్‌ఖాన్ ఆ వీడియోలో ‘పాకిస్థాన్ జిందాబాద్”, ‘భారత్ ముర్దాబాద్’ అని నినాదాలు చేయడం కనిపించింది.
దీంతో అతడిని అరెస్ట్ చేయాలని డిమాండ్ చేస్తూ దేశవ్యాప్తంగా నిరసనలు వెల్లువెత్తాయి. దీంతో పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేసిన పోలీసులు ఫైసల్‌ఖాన్‌ను అరెస్ట్ చేశారు. ఈ కేసులో తాజాగా మధ్యప్రదేశ్ హైకోర్టు జస్టిస్ దినేశ్ కుమార్ పలివాల్ అతడికి బెయిలు మంజూరు చేస్తూ ఫైసల్ తన దేశభక్తిని బహిరంగంగా ప్రదర్శించాలని షరతు విధించారు.
జాతీయ జెండాకు 21సార్లు వందనం చేయాలని, నెలకు రెండుసార్లు ‘భారత్ మాతా కీ జై’ అని నినదించాలని షరతులు పెట్టారు. కేసు ముగిసే వరకు ప్రతినెల మొదటి, నాలుగో మంగళవారం మిస్రోద్ పోలీస్ స్టేషన్‌లోని జెండా స్తంభం వద్ద ఇలా చేయాలని ఆదేశిస్తూ ఫైసల్‌కు బెయిలు మంజూరు చేశారు. మరోవంక, రూ 50,000 సూరిటీ ఇవ్వాలని కూడా స్పష్టం చేసింది.
“పైన పేర్కొన్న షరతు తప్పనిసరిగా బెయిల్ పేపర్లలో పొందుపరచబడాలి. అతను సీఆర్పీసీలోని సెక్షన్ 437(3) కింద పేర్కొన్న అన్ని షరతులకు కూడా కట్టుబడి ఉంటాడు” అని కోర్టు ఉత్తర్వుల్లో పేర్కొంది. బెయిల్ కోసం ఈ షరతును పాటించాలని భోపాల్ పోలీసు కమిషనర్‌ను కోర్టు ఆదేశించింది.
ఈ కేసులో తనను తప్పుగా ఇరికించారని బెయిల్ కోరుతూ ఫైజల్ హైకోర్టును ఆశ్రయించారు. అయితే, విచారణ సమయంలో, తన క్లయింట్ దేశ వ్యతిరేక నినాదాలు చేసాడని అతని న్యాయవాది అంగీకరించారు. అందువల్ల కొన్ని కఠినమైన షరతులు విధించి బెయిల్‌పై విడుదల చేయాలని న్యాయవాది అభ్యర్థించారు.
ప్రాసిక్యూషన్ లాయర్ బెయిల్ పిటిషన్‌ను వ్యతిరేకిస్తూ, అతను సాధారణ నేరస్తుడు కాదని, అతనిపై 14 క్రిమినల్ కేసులు నమోదయ్యాయని చెప్పారు. తాను పుట్టి పెరిగిన దేశానికి వ్యతిరేకంగా బహిరంగంగా నినాదాలు చేయడం వీడియోలో కనిపించిందని ప్రభుత్వ న్యాయవాది తెలిపారు. నిందితుడు భారతదేశంలో సంతృప్తి చెందకపోతే, అతను తనకు నచ్చిన దేశంలో నివసించడాన్ని ఎంచుకోవచ్చని ప్రభుత్వ న్యాయవాది హితవు చెప్పారు.
ఈ కేసులోని అన్ని వాస్తవాలు, వాదనలను పరిగణనలోకి తీసుకున్న సింగిల్ జడ్జి బెంచ్, జాతీయ జెండాకు వందనం చేసి ‘భారత్ మాతాకీ జై’ అని నినాదాలు చేసే షరతుతో బెయిల్ మంజూరు చేయడానికి అంగీకరించింది.
More Stories
ఢిల్లీలో మాత్రమే బాణాసంచాపై నిషేధం విధించాలా?
ఢిల్లీ, ముంబై హైకోర్టులకు బాంబు బెదిరింపులు
నేపాల్ అలజడులతో చిక్కుకున్న మానసరోవర్ యాత్రికులు