తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు రేవంత్ రెడ్డి, చంద్రబాబు నాయుడు కలసిమెలసి రాష్ట్రాల అభివృద్ధి కోసం పని చేస్తూ రెండు తెలుగు రాష్ట్రాలను అగ్రగామిగా నిలపాలని హర్యానా గవర్నర్ బండారు దత్తాత్రేయ అభిలాష వ్యక్తం చేశారు. రాజకీయాలకతీతంగా పరస్పరం సహకరించుకుని, ఐకమత్యంతో ముందుకు వెళ్లాలని సూచించారు.
హైదరాబాద్ నాంపల్లి ఎగ్జిబిషన్ మైదానంలో దసరా సమ్మేళనం-2024 ప్రారంభ సూచికగా ఢంకా మోగించగా, మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు లాంఛనంగా ప్రారంభించారు. సంప్రదాయ నృత్యాలు, కోలాటం, గిరిజన నృత్యాలు, పోతరాజుల విన్యాసాలు, పులి వేషాలు అలయ్ బలయ్‌లో తెలంగాణ సంస్కృతి సంప్రదాయాలకు అద్దంపట్టాయి. హైదరాబాదీ సంప్రదాయ మర్ఫా వాయిద్య సంగీతం విశేషంగా ఆకట్టుకుంది.
రాజకీయాలతో సంబంధం లేకుండా 2005లో అలయ్ బలయ్ ప్రారంభించామని, ప్రేమ, ఆత్మీయత, ఐఖ్యత చాటి చెప్పాలన్నదే అలయ్ బలయ్ లక్ష్యమని దత్తాత్రేయ చెప్పారు. ఈసారి కులవృత్తులకు ప్రాధాన్యత ఇస్తూ అలయ్ బలయ్‌లో ప్రదర్శించామని తెలిపారు. తెలంగాణ గవర్నర్ జిష్టుదేవ్ వర్మ, ఉత్తరాఖండ్ గవర్నర్ గుర్మిత్ సింగ్, రాజస్థాన్ గవర్నర్ హరిబాబు పగాడే, మేఘాలయ గవర్నర్ సీహెచ్ విజయ శంకర్, కేంద్ర మంత్రి జి.కిషన్ రెడ్డి, వివిధ పార్టీల నాయకులు, వివిధ రంగాల ప్రముఖులు హాజరయ్యారు.
స్నేహశీలి అయిన బండారు దత్తాత్రేయ ఏటా ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తూ ఓ చక్కని సంప్రదాయాన్ని ఏర్పాటు చేయటం, వారి కుమార్తె విజయలక్ష్మి ఆ సంస్కృతిని కొనసాగించటం అభినందనీయమని వెంకయ్య నాయుడు కొనియాడారు. ఇలాంటి కార్యక్రమాలు రాజకీయాలకు అతీతంగా, సమైక్యతా భావాన్ని పెంపొందిస్తాయని చెప్పారు.
ప్రస్తుత పరిస్థితుల్లో సమైక్యతా వారధుల నిర్మాణం మనందరి సామాజిక బాధ్యతగా పేర్కొన్న ఆయన, ఒకప్పుడు ఐక్యత లేక పరాయి పాలనలో సమస్యలు అనుభవించామని గుర్తు చేశారు. ఇప్పుడు పాశ్చాత్య అనుకరణ కారణంగా కుటుంబానికి, సమాజానికి దూరమౌతున్నామని తెలిపారు. ఈ పరిస్థితుల్లో మన భారతీయ సంస్కృతిలో భాగమైన ఇలాంటి కార్యక్రమాల ద్వారా అందరూ ఏకం కావాలని ఆశాభావం వ్యక్తం చేశారు.
తెలంగాణ ఉద్యమ సమయంలో జేఏసీ ఆవిర్భావానికి కూడా అలయ్ బలయ్ ఉపయోగపడిందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గుర్తు చేశారు. తెలంగాణ సంప్రదాయాలు కాపాడుకోవడం మనందరి బాధ్యతగా సీఎం పేర్కొన్నారు. ఆర్‌ఎస్‌ఎస్ నుంచి ఆర్‌ఎస్‌యూ వరకు కమ్యూనిస్టుల నుంచి కాంగ్రెస్ కూడా తెలంగాణ కోసం ఉద్యమించాయని చెప్పారు. అన్ని సామాజిక వర్గాలు కార్యోన్ముఖులు కావడానికి అలయ్ బలయ్ దోహదపడిందని సీఎం వివరించారు
More Stories
మాలవీయ మిషన్ పేద విద్యార్థులకు ఆర్థిక సహాయం
స్థానిక సంస్థల ఎన్నికల్లో బిజెపి అభ్యర్థుల ఎంపిక ప్రారంభం
తెలంగాణ బతుకమ్మకు రెండు గిన్నిస్ రికార్డులు