అమెరికా నుండి రూ 32,000 కోట్లతో ప్రిడేటర్ డ్రోన్లు 

అమెరికా నుండి రూ 32,000 కోట్లతో ప్రిడేటర్ డ్రోన్లు 

దేశ సరిహద్దుల్లో చైనా, పాకిస్థాన్‌ నుంచి ఏ క్షణంలో ఎలాంటి పరిణామాలు ఎదురవుతాయో చెప్పలేని పరిస్థితుల్లో భారత్‌ అత్యాధునిక ఆయుధాలు సమకూర్చుకుంటోంది. ఇందులో భాగంగా సైన్యాన్ని మరింత పటిష్ఠపర్చేందుకు అమెరికాతో అధునాతన డ్రోన్ల కొనుగోలు ఒప్పందం కుదుర్చుకుంది.  ఈ మేరకు రక్షణ వర్గాల సీనియర్ల సమక్షంలో మంగళవారం ఇరు దేశాల అధికారులు సంతకం చేశారు.

ఈ ఒప్పందం కింద అమెరికా నుంచి 31 ఎంక్యూ9బీ ప్రిడేటర్ డ్రోన్లను భారత్ కొనుగోలు చేయనుంది. ఈ డీల్ విలువ రూ.32,000 కోట్లు అని భారత రక్షణశాఖ అధికారులు తెలిపారు. ఈ డ్రోన్లను ప్రత్యేక క్షిపణులతో పాటు లేజర్‌ గైడెడ్‌ బాంబులనూ తయారీ సంస్థ జనరల్‌ అటామిక్స్‌ అందించనుంది. 31 డ్రోన్లలో 15 నౌకాదళానికి, 8 సైన్యానికి, మిగిలిన ఎనిమిందిటిని వాయుసేనకు కేటాయించనున్నారు. డ్రోన్ల మెయింటెనెన్స్‌, రిపేర్‌, ఓవర్‌ హాల్‌ కూడా భారత్లోనే తయారీ సంస్థ చేపడుతుంది.

కాగా, అమెరికాతో ఈ ఒప్పందం కోసం చాలా కాలంగా భారత్ ప్రయత్నించింది. కొన్నివారాల క్రితం అడ్డంకులన్నీ తొలగిపోవడం వల్ల అగ్రరాజ్యంతో భారత్ ఈ అగ్రిమెంట్ చేసుకుంది. ఈ ఏడాది ఆగస్టులో అమెరికాలో పర్యటించిన రక్షణ మంత్రి రాజ్‌నాథ్‌ సింగ్‌ బృందం ఆ డ్రోన్ల సామర్థ్యాలను పరిశీలించారు.  హంటర్‌ కిల్లర్లుగా పేరున్న ఈ డ్రోన్లను ఇప్పటికే పశ్చిమాసియా, అఫ్గాన్‌ సంక్షోభాల్లో వినియోగించారు.

ముఖ్యంగా చైనాతో ఉన్న వాస్తవాధీన రేఖ వెంబడి ఉంచేందుకు ఇవి అవసరమని భారత్‌ భావిస్తోంది. చాలా ఎక్కువ ఎత్తులో ఎగరగలిగే ఎంక్యూ9బీ డ్రోన్లు, సుమారు 40 గంటలకుపైగా గాల్లోనే ఉండగలవు.  వీటికి నాలుగు హెల్‌ ఫైర్‌ క్షిపణులు, 450 కిలోల బాంబులను మోసుకెళ్లగల సామర్థ్యం ఉంది. ఇప్పటికే వీటిల్లో మరో రకమైన సీగార్డియన్‌ డ్రోన్లను భారత్‌ వినియోగిస్తోంది.

వాటినీ జనరల్‌ అటామిక్స్‌ నుంచి లీజ్‌పై భారత్‌ తీసుకొంది. ఈ ఏడాది జనవరిలో కాంట్రాక్టు ముగియగా నౌకాదళం మరో నాలుగేళ్లపాటు కాంట్రాక్టును పొడిగించింది. చెన్నై సమీపంలోని ఐఎన్ఎస్ రాజాలి, గుజరాత్‌లోని పోర్‌ బందర్, ఉత్తర్ప్రదేశ్‌లోని సర్సావా, గోరఖ్పుర్ సహా దేశవ్యాప్తంగా ఉన్న మరో నాలుగు ప్రదేశాల్లో ఈ డ్రోన్లను భారత్ ఉపయోగించనుంది. శాస్త్రీయ అధ్యయనం తర్వాత భారత రక్షణశాఖ అమెరికా నుంచి డ్రోన్ల కొనుగోలుకు ఒప్పందం కుదుర్చుకుంది.