అక్రమ వలసదారులకు పౌరసత్వం కల్పించే సెక్షన్ రాజ్యాంగబద్ధమే

అక్రమ వలసదారులకు పౌరసత్వం కల్పించే సెక్షన్ రాజ్యాంగబద్ధమే

పౌరసత్వ చట్టం-1955లోని సెక్షన్‌ 6ఎ రాజ్యంగ బద్ధతను సుప్రీంకోర్టు సమర్థించింది. సెక్షన్ 6ఎ  రాజ్యాంగ చట్టబద్ధతను సవాల్‌ చేస్తూ దాఖలైన పిటిషన్‌ను విచారించిన సర్వోన్నత న్యాయస్థానం గురువారం ఈమేరకు తీర్పు ఇచ్చింది. రాజ్యాంగం ప్రకారం సెక్షన్‌ 6ఎ  చెల్లుబాటు అవుతుందని సీజేఐ డీవై చంద్రచూడ్‌, జస్టిస్‌ సూర్యకాంత్‌, జస్టిస్‌ ఎంఎం సుందరేశ్‌, జస్టిస్‌ జేబీ పార్థీవాలా, జస్టిస్‌ మనోజ్‌మిశ్రాలతో కూడిన ధర్మాసనం 4:1 మెజారిటీ తీర్పును వెలువరించింది.

న్యాయమూర్తుల్లో జస్టిస్‌ పార్థీవాలా మాత్రమే ఇది రాజ్యాంగ విరుద్ధమంటూ భిన్నాభిప్రాయాన్ని వ్యక్తంచేశారు. విచారణ సందర్భంగా మెజారిటీ తీర్పును సీజేఐ డీవై చంద్రచూడ్ చదివి వినిపించారు. “అక్రమ వలసలకు అసోం ఒప్పందం ఓ రాజకీయ పరిష్కారం. అదే సమయంలో సెక్షన్‌-6ఎ అనేది చట్టబద్ధమైన మార్గం. ఈ నిబంధనలు రూపొందించడానికి మెజార్టీతో కూడిన పార్లమెంటుకు శక్తి ఉంది” అని తెలిపారు.

“మానవీయ ఆందోళనలను పరిష్కరించి, స్థానికుల ప్రయోజనాలను కాపాడే సమతౌల్యత ఈ సెక్షన్‌కు ఉంది. ఇక దీనిలోని కటాఫ్‌ డేట్‌గా నిర్ణయించిన 1971 మార్చి 25 అనేది సరైనదే. ఎందుకంటే అప్పటికే బంగ్లాదేశ్‌ యుద్ధం ముగిసింది. బంగ్లాదేశ్‌ యుద్ధం నేపథ్యంలోనే ఈ సెక్షన్‌ తీసుకొచ్చిన విషయాన్ని ఇది చెబుతోంది. ఈ సెక్షన్‌ అంత ఎక్కువగా జనాభాను కలుపుకోలేదు మరీ తక్కువగాను విలీనం చేసుకోలేదు” అని పేర్కొన్నారు.

మరోవైపు, సెక్షన్ 6ఎ రాజ్యాంగ విరుద్ధమని జస్టిస్ పార్దీవాలా అభిప్రాయపడ్డారు. “చట్టం అమల్లోకి వచ్చే సమయంలో చెల్లుబాటు కావచ్చు కానీ కాలక్రమేణా తాత్కాలికంగా లోపభూయిష్టంగా మారుతుంటుంది. ఒక రాష్ట్రంలో వివిధ జాతుల సమూహాలు ఉన్నంత మాత్రాన ఆర్టికల్ 29(1)ను ఉల్లంఘించడం కాదు” అని జస్టిస్ పార్దీవాలా వ్యాఖ్యానించారు.

పౌరసత్వ చట్టం-1955 సెక్షన్‌6ఎ ప్రకారం, 1966 జనవరి నుంచి 1971 మార్చి 25లోపు అసోంకు వచ్చిన వలసదారులు పౌరసత్వం కోరవచ్చు. ఈ నిబంధనను 1985లో అసోం ఒప్పందం తర్వాత తీసుకొచ్చారు. అసోంలోకి బంగ్లాదేశ్‌ వలసలపై ఉద్యమించిన వారితో కేంద్ర ప్రభుత్వం చేసుకున్న ఒప్పందమే ఇది. దీని చట్టబద్ధతపై అసోంలోని కొన్ని స్థానిక గ్రూపులు న్యాయస్థానంలో సవాలు చేశాయి. ఇది రాజ్యాంగ పీఠికకు విరుద్ధమని, పౌరహక్కుల ఉల్లంఘనగా పేర్కొంటూ రాజకీయ హక్కులను హరించడమేనని వాదించాయి.