జానీ మాస్టర్‌ బెయిల్‌ పిటిషన్‌ను కొట్టివేసిన రంగారెడ్డి కోర్టు

జానీ మాస్టర్‌ బెయిల్‌ పిటిషన్‌ను కొట్టివేసిన రంగారెడ్డి కోర్టు
టాలీవుడ్‌ ప్రముఖ కొరియోగ్రాఫర్‌ జానీ మాస్టర్‌ దాఖలు చేసిన బెయిల్‌ పిటిషన్‌ను రంగారెడ్డి కోర్టు కొట్టివేసింది. అసిస్టెంట్‌ కొరియోగ్రాఫర్‌ లైంగిక దాడి ఆరోపణలు ఎదుర్కొంటున్న విషయం తెలిసిందే. ఇటీవల జానీ మాస్టర్‌ అవార్డు తీసుకునేందుకు కోర్టు అక్టోబర్‌ 6 నుంచి 10 వరకు మధ్యంతర బెయిల్‌ను మంజూరు చేసింది.  అయితే, కొరియోగ్రాఫర్‌పై లైంగిక దాడి కేసుతో పాటు పోక్సో యాక్ట్‌ కింద కేసు నమోదైన నేపథ్యంలో కేంద్రం జానీ మాస్టర్‌కు ఇచ్చిన అవార్డును రద్దు చేసింది.
ఈ కేసులో కొరియోగ్రాఫర్‌కు ఇచ్చిన మధ్యంతర బెయిల్‌ను రద్దు చేయాలని కోర్టును కోరారు. ఈ క్రమంలో ఇరువర్గాల వాదనలు విన్న కోర్టు రెగ్యులర్‌ బెయిల్‌ను ఇచ్చేందుకు నిరాకరించింది.  కేసు తీవ్రతతో పాటు బాధితురాలిని బెదిరించడం, సాక్షులను ప్రభావితం చేసే అవకాశం ఉందన్న నాంపల్లి పోలీసుల వాదనలతో కోర్టు ఏకీభవించింది. అసిస్టెంట్‌ కొరియోగ్రాఫర్‌పై లైంగిక దాడి కేసులో జానీ మాస్టర్‌ను రాజేంద్రనగర్‌ ఎస్‌ఓటీ పోలీసులు గోవాలో అదుపులోకి తీసుకున్నారు.
గోవాలోని స్థానిక కోర్టులో ప్రవేశపెట్టి పీటీ వారెంట్‌ను తీసుకొని హైదరాబాద్‌కు తీసుకువచ్చారు.  రాజేంద్రనగర్‌ సర్కిల్‌లోని ఉప్పరపల్లిలోని 13వ అదనపు మెట్రోపాలిటన్‌ మెజిస్ట్రేట్‌ రెండో అదనపు జడ్జి ముందు హాజరుపరచగా.. 14 రోజుల జ్యుడీషియల్‌ రిమాండ్‌ విధించారు. ఆ తర్వాత నాలుగు రోజుల పోలీసుల కస్టడీకి ఇచ్చింది. అయితే, తనపై వచ్చిన ఆరోపణలు జానీ మాస్టర్‌ ఖండించారు.