9/11 తరహా భారీ ఉగ్ర దాడికి హమాస్ కుట్ర!

9/11 తరహా భారీ ఉగ్ర దాడికి హమాస్ కుట్ర!

పశ్చిమాసియాలో యుద్ధానికి కారణమైన హమాస్ మిలిటెంట్ సంస్థ, గత ఏడాది అక్టోబర్‌ 7న ఇజ్రాయెల్‌పై చేసిన దాడి కంటే ముందు 9/11తరహా భారీ ఉగ్ర దాడికి కుట్ర పన్ని నట్లు తెలుస్తోంది. ఈ మేరకు అంతర్జాతీయ మీడియా కథనాన్ని ప్రచురించింది. ఇజ్రాయెల్‌ నగరం టెల్‌అవీవ్‌లోని 70 అంతస్తుల భవనం మోషె అవివ్‌, అజ్రీలీ మాల్‌ కాంప్లెక్స్‌పై దాడులు చేసి నేలమట్టం చేయాలని హమాస్‌ కుట్రలు పన్నినట్లు తెలుస్తోంది.

హమాస్‌ రాజకీయ, సైనిక విభాగాలు వరుసగా జరిపిన సమావేశాల్లో ఈ కుట్రకు ప్రణాళిక రచించినట్లు తెలుస్తోంది. ఈ మేరకు ఇరాన్‌ అధికారులతో హమాస్‌ నేత యాహ్యా సిన్వార్‌ సంభాషణలను కూడా గుర్తించారు. ఇందుకు సంబంధించిన ఎలక్ట్రానిక్‌ రికార్డులు, పత్రాలను గాజా పట్టీలోని హమాస్‌ కమాండ్‌ సెంటర్ల నుంచి ఇజ్రాయెల్‌ సైన్యం స్వాధీనం చేసుకుంది.

వాటిని ఐడీఎఫ్‌ బలగాలు అంతర్జాతీయ మీడియాకు అందజేశాయి. సిన్వార్‌తో పాటు మరికొందరు కీలక నేతలు ఈ సమావేశాలకు హాజరైనట్లు తెలుస్తోంది. అయితే టెల్‌ అవివ్‌లోని ఆకాశహర్మ్యాలపై దాడి ఎలా చేయాలన్నదానిపై హమాస్‌ వద్ద స్పష్టత లేనట్లు తెలుస్తోంది. ఇజ్రాయెల్‌లోని రైల్వే నెట్‌వర్క్‌ లక్ష్యంగా కూడా దాడులు చేయాలని హమాస్‌ కుట్ర పన్నినట్లు ఐడీఎఫ్‌ పేర్కొంది.

ఇజ్రాయెల్‌పై దాడి కోసం రైల్వేలు, బోట్లు, గుర్రపు బగ్గీలను వినియోగించాలని హమాస్‌ ప్రణాళిక రచించింది. ఇందుకోసం ఇరాన్‌ నేతలకు హమాస్‌ రాసిన ఉత్తరాలను కూడా ఐడీఎఫ్‌ బలగాలు స్వాధీనం చేసుకున్నాయి. 2021లో అలీ ఖమేనీ సహా ఇరాన్‌ కీలక నాయకులను సిన్వార్‌ కలిసినట్లు తెలుస్తోంది. ఈ సందర్భంగా ఆర్థిక, సైనిక సాయం కూడా కోరినట్లు సమాచారం.

హమాస్‌ వద్ద ఇజ్రాయెల్‌లోని కీలక ప్రదేశాలకు చెందిన సుమారు 17 వేల ఫొటోలు ఉన్నాయి. వీటిలో డ్రోన్‌ కెమెరాలతో తీసిన ఫోటోలు, ఉపగ్రహ చిత్రాలు ఉన్నాయి. ఈ ఫొటోల్లో కొన్నింటిని సామాజిక మాధ్యమాల నుంచి హమాస్‌ సేకరించినట్లు తెలుస్తోంది.