టాటా ట్రస్ట్స్‌ చైర్మన్‌గా నోయెల్‌ టాటా నియామకం

టాటా ట్రస్ట్స్‌ చైర్మన్‌గా నోయెల్‌ టాటా నియామకం
టాటా ట్రస్ట్స్‌ చైర్మన్‌ గా నోయెల్‌ టాటా నియమితులయ్యారు. పారిశ్రామికవేత్త, టాటా గ్రూప్స్‌ గౌరవ చైర్మన్‌ రతన్‌ టాటా బుధవారం రాత్రి కన్నుమూసిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలోనే టాటా ట్రస్ట్స్‌ చైర్మన్‌గా నోయెల్‌ను ఎన్నుకుంటూ ట్రస్ట్‌ బోర్డుల సభ్యులు నిర్ణయం తీసుకున్నారు. టాటా గ్రూప్‌ను హోల్డింగ్ కంపెనీ టాటా సన్స్ నిర్వహిస్తోంది.
అందులో టాటా కుటుంబంతో అనుబంధం ఉన్న ఐదు ట్రస్టులు ఉన్నాయి. ఇందులో కీలకమైనవి రెండు. అది సర్‌ దొరాబ్జీ టాటా ట్రస్ట్‌. మరొకటి సర్‌ రతన్‌ టాటా ట్రస్ట్‌. టాటా సన్స్‌లో ఈ రెండింటికి ఎక్కువగా వాటాలున్నాయి.  ఈ రెండు ట్రస్టులకు కంపెనీలో దాదాపు 52 శాతం వాటా ఉన్నది. ఐదు ట్రస్ట్‌లకు కలిపి టాటా గ్రూప్‌ హోల్డింగ్స్‌ కంపెనీలో మొత్తం 67శాతం వాటా ఉన్నది.
రతన్‌ టాటా చనిపోయే వరకు టాటా గ్రూప్స్‌ గౌరవ చైర్మన్‌గా కొనసాగారు. ప్రస్తుతం ఆయన మరణంతో టాటా ట్రస్ట్స్‌ చైర్మన్‌గా నోయెల్‌ టాటా నియమితులయ్యారు.  ఇక టాటా ట్రస్ట్స్‌ చైర్మన్‌పై 13 మంది ట్రస్టీలు ఏకాభిప్రాయం తీసుకున్నారు. వారంతా నోయెల్ టాటానే టాటా ట్రస్ట్‌ల చైర్మన్‌గా ఏకగ్రీవంగా ఎన్నుకున్నట్లు తెలుస్తోంది.
తాజా పరిణామంతో సర్ దొరాబ్జీ టాటా ట్రస్ట్‌కు 11వ చైర్మన్‌గా, సర్ రతన్ టాటా ట్రస్ట్‌కు ఆరో చైర్మన్‌గా నోయెల్‌ టాటా నియమితులయ్యారు. నోయెల్‌ టాటా రతన్‌ టాటా సవతి తల్లి సిమోన్‌ టాటా కుమారుడు. ఆయన టాటా గ్రూప్‌తో 40 సంవత్సరాలుగా అనుబంధం ఉన్నది. కంపెనీలోని బోర్డుల్లో వివిధ హోదాల్లో పని చేశారు. ట్రెంట్, టాటా ఫైనాన్షియల్ లిమిటెడ్, వోల్టాస్, టాటా ఇన్వెస్ట్‌మెంట్ కార్పొరేషన్‌లకు ఆయన చైర్మన్‌గా ఉన్నారు. 

టాటా స్టీల్ అండ్ టైటాన్ కంపెనీ లిమిటెడ్ వైస్ ప్రెసిడెంట్‌గా, సర్ రతన్ టాటా ట్రస్ట్, సర్ దొరాబ్జీ టాటా ట్రస్ట్ బోర్డుల్లో ట్రస్టీగా ఉన్నారు. టాటా ఇంటర్నేషనల్ లిమిటెడ్ మేనేజింగ్ డైరెక్టర్‌గా ఆగస్ట్ 2010 నుంచి నవంబర్ 2021 సేవలందించారు. ఆయన పదవీకాలంలో కంపెనీ టర్నోవర్‌ను 500 మిలియన్‌ డాలర్ల నుంచి 3వేల బిలియన్లకు పెంచారు.

రతన్‌ టాటా తల్లిదండ్రులు నావ‌ల్ టాటా, సూని టాటా 1940లో విడిపోయారు. ఆ తర్వాత నావల్‌ టాటా సిమోన్‌ను వివాహం చేసుకున్నారు. వీరికి పుట్టిన కుమారుడే నోయెల్‌ టాటా. ఆయన 1957 లో జన్మించాడు. ససెక్స్ విశ్వవిద్యాలయం నుంచి బ్యాచిలర్ డిగ్రీని అందుకున్నాడు. ఇన్సెడ్ లో ఇంటర్నేషనల్ ఎగ్జిక్యూటివ్ ప్రోగ్రామ్ ని కూడా పూర్తి చేశాడు.నోయెల్‌ టాటా.

టాటా సన్స్‌లో అతిపెద్ద వాటాదారు అయిన పల్లోంజి మిస్త్రీ కుమార్తె ఆలూ మిస్త్రీని వివాహం చేసుకున్నాడు. వీరికి ముగ్గురు పిల్లలు..మయా టాటా, నెవిల్లే టాటా, లీ టాటా ఉన్నారు. వీరు కూడా టాటా సంస్థలో పలు హోదాల్లో బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు.