కంగ‌నా ‘ఎమర్జెన్సీ’కి సెన్సార్ సర్టిఫికెట్

కంగ‌నా ‘ఎమర్జెన్సీ’కి సెన్సార్ సర్టిఫికెట్

బాలీవుడ్ ఫైర్ బ్రాండ్ కంగ‌నా ర‌నౌత్‌కు ఎట్ట‌కేల‌కు ఉపశమనం ల‌భించింది. ఆమె న‌టించిన తాజా చిత్రం ‘ఎమర్జెన్సీ’కి సెన్సార్ క్లియ‌ర్ అయ్యింది. తాజాగా ‘ఎమర్జెన్సీ’ సినిమాకు సెన్సార్ బోర్డ్ సర్టిఫికెట్ ఇచ్చిన‌ట్లు తెలిపింది. ఈ సంద‌ర్భంగా సోష‌ల్ మీడియా వేదిక‌గా పోస్ట్ పెట్టింది.  ఎమర్జెన్సీ సినిమాకు సెన్సార్ సర్టిఫికెట్ లభించిందని తెలుపడానికి సంతోషిస్తున్నాం. త్వ‌ర‌లోనే ఈ సినిమా విడుద‌ల తేదీని ప్ర‌క‌టిస్తాం. ఓపిక‌తో మాకు మ‌ద్ద‌తుగా నిలిచిన వారంద‌రికీ ధ‌న్యవాదాలు అంటూ కంగ‌నా ఎక్స్ వేదిక‌గా వెల్ల‌డించింది.

భార‌త దేశ మాజీ ప్ర‌ధాని ఇందిరాగాంధీ రాజకీయ జీవితం ఆధారంగా వ‌స్తున్న ఈ చిత్రం కోర్టులో సెన్సార్ ఇబ్బందులు ఎదుర్కోన్న విష‌యం తెలిసిందే. ఈ సినిమా సెప్టెంబ‌ర్ 6న విడుద‌ల కావాల్సి ఉండ‌గా.. సినిమాకు సెన్సార్ స‌ర్టిఫికెట్ ఇవ్వ‌కపోవ‌డంతో వాయిదా పడింది. ఈ సినిమాలో త‌మ‌ను త‌క్కువ‌గా చూపించారంటూ విడుద‌ల అడ్డుకోవాల‌ని మధ్యప్రదేశ్‌లోని ఒక వ‌ర్గం న్యాయ‌స్థానాన్ని ఆశ్ర‌యించింది.

అయితే దీనిపై విచార‌ణ జ‌రిపిన కోర్టు వారి వాదనలను పరిగణలోకి మూవీలోని కొన్ని సన్నివేశాలను తొల‌గించాల‌ని సెన్సార్‌ బోర్డుకు సూచించింది. అయితే ఈ సినిమాలోని కొన్ని సీన్స్ క‌ట్ చేస్తే.. సర్టిఫికెట్‌ ఇస్తామని సెన్సార్‌ బోర్డు నిర్మాణ సంస్థ‌కు చెప్పింది. దీంతో ఈ విష‌యంపై నిర్మాణ సంస్థ సెన్సార్ బోర్డ్ పెట్టిన ష‌ర‌తుల‌కు ఒప్పుకోవ‌డంతో తాజాగా సెన్సార్ సర్టిఫికెట్‌ను జారీ చేసింది.

ఈ సినిమాలో ఇందిరాగాంధీగా కంగనా నటిస్తుండ‌గా.. జీ స్టూడియోస్‌, మణికర్ణిక ఫిలిమ్స్‌ బ్యానర్లు నిర్మిస్తున్నాయి. ఈ చిత్రంలో అనుపమ్‌ ఖేర్‌, మహిమా చౌదరి, మిలింద్‌ సోమన్‌, శ్రేయాస్‌ తల్పాడే తదితరులు కీలక పాత్రల్లో నటిస్తున్నారు.